వ్యూహాత్మకంగా అడుగేసిన బిజెపి

వ్యూహాత్మకంగా అడుగేసిన బిజెపి
x
Highlights

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో కాషాయదళం విజయం సాధించింది. అమిత్‌షా- మోదీల మంత్రాగం ముందు విపక్షాల ఐక్యత రాగం పనిచేయలేదు. సార్వత్రిక ఎన్నికల...

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో కాషాయదళం విజయం సాధించింది. అమిత్‌షా- మోదీల మంత్రాగం ముందు విపక్షాల ఐక్యత రాగం పనిచేయలేదు. సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన కమలదళం రాజ్యసభలోనూ తన ఆధిపతాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా విజయం సాధించిన హరివంశ్‌ నారాయణ్‌‌కు వివిధ పక్షాల నేతలు అభినందనలు తెలియజేశారు.

తీవ్ర ఉత్కంఠతో పాటు ఆసక్తిని రేపిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్ధి హరివంశ్‌ నారాయణ్‌ ఘన విజయం సాధించారు. జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌ మిత్ర పక్షాల సహకారంతో సులువుగా విజయం సాధించారు. అంతా ఊహించినట్టుగానే టీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు ఎంపీలు, బీజేడీకి చెందిన 9మంది ఎన్‌డీఏ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్‌కు మొత్తం 232 మంది సభ్యులు హాజరుకాగా 125 ఓట్లు హరివంశ్ సాధించారు.

గెలుపే లక్ష్యంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్‌ 105 ఓట్లు మాత్రమే సాధించి పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో కాంగ్రెస్ అభ్యర్ధికి తెలుగు దేశం పార్టీ సభ్యులు మద్ధతిచ్చారు. అయితే కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ పరమైన విభేదాలతో ఆప్‌, పీడీపీ, వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు హరిప్రసాద్‌కు మద్ధతివ్వలేదు.

సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వచ్చిన డిప్యూటి ఛైర్మన్ ఎన్నికను బీజేపీ వ్యూహాత్మకంగా ఎదుర్కొంది. ఎన్నికల సమయంలో ప్రయోగాలు చేయడం మంచిది కాదని భావించిన కాషాయదళం మిత్రపక్షం జేడీయూ చెందిన హరివంశ్‌ నారాయణ్‌ను బరిలోకి దింపింది. మద్ధతు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే కొత్త మిత్రపక్షాలతో సలువుగా విజయం సాధించింది.

ఓటింగ్‌లో హరివంశ‌్ నారాయణ విజయం సాధించినట్టు ప్రకటించగానే ఎన్‌డీఏ పక్ష సభ్యులు బల్లలు చరిచి అభినందనలు తెలియజేశారు. అనంతరం వివిధ పార్టీల పక్ష నేతల దగ్గరకు వెళ్లి కరచాలనం చేసిన ఆయన కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ అజాద్‌‌ను కలిసి ఆయన పక్క సీట్లోనే కూర్చుకున్నారు.

డిప్యూటి ఛైర్మన్‌‌గా ఎన్నికైన అనంతరం సభలో మాట్లాడిన హరివంశ్‌ నారాయణ్‌ సభలోని ప్రతి ఒక్కరు చూపిన చొరవ వల్లే తాను విజయం సాధించానన్నారు. తన బలం సభలోని సభ్యులేనని వారి సహకారంతోనే సభను నడిపిస్తానంటూ ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభను వాయిదా వేశారు. డిప్యూటి ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ ఎంపికైన సందర్భంగా శుక్రవారం అల్పహార విందు ఇస్తున్నట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories