ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌...మరోసారి విచారించే అవకాశం

ఓటుకు నోటు కేసుపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌...మరోసారి విచారించే అవకాశం
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు దెబ్బకు రేవంత్‌రెడ్డితో పాటు మరి కొందరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు...

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు దెబ్బకు రేవంత్‌రెడ్డితో పాటు మరి కొందరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరు సీఎంలు...వాగ్భాణాలు సంధించుకున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్‌ ఉన్నట్టుండి ఎందుకు ఓటుకు నోటు కేసు సమీక్ష నిర్వహించారు. మూడేళ్లు పూర్తవుతున్న ఓటుకు నోటు కేసు పరిస్థితి ఏంటీ ?

మూడేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో...ఓటుకు నోటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో...అకస్మాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. దీంతో ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు...నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌‌సన్‌ను కొనుగోలు చేసేందుకు 50 లక్షలు ఇస్తూ రేవంత్‌రెడ్డి...ఏసీబీకి పట్టుబడ్డారు. రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహాల ప్రమేయం ఉందని భావించిన ఏసీబీ...వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. కేసు విచారణలో భాగంగా... కాల్‌ లిస్ట్ ఆధారంగా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులిచ్చిన తర్వాత ఏసీబీ అరెస్ట్ చేసింది. మత్తయ్య జెరూసలెం వ్యక్తి పాత్ర ఉందని ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ...తర్వాత అతని పాత్రేమీ లేదని తేల్చింది.

రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత...ఇద్దరు సీఎంలు వాగ్భాణాలు సంధించుకున్నారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లిద్దరూ...ఏసీబీలను ప్రయోగించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి...ఏసీబీ తనకు ఉందని చంద్రబాబు అంటే....చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇద్దరు సీఎంల మధ్య పోరు ...నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది. తెలంగాణ ఏసీబీ కేసులను తెరపైకి తెస్తే...ఏపీ సర్కార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును తెరపైకి తెచ్చింది. ఈ పరిస్థితి చేయిదాటుతున్నందున సమయంలో...గవర్నర్‌ నరసింహాన్‌ రెండు రాష్ట్రాల సీఎంలతో సమీక్ష నిర్వహించి...తాత్కాలికంగా కేసులకు ముగింపు పలికారు.

ఓటుకు నోటు కేసు సైలెంట్‌ అయిన సమయంలో...దర్యాప్తు సరిగా కొనసాగడం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కోర్టులో పిటీషన్‌ వేశారు. రెండు కేసులు నీరుగారిపోయాయని సోషల్ మీడియాలో సైతం విమర్శలు వెల్లువెత్తాయ్. అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో సీన్‌ మొత్తం మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో...ఓటుకు నోటు కేసును తెరపైకి తెచ్చారు. అప్పట్లో కేసును విచారించిన ఏకే ఖాన్‌తో పాటు డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావుతో...కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అయితే చంద్రబాబుపై కేసు నమోదు చేయడానికి మాత్రం వెనుకంజ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే ఏసీబీకి దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్‌, కాల్ లిస్ట్, స్టీఫెన్‌సన్ వాగ్మూలం ఆధారంగా...కేసుతో సంబంధమున్న వారిని మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. రెండు మూడు నెలల్లో ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories