logo
జాతీయం

ఈశాన్య రాజకీయ చరిత్రను కుదిపేసిన బీజేపీ

ఈశాన్య రాజకీయ చరిత్రను కుదిపేసిన బీజేపీ
X
Highlights

భారతదేశ రాజకీయ ప్రస్థానంలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అసలు ఉనికేలేని ఈశాన్య భారతంలో అఖండ విజయాలు సాధించింది....

భారతదేశ రాజకీయ ప్రస్థానంలో బీజేపీ చరిత్ర సృష్టించింది. అసలు ఉనికేలేని ఈశాన్య భారతంలో అఖండ విజయాలు సాధించింది. త్రిపురలో పాతికేళ్ల ఎర్రకోటను బద్దలుకొట్టింది. నాగాలాండ్‌లో తిరుగులేని పాగా వేసింది. ఉత్తరాదే కాదు, ఈశాన్యమూ తమదేనని నరేంద్ర మోడీ, అమిత్‌ షా ద్వయం చాటిచెప్పింది. ఇప్పుడు త్రిపుర, రేపు కేరళ, తర్వాత వెస్ట్‌బెంగాల్‌ అని కమ్యూనిస్టుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కాంగ్రెస్‌ను త్రిపురలో తుడిచిపెట్టేసింది బీజేపీ.

ఈశాన్యంలో వికసిస్తున్న కమలం
ఇది నిజంగా భారతీయ జనతా పార్టీకి పండగరోజు. ఉత్తరాదిలో గెలవడం ఏమంత పెద్ద విషయమూ కాదు. జాతీయవాదంతో గెలిచేస్తుంది. కానీ గిరిజనులు, క్రిస్టియన్లు అధికంగా ఉన్న, ఈశాన్య భారతంలో వికసిస్తోంది కమలం. తాజాగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో తిరుగులేని ఆధిక్యత సాధించి, భారతదేశ రాజకీయ చరిత్రను ఒక్కసారిగా కుదిపేసింది.

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో దుమ్మురేపిన మోడీ, షా ద్వయం
ఇప్పటికే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌లో తిరుగులేని విజయం సాధించి, తొలిసారి ఈశాన్యంలోకి ప్రవేశించింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మిగతా నార్త్ ఈస్ట్‌ రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో దుమ్మురేపింది నరేంద్రమోడీ, అమిత్‌ షా ద్వయం.


2013లో బీజేపీ ఓటు షేరు కేవలం 1.3 శాతం
త్రిపుర. పాతికేళ్లుగా ఎర్రజెండా ఎగురుతున్న రాష్ట్రం. అసలు బీజేపీ ఉనికే అక్కడ ఒకప్పుడు లేదు. 2013లో కేవలం 1.3 శాతం ఓటుతో, తానున్నానంటూ చాటుకుంది. 2013లో 59 స్థానాల్లో దాదాపు 40 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, ఇప్పడుక్కడ తిరుగులేని విజయం సాధించింది. ఎర్రజెండాకు పాతరేసి కాషాయాన్ని రెపరెపలాడించింది.

మార్పు తెద్దాం.. మాతో రండి అని పిలుపునిచ్చిన మోడీ
మార్పు తెద్దాం.. మాతో రండి' అని, త్రిపుర ప్రజల వేషధారణలో పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ. ‘ఇప్పటిదాకా మాణిక్యం ధరించాం. ఇక ‘హీరా' అంటే వజ్రాన్ని ధరిద్దామంటూ నినాదాలు చేశారు. ‘హైవే, ఐ-వే, రోడ్లు, ఎయిర్-వే' పదాల్లోని తొలి అక్షరాలను కలిపి తనదైన శైలిలో ‘హీరా'గా అభివర్ణించారు మోడీ. తాను చెబుతున్న, మార్పు దిశగా త్రిపురలో ‘వాణిజ్యం, పర్యాటకం, నైపుణ్య శిక్షణ' పేరిట త్రిముఖ పథకం అమలు చేస్తామని ప్రధాని వివరించి, త్రిపుర జనంలో ఆశలు రేకెత్తించారు. దానికి తగ్గట్టే ఫలితాలు రాబట్టారు.

నాగాలాండ్‌లోనూ బీజేపీ పాగా
నాగాలాండ్‌. మన మూలవాసులుగా చెప్పుకునే నాగా గిరిజనుల క్షేత్రం. బహుశా ఐదు, పదేళ్ల క్రితం అక్కడ బీజేపీ అంటే కూడా ఎవరికీ తేలీదేమో. కానీ నాగాలాండ్‌లో పాగా వేసే దిశగా కదులుతోంది బీజేపీ. 2013 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క స్థానం, 1.7 శాతం ఓట్ల షేరుతో ఏదో ఉన్నానంటే, ఉన్నానట్టుగా విజయం సాధించింది. కానీ నేడు నాగాలాండ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. మిగతా పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటోంది. నాగాలాండ్‌లో బీజేపీ పాగా వేయడం మామూలు విషయం కాదు, అసాధారణం.

మేఘాలయాలోనూ బీజేపీ ఎఫెక్ట్
మేఘాలయ. క్రిస్టియన్లే మెజారిటీ. బీఫ్‌ రగడ, ఎన్నికల సమయంలో బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2013లో మేఘాలయాలో అసలక్కడ బీజేపీకి స్థానంలేదు. కానీ ఇప్పుడు ఓటు షేరు పెంచుకోవడంతో పాటు, ఎన్నోకొన్ని స్థానాలతో శాసన సభలో అడుగుపెడుతోంది.

త్రిపుర విక్టరీ క్రెడిట్‌ మోడీ, షాలకే కాదు స్థానిక నేతలది కూడా..
త్రిపురలో మాణిక్ సర్కార్‌ ప్రభుత్వాన్ని కాదని, జనం బీజేపీకి పట్టంకట్టారు. ఇది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో సెన్సేషన్. నరేంద్ర మోడీ, అమిత్‌ షాలు ఊరూరా ఎన్నికల సభలు పెట్టారు. అమిత్‌ షా అయితే, తన ఉత్తరాది ఫార్ములా బూత్‌లెవల్‌ కమిటీలు, కుల, మత సమీకరణలు, చిన్నాచితకా పార్టీలతో జట్టు, కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీల సభ్యులను చేర్చుకోవడం, ఇలా అన్ని అస్త్రాలు ఈశాన్యంలో ప్రయోగించారు. అయితే త్రిపుర క్రెడిట్‌ను కేవలం మోడీ, షాలకే కట్టబెట్టడం సరికాదు. స్థానిక బీజేపీ, నేతలు అహర్నిశలు కృషి చేశారు. ఎర్రకోటను బద్దలు చేశారు.

త్రిపుర తర్వాత కాషాయ గురి కేరళ, బెంగాలేనా?
ఇప్పుడు త్రిపురలో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టింది. ఇక తర్వాతి టార్గెట్‌ కేరళ అంటోంది కాషాయం. ఇక ఆ తర్వాత, పశ్చిమబెంగాల్‌ అని ఉరకలేస్తోంది బీజేపీ. ఒక్కోరాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటోంది.

కాంగ్రెస్‌ ముక్త్ ఈశాన్య భారతం
ఒకప్పుడు నార్త్‌ ఈస్ట్‌లో కాంగ్రెస్‌ మాత్రమే ఏకఛత్రాధిపత్యం. కానీ ఉత్తరాది, దక్షిణాదిలోనే కాదు, ఇక ఈశాన్యంలోనూ తుడిచిపెట్టుకుపోతోంది కాంగ్రెస్. కాంగ్రెస్ ముక్త్ నార్త్‌ ఈస్ట్‌గా పాతాళానికి పడిపోతోంది. త్రిపురలో రెండోస్థానాన్ని కూడా కోల్పోయింది. అసలు పెద్దగా ఉనికేలేని బీజేపీ, కాంగ్రెస్‌‌ను ఖల్లాస్ చేసింది. ఈశాన్య విజయంతో కర్ణాటక, తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ ఎన్నికలు, ఇక ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు సమరోత్సాహంతో వెళ్లబోతోంది కాషాయం.

Next Story