ఉత్తమ్‌ బస్సు యాత్రకు బ్రేక్‌?

x
Highlights

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకూ గడ్డం గీసుకోనంటూ ప్రతినబూని.... పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు......

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకూ గడ్డం గీసుకోనంటూ ప్రతినబూని.... పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు... సీనియర్లు చెక్‌ పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. మూడు విడతల్లో 38 నియోజకవర్గాలను చుట్టేసిన ఉత్తమ్‌ను... నాలుగో విడత యాత్ర చేపట్టొద్దని అధిష్టానం ఆదేశించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఉత్తమ్‌ ఢిల్లీ టూర్ తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్రకు బ్రేక్‌ పడినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు విడతల్లో ఇప్పటికే 38 నియోజకవర్గాలను చుట్టొచ్చిన ఉత్తమ్‌‌కి సీనియర్లు అడ్డుపుల్ల వేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో ఉత్తమ్‌ బస్సు యాత్ర సక్సెస్‌ఫుల్‌గానే సాగినా.... రెండు, మూడు విడతల్లో వర్గపోరు బయటపడింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.... కొన్నిచోట్ల అభ్యర్ధులను ప్రకటించడం, సీఎంగా ప్రకటనలు చేయించుకోవడంతో కథ మొత్తం అడ్డం తిరిగందనే టాక్ వినిపిస్తోంది.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే మూడ్రోజులపాటు ఢిల్లీలో మకాంవేసి రాహుల్‌గాంధీని కలిసి వచ్చారు. అయితే బస్సు యాత్ర కంటే ముఖ్యంగా శక్తి యాప్‌ను ఎక్కువ మందికి చేరువ చేయాలని, అలాగే 30వేల 600 బూత్‌ కమిటీలను నియమించి, నాలుగున్నర లక్షల మంది బూత్‌ కమిటీ సైనికులను తయారు చేయాలని రాహుల్‌ చెప్పినట్లు తెలిపారు. ముందు ఇవన్నీ పూర్తిచేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలని రాహుల్‌ ఆదేశించారని స్వయంగా ఉత్తమే చెప్పడంతో బస్సు యాత్ర కొనసాగింపుపై అనుమానాలు మొదలయ్యాయి.

అయితే ఈనెల 18నుంచి నాలుగో విడత బస్సు యాత్రను మొదలుపెట్టాలని ఉత్తమ్‌ భావించారు. కానీ ఢిల్లీ పర్యటన తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైంది. యాత్ర కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బస్సు ...ప్రస్తుతం గాంధీభవన్‌లోనే ఉంది. మరోవైపు ఉత్తమ్‌కి వ్యతిరేకంగా పలువురు సీనియర్లు ఢిల్లీ వెళ్లడంతో... ఈ బస్సు ముందుకు కదులుతుందా? లేక గాంధీభవన్‌లోనే పర్మినెంట్‌గా ఉండిపోతుందా? అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories