రక్షాబంధన్‌ ఛాలెంజ్‌...పరిచయం లేని అబ్బాయిలకు, అమ్మాయిలు రాఖీ కట్టాలి

x
Highlights

అమ్మాయిలపై పెరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా చిలుకూరు ప్రధానార్చకులు యువతకు సరికొత్త ఛాలెంజ్‌ను విసిరారు. వచ్చే రాఖీపౌర్ణమి రోజున పరిచయం లేని...

అమ్మాయిలపై పెరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా చిలుకూరు ప్రధానార్చకులు యువతకు సరికొత్త ఛాలెంజ్‌ను విసిరారు. వచ్చే రాఖీపౌర్ణమి రోజున పరిచయం లేని అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని సవాల్‌ విసిరారు. రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి.. యువత అందరికీ ఆదర్శంగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రసిద్ద పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకులు రంగరాజన్‌ మరోసారి కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ రాఖిపౌర్ణమికి యువతకు ఓ ఛాలెంజ్‌ను విసిరారు. రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ పేరుతో ఆరోజు ప్రతీ అమ్మాయి తనకేమీ సంబంధం లేని అబ్బాయికి రాఖీ కట్టాలని అలాగే పరిచయం లేని అమ్మాయితో అబ్బాయి రాఖీ కట్టించుకోవాలని యూత్‌కు ఛాలెంజ్‌ విసిరారు.

దళితుడిని తన భుజాలపై ఎత్తుకుని ఆలయ ప్రవేశం చేయించి అందరి చేతా అభినందనలు అందుకున్న రంగరాజన్‌ ఈ సారి దేశంలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టడమే లక్ష్యంగా రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ మహిళలో తన అమ్మ, అక్క, చెల్లిని చూడాలని అలాగే అమ్మాయిలు కూడా అబ్బాయిలను సోదరులుగా భావించాలన్నారు. ప్రేమను అంగీకరించలేదని చాలామంది అబ్బాయిలు అమ్మాయిలపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరభావం పెంపొందినప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఈ ఛాలెంజ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యిందన్న అర్చకులు రంగరాజన్‌ ఆలయానికి వచ్చిన భక్తులంతా రక్షాబంధన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించారని వివరించారు. ఈ నెల 26న రాఖీపౌర్ణమి రోజున దేశంలోని అందరూ తమకు పరిచయం లేని వారితో రాఖీ కట్టించుకోవాలని, లేదా రాఖీ కట్టాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories