లోక్‌సత్తా అధినేతగా లక్ష్మీనారాయణ

లోక్‌సత్తా అధినేతగా లక్ష్మీనారాయణ
x
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని లోక్‌సత్తాలో అధ్యక్ష పదవి...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్‌సత్తా అధినేత కానున్నట్లు తెలిసింది. కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకుని లోక్‌సత్తాలో అధ్యక్ష పదవి స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ప్రియదర్శిని హాల్‌లో కాసేపట్లో జరిగే సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా సుప్రసిద్ధుడైన లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా రైతాంగ సమస్యలపై అధ్యయనం చేశారు. దీర్ఘకాలంగా వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. వివిధ వర్గాలతో మమేకమయ్యారు. పలువురు ప్రముఖులతోనూ భేటీలు నిర్వహించారు. వారితో అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు. వీటన్నింటిని క్రోడీకరించుకున్న మీదట కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు.

ముందుగా సొంత పార్టీ పెట్టాలనుకున్న లక్ష్మీనారాయణ జనధ్వని అనే పేరును కూడా పరిశీలించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం కంటే..లోక్‌సత్తా వంటి పార్టీలో చేరి దాన్ని నడిపించడం మేలనే భావనకు తాజాగా వచ్చారు. దీనిపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణతో సంప్రదింపులు జరిపారు. భావజాలం ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఉభయుల ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. జేడీతో పాటు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాజీ బ్యూరోక్రాట్లు, మేధావులు లోక్‌సత్తాలో చేరి కలిసి నడుస్తారు. లోక్‌సత్తా అధినేతకు సలహాలు, సంప్రదింపుల బాధ్యతలో జేపీ ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories