కూటమిలో సీట్ల కొట్లాట...అవసరమైతే ఒంటరిపోరుకు సిద్ధం కావాలని డిమాండ్

x
Highlights

మహాకూటమిలో పొత్తులు పొసగడం లేదు. మహాకూటమిలోని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కూటమి కోసం అందరికంటే ముందుగా ప్రయత్నాలు చేసిన సీపీఐకి...

మహాకూటమిలో పొత్తులు పొసగడం లేదు. మహాకూటమిలోని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. కూటమి కోసం అందరికంటే ముందుగా ప్రయత్నాలు చేసిన సీపీఐకి మహాకూటమిలో పరిణామాలు రుచించడం లేదు. అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని, సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని కూటమిలో భాగస్వామ్యపక్షాలైన సీపీఐ, టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీచేశాయి.

పార్టీకి బలమున్న 25 స్థానాల్లో పోటీచేయాలని సీపీఐలో ద్వితీయశ్రేణి నేతల నుండి డిమాండ్‌ వినిపిస్తోంది. కాంగ్రెస్ ఇస్తామన్న మూడు సీట్లు తీసుకుని కూటమి భారాన్ని మోసేకంటే ఒంటరిగా బరిలోకి దిగితే వచ్చే నష్టమేంటని ద్వితీయశ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. మూడు సీట్లు మాత్రమే ఇస్తే కూటమి నుంచి బయటకు రావడమే ఉత్తమమని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కూటమిలో సీట్ల కేటాయింపు ఏమాత్రం సబబుగా లేదంటూ సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మహాకూటమి రేపిన సీట్ల చిచ్చుతో సీపీఐ నాయకులు రెండువర్గాలుగా విడిపోయినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి వంటి వారంతా కూటమిలో ఉండాలి తమ సీట్ల వరకు వస్తే చాలన్న ధోరణితో ఉన్నారని ఇతర నాయకులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కూటమిలో ఉంటే వచ్చే 3-4 సీట్లలో తమకు పోటీచేసే అవకాశం రాదని ద్వితీయశ్రేణి నేతలు వాదిస్తున్నారు.

మహాకూటమి సీట్ల సర్దుబాటుపై అటు, తెలంగాణ జనసమితిలోనూ అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజేఎస్‌పార్టీ కార్యవర్గ సమావేశంలో కొందరు నేతలు కూటమి సీట్ల సర్దుబాటుపై కోదండరామ్‌ను నిలదీసినట్టు సమాచారం. పార్టీ అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ నుంచి రాబట్టాలని రెండు, మూడు సీట్లకు ఒప్పుకొనేది లేదంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. టీజేఎస్‌లో 12 మంది ముఖ్య నేతలున్నారని, వారికైనా సీట్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

బుధవారం వరకు వేచిచూసి ఒంటరి పోరుకు సన్నద్ధం కావాలని తెలంగాణ జనసమితి నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఇంతకుముందు ఒకసారి జారీచేసిన అల్టిమేటానికి కాంగ్రెస్ నుంచి కనీసం స్పందన కూడా లేదని మరికొందరు పేర్కొన్నట్టు తెలిసింది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకాలను తేల్చకపోవడంతోపాటు, తాము కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ నాయకులు ప్రచారం చేయడంపై కూడా టీజేఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories