అగ్ని పునీతం...భగభగ మండే అగ్ని కీలలను దాటుతున్న పశువులు

అగ్ని పునీతం...భగభగ మండే అగ్ని కీలలను దాటుతున్న పశువులు
x
Highlights

భగభగ మండే మంటలు, ఆకాశన్నంటే అగ్ని కీలలు. రాజేసిన ఎండు గడ్డి నుంచి ఎగిసి పడుతున్న నిప్పు రవ్వలు. నిప్పుల మధ్యలోకి దూకి.. సురక్షితంగా పశువులు బయటకి...

భగభగ మండే మంటలు, ఆకాశన్నంటే అగ్ని కీలలు. రాజేసిన ఎండు గడ్డి నుంచి ఎగిసి పడుతున్న నిప్పు రవ్వలు. నిప్పుల మధ్యలోకి దూకి.. సురక్షితంగా పశువులు బయటకి వస్తుంటే.. ఇలాంటిది కూడా జల్లికట్టు వంటి ఆచారమే. కొన్ని పండగల్లో, మరికొన్ని జాతరల్లో.. నిప్పుల్లో నడవడం మనకు తెలిసిందే. నిప్పులో నడిచి వస్తే మంచి జరుగుతుందని అంటారు. మరి పశువుల్ని కూడా నిప్పుల్లో నడిపించే సంప్రదాయం ఎక్కడుందో తెలుసా?

మానవ ఆచారంలో నిప్పుకి అగ్ర తాంబూలముంది. నిప్పు లేనిదే పూజాదికాలు పూర్తీ కావు. నిప్పు లేకుండా యజ్ఞయాగాదులు జరగవు. నిప్పు లేకుండా వంట కూడా కూడా కాదు. అందుకనే.. కర్నాటకలోని రైతులు నిప్పు రాజేసి.. అందులోకి పశువుల్ని పంపి పునీతం చేస్తుంటారు. ఇవి కర్నాటకలోని పల్లె ప్రాంతాలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఎండు గడ్డిని మంటేశారు. ఎద్దులను సిద్ధం చేశారు. సంక్రాంతి తొలి రోజున అగ్ని కీలల్లో ప్రవేశమే తరువాయి. సంక్రాంతి అంటేనే వ్యవసాయ పండగ. వ్యవసాయంతో ముడి వడిన పండగ కాబట్టే.. వ్యవసాయంలో తోడు నీడగా ఉండే పశు, పక్ష్యాదులు కూడా పండగలో భాగం అవుతాయి. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో నిలువునా రగులుతున్న అగ్ని కీలల్లో పశువులను దాటించడం అనాదిగా వస్తున్న ఆచారం. కర్నాటక రాష్ట్రంలోని పలు పల్లెల్లో ఆవులు, ఎద్దులను నిప్పుల్లో దాటిస్తుంటారు.

తమిళనాడు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించడం వివాదాస్పదమవుతుండగా.. కర్నాటకలోని ఈ నిప్పు సంప్రదాయం తెరపైకి వచ్చింది. చరిత్రలో ఎన్నడో ఉన్న ఈ నిప్పు దాటించే సంప్రదాయం.. మరుగున పడిపోయింది. మళ్లీ ఇటీవల కాలంలో పశువులను నిప్పుల్లో నడిపించడం మళ్లీ మొదలైంది. కర్నాటక రైతులు ఎద్దులను, ఆవులను రాజుల్లా చూసుకుంటారు. సంక్రాంతి తొలి రోజున పశువులకు చక్కగా అభ్యంగన స్నానం చేయిస్తారు. కలర్‌ఫుల్‌గా ముస్తాబు చేస్తారు. ఎరుపు, పసుపు రంగులతో వీటి మూపురాలపై రంగ వల్లులేస్తారు. అందమైన పూలతో అలంకరిస్తారు. ఇలా ఎద్దులు, ఆవులను అలంకరించి.. నిప్పులు దాటించడంలో సైన్సు కూడా దాగి ఉందంటారు. వేసవిలో వ్యవసాయ పనులకు అలవాటు చేయడానికి నిప్పులో దాటించడం సంప్రదాయంగా వస్తోందంటారిక్కడి రైతులు. సంక్రాంతి తొలి రోజున పశులను నిప్పులో దాటిస్తే.. వాటికి ఏడాది పొడవునా.. ఎలాంటి రోగాలూ సోకకుండా ఉంటాయని రైతుల విశ్వాసం.

వందల యేళ్ల నాటి ఈ సంప్రదాయంలో పశువులకు ఎలాంటి హానీ జరగదని అంటారు. నిప్పులో దాటడం వలన వాటి ఒంటిని నివాసంగా చేసుకొనే పురుగులు వేడికి రాలి పోతాయని అంటారు. దీంతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయని రైతుల నమ్మకం. ఎద్దుల, ఆవుల గిట్టల్లో ఉండే పురుగులు, కీటకాల గుడ్లు కూడ రాలిపోతాయని, పశువుల కొమ్ములకు రంగులేయడం వల్ల అవి వేడిని తట్టుకొంటాయని అంటారు. పశువులు అగ్ని పునీతం కావడంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, దిగుబడి పెరుగుతుందని, రైతుల కుటుంబాలు పాడి పంటలతో కళకళలాడుతుంటాయని కర్నాటక రైతుల విశ్వాసం.


సంక్రాంతి వచ్చిందంటే.. ఇక్కడ పశువులకు పండగ వచ్చినట్లే.. పండగ రోజున చక్కటి అలంకరణే కాకుండా.. వీటికి విందు భోజనం కూడా పెడతారు. నిప్పులు దాటి దిగ్విజయంగా వచ్చిన పశువులకు బెల్లం, కొబ్బరి వేసి చక్కగా ఉడికించిన పరమాన్నాన్ని ఆహారంగా పెడతారు. దీన్నే కర్నాటక రైతులు పశు క్రాంతి అంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories