కేసీఆర్‌కు సెప్టెంబర్‌ 10 టెన్షన్‌

x
Highlights

అనధికారిక మంత్రివర్గ సమావేశాలు. హడావుడిగా ఢిల్లీకి కేటీఆర్, రాజీవ్‌ శర్మ, ఇతర న్యాయనిపుణులు. గవర్నర్‌తో కేసీఆర్ భేటి, తాజాగా టీఆర్ఎస్‌ శాసనసభ,...

అనధికారిక మంత్రివర్గ సమావేశాలు. హడావుడిగా ఢిల్లీకి కేటీఆర్, రాజీవ్‌ శర్మ, ఇతర న్యాయనిపుణులు. గవర్నర్‌తో కేసీఆర్ భేటి, తాజాగా టీఆర్ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం. వెంటనే ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనం. అన్నీ చకచకా జరుగుండగానే, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ కరెంటు, అర్చకులు, ఇమామ్‌లకు వేతనాలు, నామినేటెడ్ పోస్టులు, ఉద్యోగుల వేతనాలు, కుల సంఘాలకు స్థలాలు వంటి వరాలు, ఐఏఎస్‌ల బదిలీలు. తుపానుకు ముందు ప్రశాంతలా, ముందస్తుకు ముందు సమర సన్నాహాలు. తెలంగాణలో ముందస్తు రణభేరి దాదాపు ఖాయమైంది. మరి ముందస్తుకు అంతా సవ్యమేనా సెప్టెంబర్‌ 10 టెన్షనేంటి కేసీఆర్‌ కాన్ఫిడెన్స్‌ ఏంటి.

ఇక ఎన్నికల వాగ్ధానాలు ముందస్తుగా ముందే కురవబోతున్నాయి. ప్రచారాలు హోరెత్తబోతున్నాయ్. ఫిరాయింపులు, గెలుపు గుర్రాల అన్వేషణలు, పొత్తులు, ఎత్తులు, కూటములు తెలంగాణలో అసలు షెడ్యూల్‌ కంటే ఎన్నికల సందడి మొదలు కాబోతోంది. మొన్న మంత్రివర్గ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలు విన్న సీఎం కేసీఆర్, తాజాగా జరిగిన శాసనసభ, పార్లమెంటరీ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో, ముందస్తుకు సిద్దంకావాలని ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో ముందస్తు భేరి దాదాపు ఖాయమైంది. ఎన్నికల నగారా మోగబోతోంది. మొన్న అనధికారికంగా మంత్రివర్గ సమావేశం, హడావుడిగా ఢిల్లీకి కేటీఆర్, సీఎస్‌తో పాటు రాజీవ్‌ శర్మ, ఇతర న్యాయనిపుణులు. గవర్నర్‌తో కేసీఆర్ భేటి, తాజాగా టీఆర్ఎస్‌ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ విస్తృతస్థాయి సమావేశం. వెంటనే ఢిల్లీకి సీఎం కేసీఆర్ పయనం. అంతా ఎన్నికల హడావుడే.

టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో, విస్పష్టంగా ఎన్నికల భేరి మోగించారు గులాబీ దళాధిపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. ఎన్నికలు ఎఫ్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనీ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముందస్తుకే అందరూ సిద్దం కావాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. ఎన్నికలు రేపా, ఎల్లుండా, మార్చిలోనా అని కాకుండా అందుకు, మానసికంగా సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇంతకుముందు చేసిన సర్వేలు సానుకూలంగానే ఉన్నాయని, ఎన్నికలు ఎఫ్పుడొచ్చినా గెలుపు మనదేనని సీఎం చెప్పినట్టు సమాచారం. అన్నీ అధిగమించి వంద సీట్లకు పైగా గెలవబోతున్నామన్న కేసీఆర్, హైదరాబాద్‌లో ఉన్న అన్ని స్థానాలూ గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.

సెప్టెంబర్‌ 2న జరిగే, ప్రగతి నివేదన సభతో భేరీ మోగిద్దామని కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి 25 వేల మందికి తక్కువ కాకుండా మొత్తం 25 లక్షల మంది నివేదన సభకు హాజరయ్యేలా చూడాలని క్యాడర్‌కు ఆదేశించారు కేసీఆర్. ఎన్నికల విషయం తనకు వదిలేయాలని, తుది నిర్ణయం తానే తీసుకుంటానని, కేవలం సభ విజయవంతంపైనే దృష్టిపెట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌ ముందస్తు నగరాతో, కొన్నాళ్లుగా తెలంగాణలో రాజకీయ వేడి రగులుతూ వస్తోంది. ఇప్పుడు సీఎం ఫుల్ క్లారిటీతో పొలిటికల్‌ రణరంగం, మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితి ఊహించి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి పార్టీ అధినేత రాహుల్‌ని కూడా తెలంగాణకు తీసుకొచ్చారు. ఎన్నిసార్లయినా వస్తానని రాహుల్‌ హామి కూడా ఇచ్చారు. త్వరలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మరోసారి బస్సు యాత్రకు సిద్దమవుతున్నారు. ఇంకోవైపు బీజేపీ తన వంతు వ్యూహాలకు పదునుపెడుతోంది కానీ, కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఎవరితో కలవాలా అని టీడీపీ ఆలోచిస్తోంది. వామపక్షాలు దేనికైనా రెడీ అంటున్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటుపై జోరుగా మంతనాలు సాగుతున్నాయి.

ముందస్తు పరిణామాలతో, ఇక ప్రచార కార్యక్రమాలు స్పీడందుకోబోతున్నాయి. టిక్కెట్ల ఆశావహులు రాజధానిలో మకాం వేయబోతున్నారు. పార్టీ ఫిరాయింపులు, చేరికలు, తీసివేతల లెక్కలు రంజుగా సాగబోతున్నాయి. ప్రత్యర్ధి పార్టీల్లోని గెలుపు గుర్రాల ఆపరేషన్‌ ఆకర్ష్ ఊపందుకోబోతోంది. ఇక పార్టీల వాగ్ధానాలు, హామీలు, మైక్‌ పగిలేలా ప్రసంగాలు, ఇంటింటికీ ప్రచారాల జోరును, వీక్షించబోతున్నారు తెలంగాణ ప్రజలు.

సెప్టెంబర్‌ 10. ముందస్తుకు ఉకలేస్తున్న గులాబీ బాస్‌కు, ఈ తేదీనే టెన్షన్‌ పుట్టిస్తోంది. ఎందుకంటే, అసెంబ్లీని సెప్టెంబర్‌ పదిలోపు రద్దు చేస్తేనే, తాను అనుకున్న సమయానికి ఎన్నికలు జరిగేది, ఎలక్షన్‌ కమిషన్‌ సిద్దమనేది. అందుకే హుటాహుటిన ఢిల్లీ పర్యటనలు, మంతనాలు. మరి సెప్టెంబర్‌ పదిలోపు అసెంబ్లీ రద్దు సాధ్యమేనా?

ఎన్నికల నిర్వహణ అనేది, చాలా సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. ఎలక్షన్‌ కమిషన్‌ చాలా సిద్దం చేసుకోవాలి. సిబ్బందిని సరిచూసుకోవాలి. బాధ్యతలు అప్పగించాలి. ఇందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఈవీఎంలను తనిఖీ చేయాలి. అంతకుముందు ఎన్నికల డేటాను తొలగించి మళ్లీ ఎన్నికలకు సిద్ధం చేయాలి. అంతేకాదు, తొలుత ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి. ఎన్నికల సన్నద్ధతపై ఈసీ ఆ రాష్ట్ర సీఎస్‌, డీజీపీలకు లేఖలు రాయాలి. అన్ని శాఖల నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాతే, ఎలక్షన్‌ సైరన్‌ మోగించాలి. ఈ మొత్తం ప్రక్రియకు అంటే, ఒక రాష్ట్ర శాసన సభకు, ఎలక్షన్స్‌ పెట్టాలంటే, ఈసీకి కనీసం 90 నుంచి 100 రోజుల సమయం తప్పనిసరి. ముందస్తుకు సిద్దమవుతున్న టీఆర్ఎస్‌ సర్కారుకు, డేట్స్‌ అన్నీ పక్కాగా చూసుకుని, ఈసీ క్లియరెన్స్‌ ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంలతో పాటు తమకూ ఒకేసారి ఎన్నికలు జరగాలన్నది గులాబీ బాస్‌ ఆలోచన. ఇందులో వ్యూహం కూడా ఉంది. తెలంగాణకూ వీటితోపాటు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం, కేవలం తెలంగాణపైనే మొత్తం మొహరించే అవకాశముండదు. ఆయా రాష్ట్రాల ప్రచారాల్లో వాళ్లు మునిగిపోతారు కాబట్టి, బలం, బలగం తగ్గుతుందన్నది కేసీఆర్ స్ట్రాటజీ. కానీ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు, జరగడానికి టైం సెట్‌ అవుతుందా లేదా అన్నది గులాబీ శ్రేణుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది.

మిజోరాంలో ఎన్నికల ప్రక్రియ డిసెంబరు 15వ తేదీకి కంప్లీట్‌ కావాలి. ఆలోపు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి జనవరి ఐదో తేదీ వరకూ, మధ్యప్రదేశ్‌లో ఏడో తేదీ వరకూ, రాజస్థాన్‌ అసెంబ్లీకి 20వ తేదీ వరకూ టైముంది. సాధారణంగా, నాలుగైదు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు తొలి గడువునే ప్రాతిపదికగా పరిగణిస్తారు. దాని ప్రకారమే ఎలక్షన్స్‌ ఆర్గనైజ్ చేస్తారు. ఇవే డేట్లను లెక్కలోకి తీసుకుంటే, ఆ నాలుగు రాష్ట్రాలకు డిసెంబరు 15లోపు ఎలక్షన్స్‌ ప్రాసెస్‌ పూర్తవ్వాలి. అందుకు, ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహించినా, అవి ఆ తేదీలోపు కంప్లీట్‌ కావాలి. ఒకవేళ, ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణ శాసన సభకు, కూడా డిసెంబరు 15లోపు ఎన్నికలు జరపాలంటే.. సెప్టెంబరు 10వ తేదీలోపు అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది.

కేవలం ఇవేకాదు, ఎన్నికల కమిషన్‌ ఇంకా చాలా అంశాలు సరిచూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పరీక్షలు, ఇతర ఆటంకాలు ఏమైనా ఉన్నా యా అని పరిశీలిస్తుంది. అవి ఏవీ లేవని నిర్ధరించుకున్న తర్వాత ఎన్నికల ప్రక్రియకు రెడీ అంటుంది. ఈ నేపథ్యం లో, తెలంగాణ మొత్తానికి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించినా.. వాటిని కూడా డిసెంబరు మొదటివారంలో పెట్టినా.. సెప్టెంబరు 10లోపు ఈసీకి అసెంబ్లీ రద్దు తీర్మానం అందిస్తేనే సాధ్యపడుతుంది. మరి ఇవన్నీ అనుకున్న టైంకి అవుతాయా లేదా అన్నది గులాబీదళం ఉత్కంఠ. కానీ ఆలోపు కంప్లీట్‌ అవుతాయని టీఆర్ఎస్‌ శ్రేణులంటున్నాయి. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎంపీలు, ఇప్పటికే హస్తినలో మకాం వేశారు. కేసీఆర్‌ కూడా, మంతనాలు సాగిస్తున్నారు. వీరందర్నీ పరుగులు పెట్టిస్తోంది సెప్టెంబర్‌ 10.

సెప్టెంబర్‌ 10 అంటే, 16 రోజుల టైముంది టీఆర్ఎస్‌కు. ఈలోపు అసెంబ్లీ రద్దు చేసి, ఎలక్షన్‌ కమిషన్‌కు తీర్మానం పంపాలి. మరి మధ్యలో జరిగే ప్రాసెస్‌ ఏంటి?

తెలంగాణ శాసన సభ గడువు 2019, జూన్ 8న ముగుస్తుంది. కానీ డిసెంబర్‌ 15లోగా ఎన్నికలు జరిగి తీరాల్సిందేనని, టీఆఎస్‌ భావిస్తోంది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈనెల 13న అంటే, బుధవారం మంత్రులతో, ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అయితే, అది అధికారికం కాదు. ముందస్తుపై చర్చించినా, అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అంటే, శాసన సభ రద్దు కావాలంటే, మరోసారి మంత్రివర్గం సమావేశం కావాల్సి ఉంటుంది. రద్దు కోరుతూ తీర్మానం చేయాలి. ఈ అంశం సీఎస్‌ ద్వారా ఎజెండాగా రావాలి. అందులో అసెంబ్లీ రద్దును ఏకగ్రీవంగా తీర్మానిస్తూ.. లేదా నిర్ణయాన్ని సీఎంకి, కట్టబెడుతూ మంత్రులు తీర్మానం చేయవచ్చు. ఆ అధికారంతో అసెంబ్లీ రద్దుపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక పద్దతి.

ఒకవేళ, కేబినెట్‌ భేటి కాకపోయినా, సర్క్యులేషన్‌ పద్ధతి ఉంటుంది. ఇందులో ఆరుగురు మంత్రుల సంతకాలు తీసుకున్నా కేబినెట్‌ తీర్మానం కిందకే వస్తుందని, అధికారులంటున్నారు. సదరు కేబినెట్‌ తీర్మానాన్ని సీఎస్‌ ద్వారా గవర్నర్‌కు పంపాలి. దాన్ని గవర్నర్‌ ఆమోదించాలి. దీంతో అసెంబ్లీ రద్దు ప్రక్రియ పూర్తవుతుంది. గవర్నర్‌ నిర్ణయాన్ని, ఈసీకి పంపుతారు. వెంటనే ఈసీ ఎన్నికల ప్రక్రియ మొదలెడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories