కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై కాంగ్రెస్ లో అనుమానాలు

x
Highlights

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఒంటిరి చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను తెరమీదకు తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్...

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఒంటిరి చేసేందుకే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను తెరమీదకు తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న మోడీ ఎజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని వారు మండిపడతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పట్టించుకోని కేసీఆర్.. వ్యవసాయ సంక్షోభంపై మొసలికన్నీరు కారుస్తున్నారని వారంటున్నారు.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కనుసన్నల్లోనే ఈ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నరేంద్ర మోడీ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని... వారంతా కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చించేందుకే థర్ట్ ఫ్రంట్ ను తెరమీదకు తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ముక్తభారత్ అన్న మోడీ ఎజెండాకు అనుగుణంగానే ఈ ఫ్రంట్ పని చేస్తుందంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి పొత్తు ఉందన్న అనుమానాల్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన హమీలను నాలుగేళ్లుగా నేరవేర్చని కేసీఆర్ తన తప్పులను కేంద్రంపైకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి అంశాలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీలను తప్పుబడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హమీలు సాధించుకునేందుకు కేంద్రంపై పోరాటం చేయాలంటున్నారు.

కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రోగ్రెసివ్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరే పార్టీలు ఇప్పటికైతే కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో లేకున్నా అంశాలవారీగా మద్దతు పలుకుతున్నాయి. కేరళ నుంచి లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, కర్నాటక నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ సెక్యులర్, హర్యానా నుంచి ఐఎన్ఎల్డీ, ఉత్తర ప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ, మహారాష్ట్ర నుంచి శివసేన, ఢిల్లీ నుంచి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఒడిశా నుంచి అధికార బిజూ జనతాదళ్ పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ కు బాసటగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో కలిసి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. వీరితోపాటు యుపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తమిళనాడులో డీఎంకే, బీహార్లో ఆర్జేడీ, జమ్మూకాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్రలో ఎన్సీపీ ఉన్నాయి. ఈ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ కొత్త కూటమి ఏర్పాటు చేయబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడం విశేషం. అయితే ఆ పార్టీలను చేరదీయడం వెనుక కాంగ్రెస్ ను బలహీన పరిచే కుట్ర దాగుందని కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొడతామని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని.. వచ్చే ఎన్నికల్లో అక్కడా, ఇక్కడా తమదే అధికారమన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories