బీజేపీ ఈ పేరు చెబితే చాలు విపక్షాలు ఒంటి కాలి మీద లేస్తుంటాయి. మహాగఠ్ బంధన్ తో బీజేపీని ఓడిస్తామంటాయి. తాజా ఉపఎన్నికల్లో బీజేపీని ఓడిపోవడాన్ని గుర్తు...
బీజేపీ ఈ పేరు చెబితే చాలు విపక్షాలు ఒంటి కాలి మీద లేస్తుంటాయి. మహాగఠ్ బంధన్ తో బీజేపీని ఓడిస్తామంటాయి. తాజా ఉపఎన్నికల్లో బీజేపీని ఓడిపోవడాన్ని గుర్తు చేస్తుంటాయి. పొత్తుల కోసం త్యాగాలకు సిద్ధమంటాయి. విపక్షాలు ఇంతగా ఆవేశపడుతున్నా బీజేపీ మాత్రం కూల్ గానే ఉంది. దాని లెక్కలు దానికి ఉన్నాయి. విపక్షాలు దండెత్తి వస్తున్నా బీజేపీ అంత కూల్ గా ఎలా ఉండగలుగుతోంది ? అంత ధీమా ప్రదర్శించడానికి కారణమేంటి ? విజయం పై అంత భరోసాను ఆ పార్టీ వ్యూహకర్తలు ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు ఆ పార్టీ వ్యూహం ఏంటి ఆ పార్టీ చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్ర్తం ఏంటి.
నాలుగైదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొనడం సహజమే. అది ఒక స్థాయి దాటనంత వరకూ ఆ పార్టీకి పెద్దగా వచ్చే ముప్పు కూడా ఏదీ ఉండదు. ప్రస్తుతానికి బీజేపీ ఇదే పరిస్థితి లో ఉంది. అందుకు పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు రంగంలోకి దిగింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనదైన శైలిలో వ్యూహాలు రూపొందిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా విపక్షాలు బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ పార్టీకి ప్రజల్లో బలం తగ్గిందని వాదిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల ఫలితాలను అందుకు నిదర్శనమని చెబుతున్నారు. చివరకు పార్టీలో నాయకత్వ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉందనే వరకూ ఈ ప్రచారం వెళ్ళింది. విపక్షాలు ఇంతగా గగ్గోలు పెడుతున్నా బీజేపీ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉంది. అందుకు ఓ కారణం ఉంది. కాంగ్రెస్ మార్గదర్శనంలో ముందుకెళ్తున్న విపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఉంది. అదే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. తనకు ప్రత్యామ్నాయం లేదనే విషయాన్ని బీజేపీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళనుంది. మోడీ స్థాయి నాయకుడు విపక్షాల్లో లేరనే విషయాన్ని చాటి చెప్పనుంది. 2017 కు ముందు బీజేపీకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాలేదు. ఉప ఎన్నికల్లో ఓటమితో రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం గ్యారంటీ కాదనే విషయం స్పష్టమైంది. విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేందుకు మరిన్ని వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించింది. ఇప్పటి వరకూ ఉనికి లేని ప్రాంతాల్లో ఉనికి పెంచుకోవడం లాంటివి అందులో భాగమే. మోడీ ఫరెవర్ అన్న బీజేపీ ఇప్పుడు స్వరం కాస్తంత తగ్గించుకొని మోడీకి ప్రత్యామ్నాయం లేదు అనే వాదనను ప్రజల ముందుకు తీసుకువస్తున్నది.
బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనేది గతంలో బీజేపీ నినాదంగా ఉండింది. ప్రజలకు అది ఒక అభ్యర్థన. బీజేపీకి, మోడీకి ప్రత్యామ్నాయం లేదు అనేది తాజా నినాదం. నాటితో పోలిస్తే నేటి నినాదంలో మాత్రం తీవ్రత స్థాయి కాస్తంత ఎక్కువగానే ఉంది. మేము చేయగలిగినదంతా చేశాం. అంతకు మించి చేసే వారు విపక్షాల్లో లేరు. బీజేపీకి, మోడీకి మరో ప్రత్యామ్నాయం లేదు అనే సందేశం అందులో ఉంది. మరి నిజంగానే బీజేపీ కి ఆల్టర్నేటివ్ లేదా ? మోడీ కి ప్రత్యామ్నాయంగా విపక్ష నాయకులెవరూ లేరా ? అదీ చూద్దాం. విపక్షాలు అన్నీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడుదామనుకున్నాయి. అక్కడే మొదటి చీలిక వచ్చింది. కాంగ్రెసేతర ఫ్రంట్ అంటూ కొన్ని పార్టీలు మూడో ఫ్రంట్ ముచ్చట తెచ్చాయి. ఇలాంటి మూడో ఫ్రంట్ లు ఎన్ని ఏర్పడుతాయో కూడా అర్థం కాకుండా ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ తరహా ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఇతర పార్టీల నాయకులు కూడా ఇదే తరహా ప్రతిపాదనతో తమ సారథ్యంలో ఆ ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మూడో ఫ్రంట్ లు ఎన్ని ఏర్పడుతాయో కూడా తెలియదు.
మొన్నటి వరకూ కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ బలంగానే ఉండింది. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ మహాగఠ్ బంధన్ తెరపైకి వచ్చింది. యూపీఏ స్థానాన్ని ఇది ఆక్రమించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రయోగాలు గతంలోనూ జరిగినా, కొద్ది కాలంలోనే విఫలమయ్యాయి. 2015 లో బీహార్ లో మహాగఠ్ బంధన్ ఏర్పడింది. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇందులో భాగస్వామ్యపక్షాలు. 2017 జులై 26న నితీశ్ కుమార్ ఈ కూటమిని వదిలేశారు. తాజాగా ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో మహాగఠ్ బంధన్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూపీఏ పక్షాలతో పాటు మరికొన్ని ఇందులో చేరే అవకాశం ఉంది. అదే సమయంలో ఇలాంటి మహా కూటములు ఎన్ని రాష్ట్రాల్లో, ఎవరెవరి నేతృత్వంలో ఎన్ని ఏర్పడుతాయి అనేది కూడా అంతు చిక్కకుండా ఉంది. ఒక రాష్ట్రంలో కలసి పోటీ చేసే పార్టీలు మరో రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది.
బీజేపీ తాజా నినాదం దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. అంటే మరో ప్రత్యామ్నాయమేదీ అందుబాటులో లేదని, అది నిజమేననిపిస్తోంది. ఇంకా రూపుదిద్దుకోని మహాగఠ్ బంధన్ కు ఎవరు నాయకత్వం వహిస్తారో తెలియదు. ఆ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో అంతకన్నా తెలియదు. అలాంటి పరిస్థితిలో ప్రజలు ఏం చూసి ఆ కూటమికి ఓటేస్తారు.....బీజేపీ పై వ్యతిరేకత మాత్రమే ఆ కూటమికి ఓట్లు రాలుస్తుందా ?
యుద్ధ రంగంలో రెండు పక్షాలు తలపడుతుంటే ఆ పక్షాలకు నాయకత్వం ఉండాలి. ఎన్డీయే కు బీజేపీ సారథ్యం వహిస్తున్నారు. మోడీని తమ పక్షం తరఫున ప్రధాని అభ్యర్థిగా చాటి చెబతున్నారు. మహా కూటమికి మాత్రం ఏ పార్టీ దిశానిర్దేశం చేస్తుందో తెలియదు. ఆ పక్షం నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తరువాతనే నాయకత్వం గురించి ఆలోచిద్దామని ఆ పార్టీలు ఒక అవగాహనకు వస్తున్నాయి. బీజేపీలో ఒక్కడే నాయకుడు కనిపిస్తున్నారు. మహా కూటమిలో మాత్రం ఎంతోమంది నాయకులు కనిపిస్తున్నారు. నిజానికి మహాకూటమి అంటూ ఏర్పడితే దానికి సారథ్యం వహించాల్సింది కాంగ్రెస్. ప్రధాని అభ్యర్థిగా ఉండాల్సింది రాహుల్ గాంధీ. కాకపోతే, మరెన్నో పార్టీలు కాంగ్రెస్ సారథ్యంపై, రాహుల్ గాంధీ నేతృత్వంపై ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి వేసింది. పొత్తుల కోసం భారీస్థాయిలో త్యాగాలు చేసేందుకు సిద్ధపడుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరమే ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేసేందుకు కూడా తలవొగ్గింది.
ఉత్తరభారతదేశ రాజకీయాల్లో మాయావతి, అఖిలేశ్ లాంటి వారి ప్రాబల్యం పెరిగింది. తన సారథ్యంలో ఫ్రంట్ ఏర్పడాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కూటమిలో ఎన్ని పార్టీలు కుదురుగా ఉంటాయో తెలియదు ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు మాయావతి, మమత బెనర్జీ, రాహుల్....? ఎవరు ప్రధాని అవుతారు ?. ఈ రెండు అంశాలూ ఓటర్లను బీజేపీ వైపు మొగ్గు చూపేలా చేసే అవకాశాలున్నాయి. మహా కూటమికి ఇవే అంశాలు మైనస్ పాయింట్లుగా మారే అవకాశం ఉంది. మోడీ కాకుంటే ప్రధాని ఎవరు అనే ప్రశ్న ఓటర్ల మదిలో అనేక సందేహాలను రేకెత్తిస్తుంది. ఉన్న ఆప్షన్స్ లో మోడీకి ప్రత్యామ్నాయం ఎంచుకోవడం ఓటర్లకు కష్టం కాగలదని బీజేపీ భావిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే 1971లో కూడా ఇదే విధమైన పరిస్థితి తలెత్తింది. విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. ఇందిరా హఠావో అని పిలుపునిచ్చాయి. ఇందిరాగాంధీ మాత్రం గరీబీ హఠావో అని పిలుపునిచ్చారు. ప్రజలు ఇందిరాగాంధీకి పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం కాగలదని భావన కూడా వ్యక్తమవుతోంది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. సొంతంగా మెజారీటీ సాధించడం కష్టమైనప్పటికీ, భాగస్వామ్య పక్షాలతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఇన్నాళ్లుగా బీజేపీ ధోరణితో ఇబ్బందులకు గురైన మిత్రపక్షాలు ఎన్నికల సందర్భంగా భారీగా బేరసారాలు చేసే అవకాశం కూడా ఉంది. వాటికి అలాంటి అవకాశం రాకుండా చూసేందుకు, సొంతంగానే మెజారిటీ సాధించేందుకు బీజేపీ వ్యూహాలు రూపొందించుకుంటోంది. బీజేపీ వ్యూహకర్త అమిత్ షా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. దక్షిణాదిన పార్టీ బలపడితే అది బీజేపీకి నెంబర్ గేమ్ లో తోడ్పడనుంది. ఉత్తర భారతదేశంలో వాటిల్లే నష్టాన్ని కొంతమేరకు పూడ్చే అవకాశం ఉంది. అందుకే అమిత్ షా దక్షిణ భారతదేశంపై ప్రత్యేకంగా దృష్టి వహించారు. తరచూ ఇక్కడికి వస్తూ నాయకులతో సమావేశమవుతున్నారు. కర్నాటకలో మినహాయిస్తే, దక్షిణాదిన ఎక్కడ కూడా బీజేపీ ప్రబల శక్తిగా లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో కూడా ఆంధ్రప్రదేశ్ తరహా వ్యూహాన్ని బీజేపీ అమలు చేయనుంది. డీఎంకే కు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అన్నా డీఎంకేతో అనుబంధం తెగిపోకుండా చూసుకుంటోంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ నే తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. అది బీజేపీకి ఏదో రకంగా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో రెండు లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలిచింది. అప్పట్లో అక్కడ తెలుగుదేశంతో పొత్తు ఉండింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఏపీలో మరో బలమైన పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ సీపీతో అవగాహనకు ప్రయత్నించే అవకాశం ఉంది.
కర్నాటకలో ఇప్పటికే బీజేపీ పటిష్ఠంగా ఉంది. ఇక మిగిలినవి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వీటిలో మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్య 102. గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 4 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. తెలంగాణ లో ఇటీవలే అమిత్ షా రెండు దఫాలుగా ఇక్కడి నాయకులతో భేటీ అయ్యారు. పార్టీ వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. కర్నాటకలో 25 లోక్ సభ స్థానాలకు గాను 15 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఏపీలో 20 స్థానాలకు గాను 2 చోట్ల గెలిచింది. తెలంగాణలో 17 స్థానాలకు గాను ఒక స్థానంలో విజయం సాధించింది. తమిళనాడులో 39 స్థానాలకు గాను ఒక స్థానంలో గెలిచింది. కేరళలో 20 స్థానాలుంటే ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఈ నేపథ్యంలో పటిష్ఠ వ్యూహాలతో దక్షిణాదిన మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. మొత్తం మీద ప్రత్యామ్నాయం బలంగా లేకపోవడం ఇప్పుడు బీజేపీకి, ప్రధాని మోడీకి కలసి వచ్చే అవకాశంగా మారింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire