సీనియర్లకు సెలవ్ ?

సీనియర్లకు సెలవ్ ?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కొత్త టెన్షన్‌ మొదలయిందా ? గోవా, యూపీ నేతల దారిలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు నడుస్తారా ? పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కొత్త టెన్షన్‌ మొదలయిందా ? గోవా, యూపీ నేతల దారిలో తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు నడుస్తారా ? పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటారా ? లేదంటే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తారా ? కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఎప్పుడు లేని టెన్షన్‌...ఇప్పుడెందుకు పట్టుకుంది.

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కొత్త భయం పట్టుకుంది. సోనియా గాంధీ ఉన్నంత కాలం...ప్రశాంతంగా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన పార్టీ అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీలో 70ఏళ్లకు పైబడిన నేతలంతా స్వచ్ఛందంగా పదవులు వదులుకోవాలని సీనియర్లు తమ అనుభవాలను పార్టీకి అందించాలని సూచించారు.

రాహుల్ గాంధీ సూచనతో ఉత్తరప్రదేశ్‌ పీసీసీ చీఫ్ రాజ్‌ బబ్బర్‌, గోవా పీసీసీ చీఫ్ శాంతారాం, గుజరాత్‌ చీఫ్ భరత్ సింహ్ సోలంకిలు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడిదే అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 70 ఏళ్లకు పైబడిన చాలా మంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌లకు ఎప్పుడో 70 ఏళ్లు దాటిపోయాయ్. జానారెడ్డి సీఎల్పీ నేతగా వ్యవహరిస్తుంటే గీతారెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. జానారెడ్డి, జైపాల్‌రెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీహెచ్‌ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా కీలక పదవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారు.

రాహుల్ గాంధీ పిలుపుతో పదవుల నుంచి తప్పు కోవాల్సి వస్తే జానారెడ్డి, జైపాల్‌రెడ్డి,గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్‌లు ముందు వరుసలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకుంటుంటే తెలంగాణ నేతలు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొంది సీఎం పదవికి పోటీ పడేందుకు సీనియర్‌ నేతలు ఉత్సాహం చూపుతున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై టీ కాంగ్ సీనియర్లు స్పందించకపోవడం పార్టీలో చర్చ నీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories