టీడీపీ ఎఫెక్ట్‌...వరుస రాజీనామాలతో ఏపీ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ

టీడీపీ ఎఫెక్ట్‌...వరుస రాజీనామాలతో ఏపీ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ
x
Highlights

టీడీపీతో దోస్తీ... ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని సీనియర్‌...

టీడీపీతో దోస్తీ... ఏపీ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిన్నమొన్నటివరకు కాంగ్రెస్‌ పార్టీని దుమ్మెత్తిపోసిన తెలుగుదేశంతో చేతులు కలపడాన్ని సీనియర్‌ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఉప్పూ నిప్పులా వ్యవహరించిన పార్టీతో ఎలా జత కడతారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు సోనియాగాంధీని ఇటలీ దెయ్యమని, అవినీతి అనకొండ అంటూ నోరు పారేసుకున్న చంద్రబాబుతో రాహుల్‌ జట్టు కట్టడాన్ని ఏపీ కాంగ్రెస్‌ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు చేయి చెంతకు చేరారని, కానీ చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని తెలుగుదేశంతో దోస్తీ మరింత ఇరకాటంలోకి నెట్టింది. టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. టీడీపీతో కాంగ్రెస్‌ జట్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్‌ నేత వట్టి వసంత్‌కుమార్ పార్టీకి రాజీనామా చేయగా, ఇప్పుడు మరో సీనియర్ లీడర్‌ మాజీ మంత్రి సి రామచంద్రయ్య షాకిచ్చారు. చంద్రబాబు అండ్ టీడీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పోరాటాలు చేశామని, అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇదే బాటలో మరికొందరు సీనియర్ లీడర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీతో దోస్తీ మరింత చిక్కుల్లో పడేసింది. తెలుగుదేశంతో దోస్తీని వ్యతిరేకిస్తూ సీనియర్‌ లీడర్లు పార్టీకి గుడ్‌బై‌ చెబుతుండటంతో మొత్తం ఏపీ కాంగ్రెస్‌ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే సీనియర్ లీడర్ల రాజీనామాలపై స్పందించిన ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఎవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్‌ ఉంటుందని భరోసా ఇస్తున్నారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ దోస్తీ పరోక్షంగా జనసేనకు లాభం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. వీళ్లంతా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. కాంగ్రెస్‌-టీడీపీ దోస్తీని ముందే తెలుసుకుని నాదెండ్ల పవన్‌ పార్టీలో చేరిపోయారని తెలుస్తోంది. ఇక తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వట్టి వసంత్‌కుమార్‌, సి.రామచంద్రయ్యలు కూడా జనసేనాని వైపే చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories