ఫేస్‌బుక్‌‌లో ఒకరి పరిచయం..వారి కాపురంలో చిచ్చుపెట్టింది...చివరికి ముగ్గురి జీవితాలు

x
Highlights

ఔను. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. నాకు నువ్వు నీకు నేను అని బాసలు చేసుకున్నారు. చక్కగా సాగుతున్న సంసార నావలో, ఫేస్‌బుక్‌లో ఒక్క...

ఔను. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారు. నాకు నువ్వు నీకు నేను అని బాసలు చేసుకున్నారు. చక్కగా సాగుతున్న సంసార నావలో, ఫేస్‌బుక్‌లో ఒక్క ఫ్రెండ్‌రిక్వెస్ట్‌ కల్లోలం రేపింది. ముగ్గురి జీవితాలను అనూహ్య మలుపు తిప్పింది. ఇంతకీ పచ్చనికాపురంలో చిచ్చు ఎలా రగిలింది చివరికి ఏమైంది ఇలా జీవితాలు ఇంకెన్ని.

స్కూల్‌ నుంచి ఉద్యోగం దాకా, ఎవరితో మాట కలపాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. ఇతను మంచివాడేనా ఈమె మంచిదేనా ఎందుకు మాట కలుపుతున్నారు ఎందుకు పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారు ఇతని గతమేంటి ఆమె ఉద్దేశమేంటి అని పేరాలకు పేరాలు ఆరాలు తీస్తాం. కానీ ఫేస్‌బుక్‌లో ముక్కూముఖం తెలియనివారి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్ వస్తే, ఏమాత్రం ఆలోచించకుండానే యాక్సెప్ట్ చేస్తాం. కొన్నాళ్లకు తెలుస్తుంది ఫేస్‌బుక్కు జీవితాలను బుక్‌ చేసిందని. ఇలాగే, ఓ దంపతుల జీవితాన్ని, ఫేస్‌బుక్‌ పరిచయం కోలుకోలేని తీరాలకు చేర్చింది.

ఫేస్‌బుక్‌. ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బుక్‌ చేసుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందర్నీ మునివేళ్లమధ్య బంధించేసింది. అందర్నీ ఒకచోట చేర్చడానికి ఫేస్‌బుక్‌ నిజంగా ఒక వేదికే. కానీ అదే వేదిక అనేక దారుణాలకు వేదికవుతోంది. దంపతుల మధ్య కూడా చిచ్చు రాజేస్తోంది. ఇదిగో తాజాగా రాజమండ్రిలో, ముగ్గురి జీవితాలు బలికావడానికి అదే ఫేస్‌బుక్‌‌ దారి తీసింది.

ఈ ముగ్గురూ ఎందుకు సూసైడ్‌ చేసుకున్నారో, ఫేస్‌బుక్‌ ఎలా బలి చేసిందో తెలియాలంటే, ఒకసారి మొత్తం కథ తెలుసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడేనికి చెందిన వెంకటేష్‌కి రాజమండ్రికి చెందిన, ఆల్రెడీ పెళ్లయిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. కానీ ఫేస్‌బుక్‌లో పరిచయమైన వెంకటేష్‌, అంతటితో ఊరుకోలేదు. కొంతకాలానికి బిందు భర్త సాయికి ఫోన్‌ చేశాడు. బిందు తనను ప్రేమిస్తోందనీ, ఆమెను తనకు వదిలేయాలని చెప్పాడు. వెంకటేష్‌ మాటలకు తీవ్ర మనస్తాపానికి గురైన సాయి గతనెలలో ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది బిందు. తన భర్త చావుకు కారణం వెంకటేషేనని బాధపడింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ పైకి చేరుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న వెంకటేష్‌కి బిందు మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ తర్వాత బిందు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల ఆత్మహత్యలపై పోలీసులు వెంకటేష్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. దంపతుల సూసైడ్‌ కేసు తన మెడకు చుట్టుకుంటుందని వెంకటేష్ భయపడ్డాడు. పోలీసుల విచారణకు భయపడిన వెంకటేష్‌, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాదం మీద విషాదం కదా. భార్యను ఒకడు ప్రేమిస్తున్నాడన్న మనస్తాపంతో, మొదట భర్త ఆత్మహత్య, భర్త చనిపోయాడని భార్య ఆత్మహత్య. ఇద్దరూ చనిపోయారని మరొకరి సూసైడ్. ఇదే కాదు, ఇవే కాదు, ఇంకెన్నో కుటుంబాల్లో చిచ్చు రేపింది ఫేస్‌బుక్.

Show Full Article
Print Article
Next Story
More Stories