కాంగ్రెస్‌ తీరుపై సీపీఐ తీవ్ర అసంతృప్తి...24మంది అభ్యర్ధులతో జాబితా రెడీ

x
Highlights

మహాకూటమిలో సీట్ల పంచాయితీ మరింత ముదిరింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌తో కలిసుంటామని చెప్పిన పార్టీలు సీట్ల లెక్క తేల్చకపోవడంతో తమ...

మహాకూటమిలో సీట్ల పంచాయితీ మరింత ముదిరింది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌తో కలిసుంటామని చెప్పిన పార్టీలు సీట్ల లెక్క తేల్చకపోవడంతో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 14 సీట్లతో టీడీపీతో సర్దుబాటును సక్సెస్‌ చేసిన కాంగ్రెస్‌ సీపీఐ, జనసమితి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీట్ల లెక్క త్వరగా తేల్చకపోతే కూటమి నుంచి బయటకు వెళ్తామంటూ కొంతకాలంగా కోదండరామ్‌ పార్టీ బాహటంగానే చెప్పుకొచ్చింది. తాజాగా సీపీఐ కూడా సీట్లసర్దుబాటును త్వరగా తేల్చకపోతే కూటమి నుంచి బయటకు వస్తామని స్పష్టం చేస్తోంది.

కాసేపట్లో సీపీఐ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న సీపీఐ.. ఒంటరిపోరుకు సిద్ధమంటోంది. 24 మంది అభ్యర్థులతో జాబితా కూడా సిద్ధం చేసుకుంది. ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ నుంచి 5 సీట్లు ఆఫర్‌ ఉంటేనే కూటమిలో కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హుస్నాబాద్‌, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, దేవరకొండ, మునుగోడు, ఆలేరు స్థానాలను సీపీఐ కోరుతోంది. దీనికి సంబంధించి చివరగా కాంగ్రెస్‌తో చర్చించాలని సీపీఐ నిర్ణయించింది.

ఇటు కోదండరామ్‌ పార్టీ కూడా కూటమి విషయంలో కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది. కాసేపట్లో కోదండరామ్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో మీడియాతో కోదండరామ్‌ ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో మహాకూటమి ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. సీపీఐ, జనసమితి సీట్ల విషయంలో కీలక నిర్ణ‍యం తీసుకోనుంది. ఆ తర్వాతే ఆయా పార్టీలు తమ నిర్ణయాలను వెల్లడించనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories