ఏపీ నోట్లో మట్టికొట్టినట్టేనని కోర్టు సాక్షిగా ముద్ర వేసింది..

x
Highlights

ఔను. వాళ్లు మాట తప్పారు. మడమ తిప్పామని మళ్లీ చెప్పుకున్నారు. వాగ్ధానభంగం కలిగించామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇచ్చిన హామిని,...

ఔను. వాళ్లు మాట తప్పారు. మడమ తిప్పామని మళ్లీ చెప్పుకున్నారు. వాగ్ధానభంగం కలిగించామని సగర్వంగా ప్రకటించుకున్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇచ్చిన హామిని, తుంగలో తొక్కామని న్యాయవ్యవస్థ సాక్షిగా నొక్కి చెప్పారు. వెంకన్న పాదాల చెంత జాలువారిన వరాల ప్రామిస్‌కు, తిలోదకాలిచ్చామని అఫిడివిట్‌ సమర్పించుకున్నారు. ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లామని, న్యాయదేవత ఎదుట కాలరు ఎగరేసి చాటుకున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేం, ఏపీకి అన్ని చేశాం...ఇక చేసేదేంలేదంటూ, సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరాభవం నిదర్శనంగా, స్టేటస్‌ వార్‌ మరింత రగులుకుంటోందా? హోదా జపం ఎలాంటి మలుపు తిరగబోతోంది.

ధర్మపోరాట దీక్షలు, వంచన వ్యతిరేక దీక్షలు, ఉక్కు దీక్షలు, రైల్వే జోన్ దీక్షలు చిట్టాపద్దుల యుద్ధాలు చెప్పు దెబ్బలు పిడిగుద్దులు ఇలాంటి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆంధ‌్రప్రదేశ్‌ భగ్గుభగ్గుమంటోంది. ఈ అగ్నికి ఆజ్యంపోసేలా, నరేంద్ర మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదని మరోసారి కుండబద్దలుకొట్టింది. చేయాల్సినవి చేసేశాం చేయడానికి ఏంలేదంటూ ఖాళీ జేబులు చూపింది. అదే ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో అగ్గిరాజేస్తోంది.

ఒకవైపు ప్రత్యేక హోదాపై ఏపీ రగులుతోంది. కడప ఉక్కు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, విభజనచట్టం హామీలపై మాటల తూటాలు పేలుతున్నాయి. స్టేటసే ప్రధాన రాజకీయాస్త్రంగా విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. కానీ అన్నింటికీ తెగించినోడికి అడ్డేముంది అన్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ముఖంమీదే కొట్టినట్టు చెప్పేస్తోంది. అమరావతి నిర్మాణానికి పార్లమెంటు నీళ్లు, మట్టి బహుమానంగా ఇచ్చి, చివరికి ఏపీకి తామిచ్చేది ఇదేనన్నట్టుగా సింబాలిక్‌గా చెప్పిన నరేంద్ర మోడీ, జనం నోట్లో మట్టే కొడుతున్నామని మరోసారి స్పష్టం చేశారు. కోర్టు సాక్షిగా హామీలను తుంగలో తొక్కేసినట్టు చెప్పేశారు.

విభజన హామీల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పోలవరం ముంపుపై అధ్యయనం, బయ్యారం స్టీల్ ప్లాంట్, విభజిత ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో, ఎంపీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్, తాజాగా విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా, అఫిడివిట్ దాఖలు చేసింది కేంద్రం.

కేంద్రం ఫైల్ చేసిన అఫిడివిట్‌లోని అంశాలు ఒక్కసారి చూస్తే, ఏపీ పుండుపై కారం చల్లినట్టుగా ఉందనిపించడం ఖాయం. ఏపీకి విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇచ్చామని, ఇక ఇచ్చేదేం లేదని తెలిపింది కేంద్రం. ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు అధికారికంగా చెప్పింది. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని నివేదించింది.

అయితే ఈ అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ రైల్వేజోన్ ప్రస్తావనే తేలేదు. దుగ్గరాజపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం అంటూనే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ మెలిక పెట్టింది. ప్రత్యేక ప్యాకేజీ ఎంత వరకు అమలు చేశారన్న విషయాన్ని కేంద్రం వెల్లడించలేదు. ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించలేదు. హామీలు, వా‌గ్దానాలు నెరవేర్చేది లేదు, అవన్నీ గిమ్మిక్కులేనన్నట్టుగా కేంద్రం ఫైల్ చేసిన అఫిడివిట్‌ చెబుతోంది. అంటే పార్లమెంటు సాక్షిగా భారత ప్రభుత్వం ఇచ్చిన హామీకే దిక్కులేదంటే, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందని ఏపీ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

రాజధాని లేకుండా, హైదరబాద్‌ ఆదాయాన్ని కోల్పోయిన ఏపీకి, రెవెన్యూలోటు పెద్దపోటు. దీనిని భర్తీ చేయడానికి నిధులు విడుదల చేశామన్నది అఫిడవిట్‌లో కేంద్రం వాదన. విభజన జరిగిన ఏడాది ఏపీ రెవెన్యూలోటు రూ. 4116 కోట్లు మాత్రమేనని, ఇప్పటి వరకూ 3979 కోట్లు ఇచ్చామని కేంద్రం లెక్కలు చెప్పుకొచ్చింది. కానీ ఏపీ సర్కారు వాదన మరోలా ఉంది. 16078.76 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉందని కాగ్‌ నిర్ధారించిందని, ఈ మొత్తాన్ని మొదటి సంవత్సరమే ఆర్థిక బిల్లులో చేర్చాల్సింది పోయి కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని అంటోంది. రెవెన్యూ లోటును కేవలం రూ. 4117. 89 కోట్లకు తగ్గించిందని, ఈ మొత్తాన్ని కూడా పూర్తిగా విడుదల చేయలేదని మొన్నటి నీతి ఆయోగ్‌ సమావేశంలో వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.

రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు ఇచ్చిన తరువాత మరో మూడేళ్లలో ఏడాదికి రూ. 330 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు ఇస్తామని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది కేంద్రం. కానీ ఏపీ ప్రభుత్వం, ఈ లెక్కలను ఖండిస్తోంది. రాజధాని నిర్మాణానికి 20 ఏళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమంటున్న ఏపీ, రాజధాని ప్రాంతంలోని 27 వేల మంది రైతులు రూ. 50 వేల కోట్ల కంటే ఎక్కువ విలువైన భూమిని సమీకరణలో అప్పజెప్పగా కేంద్రం రూ.1500 కోట్లతో సరిపెట్టిందని నిరసించింది రాష్ట్రం.

విభజన చట్టంలో చాలా హామీలను నెరవేర్చామని చెప్పుకుంటోంది కేంద్రం. కానీ చంద్రబాబు సర్కారు వాదన మరోలా ఉంది. నవ్యాంధ్రలో 9 విద్యా సంస్థలను ప్రారంభించామని కేంద్రం చెబుతున్నప్పటికీ వాటి ప్రాజెక్టు వ్యయం రూ. 11673 కోట్ల కాగా కేవలం రూ. 638 కోట్లే విడుదల చేశారని చంద్రబాబు తెలిపారు. రైల్వే జోన్‌, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఏపీ శాసన సభా సీట్ల పెంపు, పన్ను వ్యత్యాసాల సవరణ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, వైజాగ్‌ - చెన్నై పారిశ్రామిక సమాహారం, విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలు, దుగరాజుపట్నం రేవు, అమరావతికి ర్యాపిడ్‌ రైలు రహదారి అనుసంధానం, గ్రేహౌండ్‌ శిక్షణా కేంద్రం మొదలైన అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని నీతి ఆయోగ్ సమావేశంలో గుర్తు చేశారు చంద్రబాబు. ఇలా కేంద్రం, రాష్ట్రం నిధుల లెక్కలకు చాలా తేడా కనిపిస్తోంది. ఎవరు నిజం చెబుతున్నారో తెలీదు కానీ, విభజన హామీలపై కేంద్రం తాత్సారంపై మాత్రం ఏపీ జనం ఆగ్రహంగా ఉన్నారన్నది వాస్తవం.

నాలుగేళ్లు బీజేపీ, టీడీపీలు కేంద్రం, రాష్ట్రంలో మిత్రులుగా కొనసాగాయి. మొన్నటి బడ్జెట్‌తో తెగదెంపులు చేసుకున్నాయి. వైసీపీ ప్రత్యేక హోదా నినాదంతో ఒక్కసారిగా చెలరేగిపోవడంతో డిఫెన్స్‌లో పడ్డ టీడీపీ, స్టేటస్‌ను హైజాక్‌ చేసింది. ధర్మపోరాట దీక్షలు చేస్తోంది. ఒక్కో విభజన హామీపై రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేస్తోంది. వైసీపీ, జనసేనలు బీజేపీ మిత్రులంటూ, మూడు పార్టీలను ఒకేగాటన కట్టి, విమర్శలు సంధిస్తోంది.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ, ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి దీక్ష చేశారు. ఒకవైపు సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణిస్తుండటం, మరోవైపు కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో దీక్షని అర్థవంతంగా ముగించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. మూడు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచారు.

ఇక విశాఖలో రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ ఎంపీలు దీక్ష చేశారు. హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని మోడీని హెచ్చరించారు. అటు పాదయాత్రలో ఇప్పటికే తెలుగుదేశం దీక్షలను వంచన దీక్షలుగా అభివర్ణిస్తూ, ముందుకుసాగుతున్నారు వైసీపీ అధినేత జగన్. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి, డైవోర్స్ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా, వంచనపై గర్జన దీక్షల పేరుతో జనంలోకి వెళుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బస్సు యాత్రలో తెలుగుదేశాన్నే టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదాపై వెనక్కితగ్గేదిలేదన్న పవన్, బాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను వడబోస్తూ, 2019కి సైలెంట్‌గా స్ట్రాటజీలు రెడీ చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ కూడా, ప్రత్యేక హోదా అస్త్రాన్ని బలంగా విసిరేందుకు సిద్దమవుతోంది. సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై మండిపడిన కాంగ్రెస్, తాము అధికారంలోకి వస్తే స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేస్తోంది.

ఆఖరుగా బీజేపీ. ఎప్పుడూ ఏదో ఒక పార్టీ సపోర్ట్‌లేనిదే బరిలోకి దిగని బీజేపీ, 2019లో ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఏపీలో బీజేపీ ఏకాకి. ఎవరు పొత్తుపెట్టుకున్నా, ఆ పార్టీని కూడా బండకేసి బాదేలా ఉన్నారు జనం. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై మాట తప్పిన కమలం మీద సీరియస్‌గా ఉన్నారు ప్రజలు. తాజాగా స్టేటస్ ఇవ్వలేమంటూ సుప్రీం కోర్టుకు అఫిడివిట్ సమర్పించడంతో, ఫుల్లుగా డిఫెన్స్‌లో పడిపోయింది.

ఏపీకి ఏమిచ్చినా ఇవ్వకున్నా, తనకంటూ రాజకీయలాభం లేదనుకుని, పొలిటికల్ లెక్కలు చూసుకుంటోంది బీజేపీ. ఎలాగూ ఎన్నికలైపోయిన తర్వాత, పాత మిత్రుడు టీడీపీనో, మిత్రుడవుతాడనుకుంటున్న వైసీపీనో, ఢిల్లీలో మద్దతిస్తారన్నది కమలం లెక్క. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా ఏపీకి నో చెప్పేందుకు వెనకాడ్డంలేదు.

కేంద్ర, రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల వేడి రగులుకుంటోంది. కేంద్రం ఆ దిశగా సంకేతాలు పంపుతోంది. కేసీఆర్, చంద్రబాబులు కూడా సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కర్తవ్యం నూరిపోస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలను పక్కనపెడితే, ఏపీ అసెంబ్లీపోరులో ప్రధాన ఎన్నికల అంశం మాత్రం ప్రత్యేక హోదా, విభజన హామీలేనని అర్థమవుతోంది. దీంతో ఎవరివాదనలకు అనుగుణంగా వారు అస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు. కానీ ఏపీకి శఠగోపం పెడుతున్నట్టు సుప్రీం కోర్టుకు అఫిడివిట్ సమర్పించి, మరోసారి ఏపీ భగ్గుమనేలా చేసిన బీజేపీ మాత్రం, డిఫెన్సివ్‌ గేమ్‌ ఆడాల్సిన పరిస్థితి.

Show Full Article
Print Article
Next Story
More Stories