బీజేపీ, టీడీపీ మధ్య పట్టిసీమ వార్‌

బీజేపీ, టీడీపీ మధ్య పట్టిసీమ వార్‌
x
Highlights

ఏపీ సర్కార్‌పై కమలం నేతల ఎదురుదాడి మొదలయింది. ఇప్పటి వరకు మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చిన బీజేపీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానంతో పంథా మార్చుకుంది....

ఏపీ సర్కార్‌పై కమలం నేతల ఎదురుదాడి మొదలయింది. ఇప్పటి వరకు మిత్రపక్షంగా కొనసాగుతూ వచ్చిన బీజేపీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానంతో పంథా మార్చుకుంది. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీబీఐ చేత విచారణ జరిపించాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తమ దైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పారు. అంతేకాదు నెలలోనే ఎంత మార్పు వచ్చిందంటూ మంత్రులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీ, బీజేపీ మధ్య మాటలు యుద్ధం తారస్థాయికి చేరింది. అవిశ్వాస తీర్మానం ఎఫెక్ట్‌తో రెండు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం ఆ తర్వాత ఎన్డీఎ నుంచి వైదొలగడంతో బీజేపీ కోపం నషాళానికి ఎక్కింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో బీజేపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్‌ చేశారు. తాముఅడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్‌ రాం మాధవ్‌ తెలుగుదేశం పార్టీని హెచ్చరించారు. అందుకనుగుణంగా ఏపీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీపై ఎటాక్‌ మొదలెట్టారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నిధులు వృథా అయ్యాయని సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.

విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే బయటకు వెళ్లి మాట్లాడాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. మోడి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పట్టిసీమ గురించి మూడేళ్లు ఎందుకు మాట్లాడలేదన్న మంత్రులు బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పారు. ఇన్నేళ్లు కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా..? ఏమి డ్రామాలు మొదలు పెట్టారని దేవినేని కౌంటర్ ఇచ్చారు. పట్టిసీమపై వైసీపీ నేత బుగ్గన రాజేందర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలనే విష్ణుకుమార్ రాజు చదువుతున్నారంటూ రివర్స్‌ ఎటాక్‌ ఇచ్చారు.

నాలుగేళ్ల పాటు పాలు నీళ్లలా కలిసున్న టీడీపీ-బీజేపీ నేతలు ఉప్పు నిప్పులా మారిపోయారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ,బీజేపీ నేతల పరస్పర విమర్శలు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories