ఈవీఎంలపై టీడీపీ చేసే పోరాటానికి కీలక మద్దతు

x
Highlights

ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై పోరాటం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక మద్దతు లభించింది. ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్‌ చంద్రబాబుకు తమ మద్దతు...

ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై పోరాటం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక మద్దతు లభించింది. ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్‌ చంద్రబాబుకు తమ మద్దతు ప్రకటించింది. బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈవీఎంలపై పోరాటంతో పాటు జాతీయ అంశాలపై కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ టూర్‌లో ఉన్న కేసీఆర్‌ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో పోలవరంపై చర్చలు జరిపారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎంపీ చంద్రబాబుతో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రతినిధిగా వచ్చిన ఎంపీ సౌమ్యా రంజన్‌ పట్నాయక్‌ ఉండవల్లిలో చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలికాలంలో సీఎం చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలకు మద్ధతు తెలుపుతున్నట్లు ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్‌ తెలిపారు. ఈ విషయంలో టీడీపీ జాతీయ స్థాయిలో చేసే పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్న ఏపీ సీఎంకు మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ వివరించారు. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్లతో పాటు పలు జాతీయ అంశాలపై కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ చర్చలు జరిపారు.

అలాగే ఇరు పార్టీల మధ్య పోలవరం ప్రాజెక్టు సహా మరికొన్ని అంశాల్లో నెలకొన్న విభేదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు ఒడిశా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఎంపీ తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను జాతీయస్థాయిలో కాకుండా రాష్ట్రాల పరిధిలోనే సామరస్యంగా పరిష్కరించుకుందామని ఒడిషా ఎంపీ రంజన్ పట్నాయక్ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories