మోత్కుపల్లితో చంద్రబాబే మాట్లాడిస్తున్నారా?

మోత్కుపల్లితో చంద్రబాబే మాట్లాడిస్తున్నారా?
x
Highlights

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా నష్టపోతే.. తెలంగాణలో మాత్రం అది టీడీపీ వంతు అయ్యింది. కాంగ్రెస్ అంత దారుణంగా...

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా నష్టపోతే.. తెలంగాణలో మాత్రం అది టీడీపీ వంతు అయ్యింది. కాంగ్రెస్ అంత దారుణంగా కాకున్నా.. ప్రస్తుతానికి ముఖ్య నాయకులు ఎవరూ లేనంత స్థాయికి టీడీపీ పరిస్థితి కాస్త తగ్గిపోయిందనే చెప్పవచ్చు. ఇలాంటి స్థితిలో.. పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఓటుకు నోటు కేసు వ్యవహారం చల్లబడిన తర్వాత.. చంద్రబాబుకు, కేసీఆర్ కు మధ్య రాజకీయంగా అంతరం తగ్గిన వాస్తవాన్ని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆ తగ్గిన అంతరాన్ని.. పొత్తుల వరకూ దగ్గర చేసే దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్న వైనాన్ని కూడా అంతా గ్రహిస్తున్నారు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ నాయకులను మాత్రమే తప్పుబడుతూ.. టీఆర్ఎస్ పై పల్లెత్తు మాట కూడా చంద్రబాబు అనకపోవడంతోనే ఈ చర్చ మొదలైంది.

అది జరగ్గానే.. ఇప్పుడు మోత్కుపల్లి కూడా ఈ చర్చను మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరిస్థితికి రేవంత్ రెడ్డిని బదనాం చేస్తూనే.. టీఆర్ఎస్ తో పొత్తు మాత్రమే టీడీపీ మనుగడకు మార్గమన్న వాస్తవాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు. పైగా.. తాను ఏనాడో టీఆర్ఎస్ తో పొత్తు గురించి మాట్లాడిన విషయాన్ని కూడా ప్రస్తావించి.. టీ టీడీపీ భవిష్యత్తు అడుగులు ఏంటన్నదానిపై ఓ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

దీంతో.. మోత్కుపల్లి వెనక.. చంద్రబాబే ఉండి ఉంటారని.. ఆయన డైరెక్షన్ ప్రకారమే.. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నాయకులు కామెంట్లు చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు. ఈ మధ్య రమణ, రావుల లాంటి సీనియర్ నేతలు కూడా కాస్త మౌనంగా ఉండడం.. ఈ వ్యూహంలో భాగమే అని అంచనా వేస్తున్నారు. పార్టీని కాపాడుకునేందుకు ఆ మాత్రం చర్యలు తప్పనిసరిగా కూడా చెప్పుకొస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories