ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు
x
Highlights

పోలవరమే తన ప్రాణం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే తన ధ్యేయమంటూ, సీఎం చంద్రబాబు, నిత్యం చెబుతూనే ఉంటారు. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి...

పోలవరమే తన ప్రాణం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే తన ధ్యేయమంటూ, సీఎం చంద్రబాబు, నిత్యం చెబుతూనే ఉంటారు. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కానీ అవన్నీ ప్రచార ఆర్బాటాలేనని, కాగ్‌ నివేదికతో తేటతెల్లమైంది. 2017, మార్చి నాటికి పూర్తికావాల్సిన ఒక్క ప్రాజెక్టూ కంప్లీట్ కాలేదని కుండబద్దలు కొట్టింది. అన్నీ కాకిలెక్కలు, తప్పుడు గణాంకాలను ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నిక్కచ్చిగా నివేదిక ఇచ్చింది కాగ్. రాబడులు, వాస్తవ గణాంకాల మధ్య, తేడా చాలా ఉందన్న కాగ్, అప్పులు పెరిగిపోతున్నాయని, వ్యాఖ్యానించింది. ఒకవైపు హోదా, కేంద్రం నిధుల సాయంపై ఉద్యమ హోరెత్తుతున్న వేళ, కాగ్‌ నివేదిక, చంద్రబాబు సర్కారును ఇరుకునపెడుతోంది.

బడ్జెట్‌లో రకరకాల అంకెల విన్యాసాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అసలు లెక్కలు విప్పింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్....కాగ్. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, విద్యావ్యవస్థ, రెవెన్యూ రాబడులు, పంచాయతీలు, మున్సిపాల్టీలు, ఇలా అన్ని విభాగాల లెక్కల గుట్టును బట్టబయలు చేసింది. ఖాతాల నిర్వహణ, ఆడిటింగ్‌ మొత్తం తప్పులతడకగా, లోపభూయిష్టంగా ఉందని తలంటుపోసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

2017 మార్చి 31 నాటికి 76 వేల కోట్ల రుణ బకాయిలు తీర్చాల్సి ఉందని కాగ్ నివేదికలో తెలిపింది. అయితే సాగునీటి ప్రాజెక్టులపై, కాగ్‌ సమర్పించిన గణాంకాలు చర్చనీయాంశమయ్యాయి. ప్రాజెక్టులు నిర్వహిస్తున్న తీరుపై, సర్కారు తీరును ఎండగట్టింది కాగ్. 2017 మార్చి 31నాటికి పూర్తికావాల్సిన 271 ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తికాలేదని, అంచనాలు రూ.28 వేల కోట్లకు పెంచేశారని అభిప్రాయపడింది. హడావుడి ఖర్చులతో 27 నుంచి 50 శాతానికి ప్రభుత్వం అంచనాలు పెంచిందని వెల్లడించింది.

ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లనే, అంచనా వ్యయం పెరిగిందని వెల్లడించింది కాగ్. పథకాలు పూర్తి చేయడంలో జాప్యం, చెప్పిన పథకాలు ప్రారంభించక పోవడంతో 2017 మార్చి నాటికి 110 కోట్లు నిధులు మిగిలిపోయాయని అభిప్రాయపడింది. డీపీఆర్‌లు తయారుకాకపోవడంతో రూ. 455 కోట్ల కేంద్ర సాయాన్ని వినియోగించుకోలేకపోయిందని తెలిపింది. ఒకవైపు విభజన హామీలు, నిధుల విడుదలపై రగడ, మరోవైపు జనసేన జేఎఫ్‌సీ నివేదిక నేపథ్యంలో, కాగ్‌ సమర్పించిన నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ లోటుపాట్లను నిక్కచ్చిగా ఎత్తిచూపింది కాగ్. చంద్రబాబు ప్రభుత్వం, పాలనాతీరుకు కాగ్ నివేదిక అద్దంపట్టిందని విపక్షాలు కూడా మండిపడ్డాయి.

కేవలం సాగునీటి ప్రాజెక్టులపైనే కాదు, విద్యావ్యవస్థ కూడా భ్రష్టుపట్టిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది కాగ్. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాల్లేవని, నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేశారని నివేదించింది. ఆరో తరగతి పిల్లల్లో చాలామంది చదవడం, రాయలేకపోతున్నారని రిపోర్ట్‌ ఇచ్చింది కాగ్.

ఆంధ్రప్రదేశ్‌లో, పాఠశాల విద్యావ్యవస్థ దారుణంగా ఉందని నివేదించింది కాగ్. బోధనలో విద్యా పరమైన పర్యవేక్షణ లేదని వ్యాఖ్యానించింది. బాలబాలికలకు ఉచిత,నిర్భంధ విద్యా హక్కు అమల్లోనూ చిత్తశుద్ది కరువైందని అభిప్రాయపడింది. విద్యాహక్కు చట్టం ప్రకారం, ఆరు నుంచి 14 ఏళ్ల పిల్లలను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహించాలని, కానీ ప్రభుత్వం చేయడంలేదని తెలిపింది. పాఠశాలల మ్యాపింగ్, పరిసర ప్రాంతాల గుర్తించే విధానాన్ని గాలికొదిలేసిందని నివేదించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు గాను, ప్రభుత్వం బడిబాట, బడి పిలుస్తోంది వంటి కార్యక్రమాలను నిర్వహించింది. ఐతే, ప్రాథమిక తరగతులకు సంబంధించి, 2010-11లో 91 శాతంగా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి, 2016-17లో 83 శాతానికి తగ్గిందని తెలిపింది కాగ్. అలాగే పిల్లలు పాఠశాలల్లో కొనసాగడాన్ని, వారి విద్యాపరమైన పురోగతిని పర్యవేక్షించడానికి, చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2010-11లో నిబద్దతను వ్యక్తం చేసింది. ఐతే, అది ఇప్పటికీ అమల్లోకి రాలేదని నివేదికలో తెలిపింది కాగ్.

మొత్తానికి ప్రాజెక్టుల నిర్మాణం, విద్యావ్యవస్థను బలోపేతం చేయడంపై పురోగతి సాధించామని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ గడువు నిర్దేశించుకున్నా, ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోవడాన్ని కాగ్‌ ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలో నాణ్యతాప్రమాణాలను గాలికొదిలేయడాన్ని ప్రశ్నించింది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం, కాగ్‌ రిపోర్ట్‌పై యధావిధిగా ఎదురుదాడి చేశారు. నివేదికను తప్పుపట్టారు. అయితే, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, చంద్రబాబు సర్కారుపై కాగ్‌ మొట్టికాయలు వేసిందని, ఇదే రిపోర్ట్‌తో ప్రజల్లోకి వెళతామని చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories