తొలివిడత బస్సుయాత్రతో జోష్ పెరిగిన టీ-కాంగ్రెస్

తొలివిడత బస్సుయాత్రతో జోష్ పెరిగిన టీ-కాంగ్రెస్
x
Highlights

టీ-కాంగ్రెస్ నేతల తొలివిడత బస్సుయాత్ర ముగిసింది. సొంత పార్టీ బలాలు అధికార పార్టీ బలహీనతలు నేర్చుకోవాల్సిన పాఠాలు క్షేత్రస్థాయిలో ప్రజానాడి ఇలాంటి అనేక...

టీ-కాంగ్రెస్ నేతల తొలివిడత బస్సుయాత్ర ముగిసింది. సొంత పార్టీ బలాలు అధికార పార్టీ బలహీనతలు నేర్చుకోవాల్సిన పాఠాలు క్షేత్రస్థాయిలో ప్రజానాడి ఇలాంటి అనేక అంశాలపై కొంతమేర అవగాహన కలిగిందంటున్నారు.. టీ-కాంగ్రెస్ నేతలు. మలి విడత చేపట్టబోయే యాత్రకు అవసరమైన ప్రచార సామగ్రిని ఈ యాత్ర అందించిందని వారంటున్నారు.

తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టే లక్ష్యంతో 8 రోజుల పాటు సాగిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఫిబ్రవరి 26న చేవెళ్లలో ప్రారంభమైన బస్సుయాత్ర మార్చి 8న ముగిసింది. హోలీ కారణంగా మధ్యలో రోజులు మినహాయిస్తే 11 రోజుల షెడ్యూల్ లో 8 రోజుల యాత్ర దిగ్విజయంగా సాగింది.

టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో ఈ యాత్ర 17 నియోజకవర్గాల్లో సాగింది. తొలిరోజున చేవెళ్లలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కొందరు సీనియర్లు లోలోపల వ్యతిరేకించినా నేతలంతా ఉత్తమ్ దారికి రాగలిగారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగింది. చేవెళ్ల సభలో పార్టీ ఇంచార్జ్ కుంతియాకు వేదికపై చోటివ్వకపోవడంతో ఆయన దాదాపు ఆరు రోజులు యాత్రకు దూరంగా ఉన్నారు. ఇక కోరుట్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ఆశించిన జనం రాక పార్టీకి నిరాశ కలిగించింది. మెట్ పల్లి, నిర్మల్ నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో పీసీసీ అధ్యక్షుడు విస్తుపోయారు.

ఈ టూర్లో ఉత్తమ్.. కొందరు మాజీ ఎమ్మెల్యేలను, mpలను రేపటి ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రతి సభలో కూడా డిసెంబర్లోనే ఎన్నికలు వస్తాయని చెబుతూ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రజల ముందు ఏకరువు పెడుతున్నారు. ఈ యాత్ర ద్వారా కార్యకర్తలను స్థానికంగా కలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీపై అవగాహన పెరిగిందని ఉత్తమ్ అంటున్నారు.

కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తోందని, వచ్చే ఎన్నికల్లో సునామీ లాంటి తీర్పు రాబోతుందని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా.. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన అత్యంత పనికిమాలిందని, ఢిల్లీకి వెళ్లే ముందు ముందుగా తెలంగాణ బాగోగులు చూడాలని హితవు పలికారు. ఎన్డీయే, యూపీఏలకు తప్ప ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు అవకాశం లేదన్నారు . ఇక అన్ని సభల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. రేవంత్ ముందే మాట్లాడితే ఎక్కడ జనం ఖాళీ అవుతారో అన్న ఉద్దేశంతో అందరూ మాట్లాడిన తరువాతే రేవంత్ తో మాట్లాడించడం విశేషం. మొత్తానికి రెండో దఫా యాత్ర నాటికి అవసరమైన సరుకు, సరంజామా ఈ యాత్రతో లభించిందని టీ-కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories