ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో లెక్క చెప్పిన బీజేపీ నేతలు

ఏపీకి కేంద్రం ఏమిచ్చిందో లెక్క చెప్పిన బీజేపీ నేతలు
x
Highlights

పవన్ కల్యాణ్ కోరినట్టు శ్వేతపత్రం అయినా, కాకపోయినా.. బీజేపీ నేతలు మాత్రం ఓ లెక్కాపత్రం పట్టుకొచ్చారు. ఏపీకి తామేమీ చేయలేదనడం సరికాదని.. రాజకీయ...

పవన్ కల్యాణ్ కోరినట్టు శ్వేతపత్రం అయినా, కాకపోయినా.. బీజేపీ నేతలు మాత్రం ఓ లెక్కాపత్రం పట్టుకొచ్చారు. ఏపీకి తామేమీ చేయలేదనడం సరికాదని.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోవాలని వైసీపీ, టీడీపీలకు హితవు పలికారు. కేంద్రం అందించిన నిధుల వివరాలు బీజేపీ వెల్లడించడంతో.. ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులో పడినట్టయింది.

ఏపీ కోసం కేంద్రం ఏమిచ్చిందో బహుశా తొలిసారిగా చాలా వివరణాత్మకంగా బీజేపీ నేతలు వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నుంచీ కేంద్రం మీద పెరుగుతున్న ఒత్తిడితో బీజేపీ నేతలు సతమతమవుతున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా రెండు పార్టీలూ నిధుల వివరాలు వెల్లడించాలని గడువు విధించడంతో చంద్రబాబునాయుడు మీదా, మోడీ మీదా ఒత్తిడి మరింత పెంచినట్టయింది. దీంతో బీజేపీ నేతలు ఢిల్లీలో నిధుల వివరాలు ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న సంస్థలే గాక... పేర్కొనని విద్యాసంస్థల్ని కూడా ఏపీకి ఇచ్చామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పారు.
నోట్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు
- చట్టంలో 10 ఏళ్ల గడువు విధించినా కేంద్రం వెయిట్ చేయడం లేదు
- కేంద్ర స్థాయిలోని విద్యాసంస్థల్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం
- ఇంకా 2 మాత్రమే ఏర్పాటు కావాల్సి ఉంది
- సంస్థల ఏర్పాటు అవకాశాలు పరిశీలించాలని మాత్రమే చట్టంలో పేర్కొన్నారు
- సంస్థల ఏర్పాట్లకు అవకాశాల్లేవని కమిటీ రిపోర్టు ఇచ్చినా.. మరోసారి అధ్యయనం కోసం మళ్లీ కమిటీ వేశాం
- కడప స్టీలు ప్లాంటుకు ఫీజిబిలిటీ లేదని తేల్చినా.. ఏం చేస్తే ఫీజిబిలిటీ ఏర్పడుతుందో వెంకయ్యనాయుడు అధ్యయనం చేయిస్తున్నారు
- దుగరాజపట్నం ఓడరేవు విషయంలో నీతిఆయోగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది
- వేరే స్థలం సూచిస్తే సత్వరమే ఓడరేవుకు కేంద్రం నుంచి సానుకూలత వచ్చే అవకాశముంది
- రైల్వే జోన్ విషయంలో ఇతర రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉంది
- విశాఖ, కాకినాడ, తిరుపతి మెట్రోల విషయంలో ప్రతిపాదనలు ఇంకా అందలేదు.. అందిన వెంటనే కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది
- స్పెషల్ స్టేటస్ కు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ సర్కారు అంగీకరించింది.. ఈఏపీ కింద ప్రాజెక్టులకు నిధులు, ప్రోత్సాహకాలు నిరంతరం అందుతాయి
- ఏపీకి దక్కాల్సిన రెవిన్యూ లోటు (10 నెలలకు)పై చర్చలు జరుగుతున్నాయి
- ఏపీకి రూ. లక్ష కోట్లు మంజూరు అనేది డబ్బురూపంలో అందించడం జరగదు
- వివిధ ప్రాజెక్టులకు అనుమతుల రూపంలో దశలవారీగా ఖాతాల్లో జమవుతాయి
- రాష్ట్రం ఏర్పడ్డ 2014లోనే ఏపీకి సప్తగిరి పేరుతో ప్రత్యేక చానల్ ఇప్పించాం
- వెనుకబడ్డ 7 జిల్లాల్లో పరిశ్రమలు స్థాపిస్తే 30 శాతం రాయితీలు కల్పిస్తున్నాం
- ఏపీలో ఒక్క ప్రాజెక్టయినా తీసుకు రాగలిగారా?
- ఇస్తే హక్కు అంటారు.. ఇవ్వకపోతే బీజేపీ పాపం అనడం న్యాయమేనా?

ఇక బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఉంటే అన్నీ సమకూరుతాయన్న భ్రమల్లో నాయకులు ప్రవర్తిస్తున్నారని.. ప్రజల్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. స్టేటస్ ఇచ్చి ఏమీ ఇవ్వకపోయినా సరేనని నాయకులు చెబుతారా అంటూ సవాల్ విసిరారు. అర్థం లేని విభజనతో కాంగ్రెస్ పార్టీ గొంతు కోస్తే... ఆ నష్టాన్ని సరిదిద్దేందుకు మోడీ ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు... అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్ లోనే కేంద్రీకృతం చేసి ప్రజలందరినీ అన్యాయం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ కోరిన వివరాలను బీజేపీ నేతలు పబ్లిక్ ముందు పరచారు. దీనిపై జె.ఎఫ్.సి లో ఎలాంటి చర్చ జరుగుతుంది.. చంద్రబాబు ఏమని సమాధానం ఇస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories