రక్తమోడుతున్న రహదారులు

x
Highlights

సాఫీగా సాగాల్సిన ప్రయాణాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. రయ్ మని దూసుసుపోయే వాహనాలు, మృత్యుశకటాలుగా మారుతున్నాయి. స్వీయ తప్పిదాలో, సాంకేతికలోపాలో కానీ,...

సాఫీగా సాగాల్సిన ప్రయాణాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. రయ్ మని దూసుసుపోయే వాహనాలు, మృత్యుశకటాలుగా మారుతున్నాయి. స్వీయ తప్పిదాలో, సాంకేతికలోపాలో కానీ, ఎందరో ప్రముఖులు, సెలబ్రిటీలు, వారి కుమారులు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కుటుంబాలకు తీరని దుంఖం మిగిల్చారు.

వెండి తెరపై తనదైన రీతిలో నటన ప్రదర్శించి నవ్వులు పండించే నటుడు, బాబూ మోహన్ కు రోడ్డు ప్రమాదం, కడుపుకోత మిగిల్చింది. 2003 అక్టోబర్ 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ మరణించారు. రసూల్ పూరాలో ఉన్న తమ పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా జూబ్లీ హిల్స్ దగ్గర ఆయన ప్రయాణిస్తున్న బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పవన్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషాదం నుంచి బాబు మోహన్ బయటపడటానికి చాలా సంవత్సరాలు పట్టింది. కుమారుడు లేడనే వాస్తవాన్ని తట్టుకోలకే ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనింపించిందని ఆయన అన్నారు.

చెట్టంత ఎదిగి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే సమయంలో అకాల మృత్యవాత పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చిన ఘటన, నటుడు కోట శ్రీనివాసరావు ఇంట్లో చోటు చేసుకుంది. కుమారుడు చనిపోయే సీన్లు ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇష్టపడని ఆయనను, కన్నకొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. 2010వ సంవత్సరంలో జూన్ 20న కోటా కుమారుడు కోటా ప్రసాద్ తన బైక్ పై ఓ శుభకార్యానికి వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం, ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఉన్న ఒక్కగొనొక్క కుమారుడు ఫాదర్స్ డే రోజే దూరమవ్వడానికి కోటా చాలా రోజుల వరకు మరచిపోలేకపోయారు. తీవ్రమైన డ్రిపెషన్ లో చాలా కాలం కోలుకోలేకపోయారు.

భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా సేవలందించిన మహమ్మద్ అజారుద్దీన్ కు కూడా ఇదే తరహాలో పుత్రశోకం మిగిలింది. 2011 సెప్టెంబర్ 6న అజారుద్దీన్ చిన్న కుమారుడు అయాజుద్దీన్, ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనం వెనకే ఉన్న పోలీసులు, హుటాహుటినా అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో అయూజుద్దీన్ తో పాటు అతని స్నేహితుడు కూడా చనిపోయాడు. కొడుకు మరణంతో, అజార్ తీవ్రంగా క్రుంగిపోయారు.

రోడ్డు ప్రమాదాలు తల్లిదండ్రులను ఎంత క్షోభకు గురి చేస్తాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కుటుంబ సభ్యులను చూస్తే తెలుస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, తిరిగారని లోకాలకు తరలిపోయిన విషాద ఘటన కోమటిరెడ్డి ఇంట్లో చోటుచేసుకుంది. 2011 డిసెంబర్ 20న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కోమటి రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డితో పాటు మరో ఇద్దరు స్నేహితులు మరణించారు. గండిపేటోలని సిబిఐటిలో బీటెక్ చదువుతున్న ప్రతీక్ స్కోడా కారులో మెదక్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కొల్లూరు దగ్గర ఎదురుగా వెళ్తున్న గొర్రెల మందను తప్పించబోయే అదుపుతప్పి కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రతీక్ రెడ్డితో పాటు అతని స్నేహితులు అక్కడికక్కడే మరణించారు. సీటు బెల్ట్ ధరించకపోవడం, కారు అతివేగం వల్లే వీరు చనిపోయినట్టు విచారణలో తేలింది. చిన్నపాటి నిర్లక్ష్యానికి పెను మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

2012 నవంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు మరణించారు. 2013లో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ భాష రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరాం చనిపోయారు.

2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నేత భూమా శోభానాగిరెడ్డి కన్నుమూశారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని తప్పించబోయిన డ్రైవర్ పక్కనున్న రాళ్లను ఎక్కించడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల శోభా నాగిరెడ్డి అక్కడికక్కడే చనిపోయారు.

2017 మే 10వ తేదిన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో జరిగిన ప్రమాదం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏకైక కుమారుడు నిశీత్ నారాయణ చనిపోయారు. ఈ ఘటనలో నిశీత్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బెంజ్ కారు, మెట్రో పిల్లర్ కు బలంగా తాకడంతో పక్కటెముకలు విరిగి అక్కడికక్కడే మరణించారు. అధిక వేగానికి తోడు ప్రయాణ సమయంలో వీరు సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదం విచారణలో తేలింది. 2017 జూన్‌లో ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు నటుడు భరత్‌ కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇదే తరహాలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనుమడు కూడా చనిపోయారు.

మహారాష్ట్ర బీజేపీ ఉద్దండ నాయకుడు, గోపినాధ్ ముండే కూడా ఇలాంటి ప్రమాదంలోనే కన్నుమూశారు. 2014 జూన్ మూడవ తేదిన ఎయిర్ పోర్టుకు వెళుతున్న ఆయన కారును వెనక నుంచి వచ్చిన ఇండికా కారు వచ్చి వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముండేకు అప్పుడే గుండెపోటు రావడంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈఘటనలో వెనకనుంచి ముండే వాహనాన్ని ఢీ కొట్టిన డ్రైవర్ కు కంటి చూపు తక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. ఇకపై దేశంలో డ్రైవర్లందరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా చట్టం చేస్తామని చెప్పిన మంత్రి నితన్ గడ్కరీ తరువాత ఆ విషయం మర్చిపోయారు.

ఇలా ఎందరో ప్రముఖులతో పాటు మరెందరో వాహనదారులు, ప్రయాణీకులు నిత్యం ప్రాణాలు విడుస్తున్నారు. రహదారులు రక్తదారులుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నా అటు వాహనదార్లలోని ఇటు అధికారులలో గాని మార్పులు రావడం లేదు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. దేశంలో జరుగుతున్న ప్రమాదాల్లో 80 శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని 2015లో భారత జాతీయ రహదారులు, రవాణా శాఖ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. గడచిన పదేళ్లలో చూసుకుంటే లక్షలాది మంది ఇలా మానవ తప్పిదాలకు బలైన వారే.

Show Full Article
Print Article
Next Story
More Stories