ఉత్తమ్‌ సెగలు...తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు

ఉత్తమ్‌ సెగలు...తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
x
Highlights

అంతర్గత కుమ్ములాటలతో ఎప్పటికప్పుడు వెనుకబడిపోయే తెలంగాణ కాంగ్రెస్‌‌లో మళ్లీ కాక రేగుతోంది. ఉత్తమ్ సారథ్యంలోనైనా కాంగ్రెస్ దూసుకెళ్తుందని భావిస్తే.....

అంతర్గత కుమ్ములాటలతో ఎప్పటికప్పుడు వెనుకబడిపోయే తెలంగాణ కాంగ్రెస్‌‌లో మళ్లీ కాక రేగుతోంది. ఉత్తమ్ సారథ్యంలోనైనా కాంగ్రెస్ దూసుకెళ్తుందని భావిస్తే.. ఉత్తమ్ తీరుపై నేతలు మండిపడే పరిస్థితి తలెత్తింది. ఉత్తమ్ తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లు బహిరంగంగానే విమర్శించడం పరిస్థితికి అద్దం పడుతోంది.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌పై సీనియర్లు మండిపడటానికి చాలా కారణాలున్నాయి. కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వం రద్దుకు ఉత్తమ్ అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఒక కారణమైతే.. అదే సమయంలో బస్సు యాత్రకు దిగడం మరో కారణం. ఇవే కాకుండా ఈ మధ్య ఓ సభలో సీనియర్లు ఉండగా ఉత్తమ్ కుమార్ సీఎం అభ్యర్ధి అంటూ అతని అనుచరులు ప్రసంగించడం కూడా అగ్గి రేపుతోంది.

తమ శాసనసభ్యత్వం రద్దుపై రాష్ట్ర కాంగ్రెస్ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఇప్పటికే అధిష్టానానికి కోమటిరెడ్డి, సంపత్ లేఖ రాశారు. రద్దు వ్యవహారాన్ని ఉత్తమ్ పట్టించుకోకుండా బస్సు యాత్రలకు దిగడం కూడా రాష్ట్రంలోని సీనియర్లకు రుచించలేదు. మరోవైపు బస్సుయాత్రలో భాగంగా జరిగిన పాలకుర్తి సభలో ఇతర నేతలను సంప్రదించకుండా పార్టీ అభ్యర్ధిగా జంగా రాఘవరెడ్డిని ఉత్తమ్ ప్రకటించడంపై సీనియర్లు చిన్నబుచ్చుకున్నారు. అదే సభలో కొంతమంది నేతలు.. సీనియర్లు వేదికపై ఉండగానే .. సీఎం అభ్యర్ధి.. ఉత్తమ్ అంటూ పదే పదే చెప్పడం సీనియర్లకు ఆగ్రహం కలిగించింది.

పార్టీ ప్రకటించకుండా ఉత్తమ్ తన అనుచరులతో ఎలా సీఎం అభ్యర్ధి అని చెప్పించుకుంటారని కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. జానా, షబ్బీర్‌లాంటి సీనియర్లు ఉత్తమ్ తీరును నిరసిస్తూ బస్సు యాత్రలకు దూరమయ్యేందుకు యోచిస్తుండటం దుమారం రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories