నల్లగొండ రాజకీయాల్లో మారుతున్న సమీకరణలు...పార్టీ మారేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధం..?

x
Highlights

ముందస్తు హడావుడి కనిపిస్తున్న తెలంగాణలో రాజకీయ సమీకరణలు కూడా జోరందుకున్నాయి మొన్నటి వరకూ కాంగ్రెస్ జెండా మోసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు బోర్డు...

ముందస్తు హడావుడి కనిపిస్తున్న తెలంగాణలో రాజకీయ సమీకరణలు కూడా జోరందుకున్నాయి మొన్నటి వరకూ కాంగ్రెస్ జెండా మోసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు బోర్డు తిప్పేస్తున్నారా?ఇన్నాళ్లూ ఆశ్రయమిచ్చిన అభయ హస్తాన్ని వీడి కారెక్కేస్తున్నారా?గత కొంత కాలంగా సైలెంట్ గా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే నిజమనిపిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ మనసు మారడానికి కారణాలేంటి?

నల్లగొండ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నల్లగొండను గుత్తకు పట్టాలనుకున్న టిఆరెస్ అందుకు అనుగుణంగా స్కెచ్ వేసిందా? సిఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో నల్లగొండ రాజకీయాలపై జరిగిన అంతర్గత చర్చలు ఆ తర్వాత నల్లగొండలో మారుతున్న కోమటిరెడ్డి సోదరుల స్వరం చూస్తుంటే ఏదో మంత్రాంగం నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

నల్లగొండ రాజకీయాల్లో వారిద్దరూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎమ్మెల్సీ ఇద్దరూ స్వయానా సోదరులే కానీ వారి రాజకీయ గమనమే అంతు చిక్కడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొలి రెండేళ్లూ కేసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు ఈ సోదర ద్వయం రేపో మాపో టిఆరెస్ తీర్ధం పుచ్చుకుంటారేమోనని అప్పట్లోనే ఊహాగానాలు నడిచాయి. కానీ ఏం జరిగిందో ఏమో మళ్లీ టీఆరెస్ కి ఎదురు తిరిగారు అంతేకాదు 2016 లో జరిగిన నల్లగొండ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయఢంకా మోగించారు. అక్కడ నుంచి సీన్ మారిపోయింది. ఇటు టిఆరెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తూనే సొంత పార్టీపైనా పట్టు పెంచుకోజూశారు. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు కోరుకున్న ఈసోదరులిద్దరూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తో అడుగడుగునా విభేదిస్తూనే ఉన్నారు. అలాంటి తరుణంలోనే నల్లగొండ మున్సిపల్ ఛైర్ పర్సన్ భర్త , కోమటి రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఇది సర్కారీ హత్యేనంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ తిరగబడ్డారు.
సిఎం, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంల హస్తం ఉందంటూ ఆవేశంతో ఊగిపోయారు. వర్గపోరు తో సతమతమవుతున్న నల్లగొండ కాంగ్రెస్ ను బొడ్డుపల్లి హత్యతో పార్టీనేతలంతా ఏకతాటిపైకి వచ్చేలా చేసారు అంతేకాదు రాష్ట్ర ఇంచార్జ్ కుంతియాతో పాటు రాష్ట్ర్రస్ధాయి నేతలను నల్లగొండ కు రప్పించి సభ పెట్టి మరీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు.

గత రెండేళ్లుగా ఈ పోరాటం కొనసాగుతోంది. కానీ నాలుగు నెలలుగా ఈ పోరాటం కొత్త టర్న్ తీసుకుంది. అసెంబ్లీలో మండలి చైర్మన్, గవర్నర్ పై హెడ్ సెట్ విసిరిన ఘటనలో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ తమ శాసన సభ సభ్యత్వాలని కోల్పోయారు దీనిపై న్యాయ పోరాటం చేస్తునే ప్రభుత్వం పైనా టిఆర్ఎస్ నేతలపైనా కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యేల అనర్హత చెల్లదంటూ కోర్టు కూడా చెప్పడంతో వారి ఉత్సాహానికి మరింత ఊతమొచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుని సర్కారును ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ చీఫ్ విఫలమయ్యారంటూ ఫైరయ్యారు. పరిస్థితిని గమనించిన టిఆరెస్ కోమటిరెడ్డిని ఓడించేందుకు ప్లాన్ రెడీ చేసింది. నల్లగొండ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న దుబ్బాక నర్సింహ్మారెడ్డిని కాదని కంచర్ల భూపాల్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది టిఆరెస్. నల్లగొండ నియోజక వర్గంలో ఉపఎన్నిక వస్తే గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టిఆర్ఎస్ ప్లాన్ చేసింది. కానీ ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

నమ్ముకున్న పార్టీలో ఎలివేషన్ లేదు పార్టీ పగ్గాలు దక్కుతాయన్న ఆశా లేదు అందివచ్చిన అవకాశాలని వినియోగించడంలో పార్టీలో ఇతర నేతల సహకారం అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్ధుల నుంచి అనూహ్యంగా వస్తున్న బంపర్ ఆఫర్లు సయోధ్య ఈ ఆలోచనలే కోమటిరెడ్డి బ్రదర్స్ రూటు మార్చేయడానికి కారణమయ్యాయా?

ఓ వైపు టిఆరెస్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు కాంగ్రెస్ లో సరైన గుర్తింపు లేదన్న భావన కోమటిరెడ్డి బ్రదర్స్ ను మరోలా ఆలోచించేలా చేసింది. కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు దక్కుతాయని ఆశించి భంగపడిన కోమటి రెడ్డి రాజకీయంగా ఉత్తమ్ వర్గంపై పై చేయి సాధించాలన్న ఆలోచనకు వచ్చారనీ, అందుకు టిఆరెస్ లో చేరడమే మార్గమని కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సిఎం డిల్లీ పర్యటనలో ఇతర పార్టీల నుంచి చేరికలపై చర్చ నడిచినట్లు ఆ చర్చల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ టాపిక్ వచ్చినట్లు తెలుస్తోంది కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని వదిలిపెట్టి వస్తే నల్లగొండ అసెంబ్లీతో పాటు మునుగోడు ,ఆలేరు ,జనగామ లలో బ్రదర్స్ సూచించిన వారికే టికెట్లు ఇస్తామని టిఆరెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే వాటితో పాటూ భువనగిరి,నకిరేకల్ నియోజకవర్గాలను కూడా అప్పగిస్తే గెలిపించుకోస్తామని కోమటి రెడ్డి బ్రదర్స్ అన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న మునుగోడు పై ఆయన దృష్టిపెట్టారు గతంలో ఎంపీగా పనిచేయడంతో భువనగిరి పార్లమెంటు పరిధిలోను పట్టుంది అందుకే ఆ పరిధిలో ఎమ్మెల్యే సీటు అడిగినట్లు సమాచారం. దీనికి తోడు గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కాంగ్రెస్ విజయఢంకా మోగించింది ఇప్పటికే ఎంపీ గుత్తా ,ఎమ్మెల్యే భాస్కర్ రావు తో పాటు కాంగ్రెస్ మద్దతుతో దేవరకొండ నుంచి సిపిఐ నుంచి గెలిచిన రవీంద్రకుమార్ కూడా టిఆర్ఎస్ లో చేరారు అయినా టిఆర్ఎస్ పలు నియోజకవర్గాల్లో వీక్ గానే ఉందన్న ప్రచారం ఉంది నల్లగొండ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ ,దేవరకొండ,నాగార్జునసాగర్ ,మిర్యాలగూడ ,కోదాడ ,హుజుర్ నగర్ లో విజయం సాధించే విధంగా నల్లగొండ పార్లమెంట్ నుంచి సిఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు వీలుగా నల్లగొండ కాంగ్రెస్ లో కీలకమైన కోమటిరెడ్డి బ్రదర్స్ ను పార్టీలో ఆకర్షించే ఫ్లాన్ ను టిఆర్ఎస్ వేసినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మార్పిడిపై ఇంత ప్రచారం జరుగుతున్నా దీనిపై స్పందించేందుకు మాత్రం వారు నిరాకరిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యంతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ అడిగిన సీట్లలో కొన్ని ఇచ్చి ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో మంచి అవకాశం ఇస్తామన్న హామీ కూడా టిఆర్ఎస్ నుంచి బ్రదర్స్ కు దక్కిందన్న ప్రచారం ఉంది కోమటిరెడ్డి బ్రదర్స్ పై రేగుతున్న ఊహాగానాలకు ఒక క్లారిటీ రావాలంటే ఈవారం ఆగాల్సిందే. కోమటి రెడ్డి బ్రదర్స్ పై రేగుతున్న ఊహాగానాలే నిజమైతే కాంగ్రెస్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే నష్టం వాటిల్లినట్లే కేసిఆర్ ఎత్తుగడ ఫలిస్తే కాంగ్రెస్ కంచుకోట అయిన నల్లగొండ టిఆరెస్ పరమవుతుందా? చూడాలి ఏం జరుగుతుందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories