logo
జాతీయం

దేశంలో దొంగలు పడ్డారు..

దేశంలో దొంగలు పడ్డారు..
X
Highlights

దేశంలో దొంగలుపడ్డారు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ వీళ్లు దొంగలా చోరీ చేయరు. దొరలా జనం సొమ్మును...

దేశంలో దొంగలుపడ్డారు. కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. కానీ వీళ్లు దొంగలా చోరీ చేయరు. దొరలా జనం సొమ్మును కాజేస్తారు. దర్జాగా విదేశాలకు పారిపోతారు. బ్యాంకులు, అధికారులు, పాలకులు అందరూ నిద్రలేవకముందే, డబ్బుల మూటలు సర్దుకుని ఎగిరిపోతారు. దొంగలు బాబోయ్ దొంగలు. టక్కు టమార టక్కరి దొంగలు.

బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎవరిది...నీది...నాది...మనది...సామాన్య ప్రజలది. పది వేలు, 20 వేలు, లక్షా, వేతనం, ఇలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గానో, ఆర్డీగానో, సేవింగ్‌గానో, మనం దాచుకున్న డబ్బు. వీటికి రక్షణ కల్పించాల్సింది బ్యాంకులు, ప్రభుత్వాలు. కానీ భారతదేశంలో కొన్ని గద్దలకు, బ్యాంకులు, ప్రభుత్వాలు అప్పనంగా అప్పజెప్పుతున్నాయి. ఇదిగో మరో టక్కరిదొంగ, బ్యాంకు ఉద్యోగులనే కొందరి దొంగల సహకారంతో వేల కోట్లు కాజేసి, విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆ టక్కుటమార టక్కరిదొంగ నీరవ్‌ మోడీ. మాల్యాను మించిన మోసగాడు.

ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 11 వేల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని తెలిసిన కొన్ని గంటల్లోనే, ఈ స్కామ్‌ సూత్రధారి, కీలక పాత్రధారి ఎవరో గుప్పమంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,400 కోట్ల మేర పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు కన్నం వేశాడు నీరవ్ మోడీ.

నీరవ్ మోడీ. ఫోర్బ్స్‌ ధనవంతుడు. సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి. తన పేరుమీదనే డైమండ్‌ రిటైల్ స్టోర్‌ స్థాపించాడు. మూడు ఖండాల్లో బంగారు వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్‌లో ప్రధాన దుకాణాలున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణేతో పాటు దేశంలోని చాలా నగరాల్లో స్టోర్స్‌ ఉన్నాయి. ఎందరో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు మోడీ క్లైంట్స్. అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఇతను ఎంత చెబితే అంత. పార్టీలకు కోట్లకు కోట్లు విరాళాలు ఇచ్చేస్తాడు.

2011 నుంచే స్కామ్‌ జరుగుతోందని, గతనెలలోనే గ్రహించింది పీఎన్‌బీ. దీంతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌‌మెంట్, ఈడీలకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం స్కామ్‌లో పలువురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది సీబీఐ. నీరవ్‌ మోడీ, అతని సోదరుడు నిశాల్, భార్య అమి, వ్యాపార భాగస్వామి మోహుల్‌ చోక్సీ, డైమండ్‌ ఆర్‌ అజ్, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్‌ డైమండ్స్‌కి చెందిన అందరు భాగస్వాములతో పాటు ఇద్దరు బ్యాంకు అధికారులు గోకుల్‌నాథ్‌ శెట్టీ, మనోజ్‌ ఖారత్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.

అసలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోడీ అండ్ బ్యాచ్‌ ఎలా మోసం చేశారంటే ముంబై బ్రాంచ్‌కు చెందిన పీఎన్‌బీ సిబ్బంది నీరజ్‌ అండ్‌ కోకు తప్పుడు ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లు జారీచేశారు. ఈ ఎల్‌ఓయూతో ఫారెన్‌లో ఉన్న ఇండియన్ బ్యాంకుల నుంచి రుణాలు పొందారనేది ప్రధాన ఆరోపణ. థర్డ్‌ పార్టీకి తమ ఖాతాదారుడు చెల్లించాల్సిన మొత్తానికి హామీనిస్తూ బ్యాంకులు ఈ ఎల్‌ఓయూలు జారీచేస్తుంటాయి. వీటిని హామీగా పెట్టుకుని విదేశాల్లోని బ్యాంకు శాఖలు రుణాలిస్తాయి. 150 ఎల్‌వోయూలను నీరవ్ కుటుంబ సభ్యులు వాడుకున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు తదితర 30 బ్యాంకుల నుంచి మోడీ అండ్ గ్యాంగ్, రూ. 11,400 వేల కోట్లకుపైగా లోన్స్‌ పొందినట్లు, దేశ, విదేశాల్లో నగల దుకాణాలు తెరిచారని విచారణలో తేలింది.

లలిత్ మోడీ, విజయ్‌ మాల్యాలు చూపినదారిలోనే, నీరవ్‌ అండ్‌ కుటుంబ సభ్యులు విదేశాలకు ఉడాయించారు. పక్కా ప్రణాళికతో ప్రధాన నిందితుడు నీరవ్‌, జనవరి 1నే విదేశాలకు పారిపోయినట్లు సీబీఐ గుర్తించింది. దావోస్‌ సదస్సుకు వెళ్లిన నీరవ్, స్విట్జర్లాండ్‌లోనే ఉన్నట్టు అనుమానం. అమెరికా పౌరురాలైన మోడీ భార్య అమి, వ్యాపార భాగస్వామి, గీతాంజలి జ్యూయెలరీ ప్రమోటర్‌ మోహుల్‌ చోక్సీలు జనవరి 6న విదేశాలకు వెళ్లిపోయారు. ఇక బెల్జియం పౌరుడైన నీరవ్‌ సోదరుడు నిశాల్‌ జనవరి 1వ తేదీన దేశం విడిచాడు. జనవరి 29న వీరిపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. కానీ నీరవ్‌ను దేశానికి రప్పించి, మొత్తం సొమ్మును కక్కించి, కటకటాలపాలు చేసే సత్తా మన పాలకులకు ఉందా?

నీరవ్‌ మోడీనే కాదు, చాలామంది టక్కుటమార దొంగలు ప్రజల సొమ్మును కాజేసి, విదేశాలకు ఎగిరిపోయారు. కానీ ఒక్కర్నీ దేశానికి రప్పించలేపోయారు పాలకులు. లలిత్‌ మోడీ. ఇండియాలో పొట్టి క్రికెట్‌ను క్రేజీగా మార్చిన ఘనుడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చైర్మన్‌గా చెలరేగిపోయాడు. ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల వేలం అంటూ వేలంవెర్రి వాణిజ్యానికి తెరలేపిన మాజీ క్రికెటర్. అయితే, తెలివిమీరిపోయి కోట్లు కొల్లగొట్టాడు. 2011లో నిబంధనలకు విరుద్ధంగా కొచ్చి టస్కర్స్‌ జట్టు యాజమాన్యం వివరాలను బయటపెట్టి బుక్కయ్యాడు లలిత్ మోడీ. దీంతో బీసీసీఐ ఈయనగారికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఐపీఎల్‌ బాధ్యతల నుంచి తప్పించింది. కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరింపులు రావడంతో చివరికి అదే ఏడాది మోడీ లండన్‌కు వెళ్లిపోయాడు.

విజయ్‌ మాల్యా. లిక్కర్‌ కింగ్‌. విలాసపురుషుడు. జనాల సొమ్ముతో సోకులు చేసుకున్న దోపిడీదారుడు. ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మాల్యాను దేశం దాటివెళ్లకుండా అడ్డుకోవాలని బ్యాంకులు 2016, మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించకముందే ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. ఎవరో ఒకరు ఉప్పందించారు కాబట్టే, అన్నీ సర్దుకుని మాల్యా జంపయ్యాడు.

దీపక్‌ తల్వార్. కార్పొరేట్ లాబీయిస్ట్. సంచలనం సృష్టించిన ఏవియేషన్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. యూపీఏ ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల సాయంతో దీపక్‌ కొన్ని విమానయాన సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చాడన్నది ప్రధాన ఆరోపణ. ఇందుకుగాను, పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాల్లో వందల కోట్లు అందుకున్నారని, తల్వార్‌పై ఐదు కేసులు ఫైల్ చేసింది ఐటీ శాఖ. కేసులు నమోదుకాకముందే యూఏఈకి పారిపోయాడు దీపక్‌.

వీళ్లేకాదు, స్టాక్‌మార్కెట్‌ స్కామ్‌లో హర్షద్‌ మెహతా, మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో సంజీవ్‌ చావ్లా. వీరిలో సంజీవ్‌ చావ్లా లండన్‌లో హాయిగా సేదదీరుతున్నాడు. ఇక దేశంలోనే ఉండి, బ్యాంకులకు భారీగా బకాయిలుపడ్డ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది.

దాదాపు 8 లక్షల కోట్ల మొండిబకాయిలు బ్యాంకుల్లో పోగుపడ్డాయి. ఇదంతా సామాన్య, మధ్యతరగతి సొమ్మే. కానీ బడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నాయి బ్యాంకులు. సామాన్యులు లోన్లు అడిగితే, ఒకటి వందసార్లు ఆలోచించే బ్యాంకులు, ఇలాంటి దోపిడీదారులకు మాత్రం రెడ్‌ కార్పెట్ వేసి ఫలహారంగా వడ్డిస్తున్నాయి. వీరేమో అన్నీ మూటగట్టుకుని విదేశాలకు వెళ్లిపోతున్నారు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్‌ మోడీ, ఇలా పూటకో లూటీదారుడు తెరపైకి వస్తున్నాడు. వీళ్లందర్నీ దేశానికి రప్పించి కటకటాల వెనక్కనెట్టి, ప్రజల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులు, ప్రభుత్వాలదే.

Next Story