ఒక ఫోన్ కాల్... ఒకే ఒక్క ఫోన్ కాల్..జగన్‌కు ఝలక్ ఇచ్చింది

ఒక ఫోన్ కాల్... ఒకే ఒక్క ఫోన్ కాల్..జగన్‌కు ఝలక్ ఇచ్చింది
x
Highlights

రాజకీయాల్లో హత్యలుండవ్.. అన్నీ ఆత్మహత్యలే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. అవకాశం కోసం ఎదురుచూసిన చాలామంది.. అరటితొక్క మీద కాలేసిన సందర్భాలు...

రాజకీయాల్లో హత్యలుండవ్.. అన్నీ ఆత్మహత్యలే. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. అవకాశం కోసం ఎదురుచూసిన చాలామంది.. అరటితొక్క మీద కాలేసిన సందర్భాలు కోకొల్లలు. గోడ దూకేందుకు ముహూర్తాలు పెట్టుకున్న కొందరు.. అటూ ఇటూ కాకుండా.. గోడ మీద పిల్లుల్లా కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి అనుభవించిన వారూ ఉన్నారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ కథ కూడా వీటికే విరుద్దం కాదని తేలిపోయింది.

మరికొన్ని గంటల్లో ఫ్యాన్‌ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సిన సమయం..కమలానికి హ్యాండిచ్చి.. సమయం కోసం వేచిచూస్తున్న తరుణం..అంతలోనే గుండెలు బద్దలయ్యే కలకలం.. జగన్‌ చేత తీర్థం పుచ్చుకోవాల్సిన కన్నా లక్ష్మీనారాయణ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనం..

ఏమైంది..? అసలేమై ఉంటుంది..? అంతా ఓకే అనుకున్నా.. ఏంటీ రివర్స్ పంచ్. ఎవరూ ఊహించని ఈ ట్విస్ట్ వెనకాల ఉన్న బ్లాస్ట్ ఏంటి..? నిన్నటి వరకు సరిగానే ఉన్న కన్నా ఆరోగ్యం.. ఇప్పటికిప్పుడు ఎందుకు తిరగబడింది..? ఇప్పుడందరికీ కావాల్సినవి.. ఈ ప్రశ్నలకు సమాధానాలే.

2014 ఎన్నికల తర్వాత అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఏపీకి చెందిన పలువురు సీనియర్లు కమలం గూటికి చేరారు. అయితే ఐదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా వారంతా జగన్ పంచన చేరాలని నిర్ణయించుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, వసంత నాగేశ్వర్రావ్ కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా కుదిరింది. బుధవారం వారంతా జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కన్నా ఆస్పత్రిలో చేరడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన అనుభవం కన్నా లక్ష్మీనారాయణ సొంతం. ఇటు కాటసాని కూడా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంతటి అనుభవజ్ఞులైన వీరు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై వస్తున్న వ్యతిరేకతతో కమలం గూటి నుంచి ఫ్యాన్ చెంతకు చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నుంచి జగన్ ఫోన్ రావడంతో వీరి కథ అడ్డం తిరిగింది. ఫిరాయింపులపై గగ్గోలు పెడుతున్న వైసీపీ ఇప్పుడెందుకు ప్రోత్సహిస్తున్నట్లు జగన్‌ను, షా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమిత్ షా ప్రశ్నలపై నీళ్లు నమిలిన జగన్ కన్నా, కాటసాని చేరికను బ్రేక్ వేశారు.

దీంతో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న కన్నా లక్ష్మీనారాయణ హార్ట్ అటాక్ అంటూ ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశమైంది. ఇటు అనుచరులతో నిర్ణయం తీసుకుని తీర్థం పుచ్చుకునే సమయంలో కథ అడ్డం తిరగడంతో కాటసాని, వసంత కృష్ణ ప్రసాద్‌, వారి అనుచరగణం వలసలకు బ్రేక్ పడినట్లైంది. ఇకముందు కూడా బీజేపీ నుంచి ఇతర పార్టీల్లో చేరాలనుకునే వారికి కూడా ఇదో హెచ్చరికలా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories