logo
తాజా వార్తలు

ఒక్క గుడ్డు రూ.12

X
Highlights

రోజూ తినండి గుడ్డు... వెరీ గుడ్డు అంటూ....గుడ్డు తింటే ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది....

రోజూ తినండి గుడ్డు... వెరీ గుడ్డు అంటూ....గుడ్డు తింటే ఎన్నో లాభాలున్నాయని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. మాములు గుడ్లలోనే ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో ఉత్పత్తయ్యే కోడి గుడ్లను తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదంటున్నారు వాటి ఉత్పత్తిదారులు. ఇంతకీ ఆ గుడ్డులో ఉన్న స్పెషాలిటీ ఏంటి. మామూలు గుడ్లకు ఈ గుడ్లకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం

ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం దొరకడమే గగనమైపోతోంది. నిత్యం తినే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రసాయనాలతో నిండిపోయి ఉన్నాయి. సహజంగా దొరికే ఆహారమే నేటి కాలంలో కరువైంది. కృత్రిమ పద్ధతుల్లో తయారయ్యే వాటిపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ఉత్పత్తులకు శ్రీకారం చుట్టాడు ఓ అభ్యుదయ రైతు. తన పౌల్ట్రీ పామ్‌లో ఆయుర్వేదిక్ గుడ్లను ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. నాటు కోడి గుడ్లు తెలుసు, బాయిలర్ గుడ్లు తెలుసు మరి ఆయుర్వేదిక్ గుడ్ల గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా..అంటే అది గుడ్డే. పట్టుమని 50 గ్రాములు కూడా ఉండని ఒక్క చిన్న గుడ్డులో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టే ప్రపంచం యావత్తూ గుడ్డును అమింతంగా ఆస్వాదిస్తోంది. రుచితో పాటు ఆరోగ్యాన్నీ మనకందించే సహజ ఆహారమే ఈ గుడ్డు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బడిపిల్లలకు గుడ్డు పథకాన్ని అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. గుడ్డులో ఇన్ని విలువలు ఉన్నాయి కాబట్టే సాధారణ గుడ్లకు భిన్నంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలం మండల ఈతకోటకు చెందిన రైతు చంద్రారెడ్డి ఆయుర్వేద మూలికలతో కూడిన సహజ సిద్ధమైన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు అందించే దాణాను అనేక రాకాల పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. యాంటీబయోటిక్స్‌తో పాటు వివిధ రకాల మందులు , వ్యర్థాలు ఉన్న మేతను కోళ్లకు అందిస్తారు. దీంతో సహజంగానే వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే గుడ్లు రసాయనాల సమ్మేళనంతో కూడుకుని ఉంటాయి. ఇవి ప్రజల ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన దాణాను తన పౌల్ట్రీ ఫాంలో ఉన్న కోళ్ళకు అందిస్తున్నారు చంద్రారెడ్డి.

కోళ్లకు ఎంతో బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఈ రైతు. కోళ్లకు మేతగా 40 రకాల ఔషథ మూలికలు ఉన్న మిశ్రమంతో తయారు చేసిన మేతను అందిస్తున్నారు. పసుపు, వెళ్లుల్లి, ఉసిరి పొడి, మునగాకు పొడి, త్రిఫలా చూర్ణం ఇలా ఎన్నో మూలికలతో తయారు చేసిన మేతను అందిస్తున్నారు. కోళ్ల పరిశ్రమ రంగంలో రెండు దశాబ్ధాల అనుభవం ఈ రైతుది. సౌభాగ్య గ్రూప్స్ పేరిట గోడి గుడ్లను, కోడి మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. తాను చేస్తున్న వ్యాపారంలోనే ప్రజలకు ఉపయోగపడేది చేయాలన్నది ఈ రైతు ఆలోచన అందుకోసం ఆరేళ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేశారు. అందుకు దక్కిన ఫలితమే ఈ ఆయుర్ కోడి, ఆయుర్‌ కోడిగుడ్లు.

తక్కువ ఖర్చుతో ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేలా లాభార్జనే ధ్యేయంగా పౌల్ట్రీ ఫామ్‌లను నిర్వహిస్తుంటారు చాలా మంది రైతులు. కానీ చంద్రారెడ్డి అలా కాదు లాభాల విషయాన్ని పక్కనపెట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన గుడ్లను అందించాలనుకున్నారు. అందుకే కోళ‌్ల పెంపకంలో ఖర్చు గురించి ఆలోచించలేదు. వాటికి నాణ్యమైన మేతను అందిస్తున్నారు. ఎన్నో పోషకవిలువలు కలిగిన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు.

ఆయుర్వేద మేత అందించడం ద్వారా గుడ్లలో omega 3. Dha కోలిన్. కె రోట naids విటమిన్ d 3, విటమిన్ ఇ, ఐరన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తున్నాయి. పరిశోధనలో తేలిన ఫలితాల ఆధారంగా ఉత్పత్తులు మొదలుపెట్టారు చంద్రారెడ్డి. మూడు రకాల గుడ్లను వినియోగదారులకు పరిచయం చేశారు. ఒకటి ఆయుర్‌ ఎగ్‌, మరొకటి ఆయుర్ ప్లస్‌ ఎగ్‌, మూడవది దేశీ ఎగ్‌. ఒక్కో గుడ్డులో ఒక్కో ప్రత్యేకత ఉంది.

ఆయుర్ ఎగ్ అంటే ఎలాంటి కృత్రిమ మందులు వాడకుండా సహజసిద్ధమైన ఆహారాన్ని, ఆయుర్వేద మందులను వాడుతూ ఉత్పత్తి చేసిన గుడ్లు. దీంట్లో యాంటీబయోటిక్స్ , హార్మోన్స్ , స్టెరాయిడ్స్ , టాక్సిన్స్ వంటి హానిగలిగించే మందులు వాడరు. పూర్తి ఆయుర్వేద పోషణనే అందిస్తారు. ఈ దాణా ద్వారా ఆయుర్‌ కోడిలో రోగనిరోధక శక్తిని పెరగడంతో ఎలాం రోగాలను దరి చేరడం లేదు. ఆరోగ్యకరమైన గుడ్లు ఉత్పత్తి అవుతాయి.

ఇక ఆయుర్ ప్లస్ కోడి గుడ్లలో ఒమేగా త్రీ శాతంఅధికంగా ఉంటుంది. దీనివల్ల చిన్నపిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడం, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు టీనేజ్‌లో ఉండే అమ్మాయికు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్య రాకుండా చేస్తాయి. గర్బిణీ స్త్రీలు దీన్ని తింటే శిశువుకు మంచి పోషకాలు అందుతాయి. పాలిచ్చే తల్లి ఈ గుడ్లను తీసుకోవడం వల్ల కోలిన్ అనే పదార్ధం శిశువుకు చేరి మెదడు పెరుగుదల త్వరగా జరుగుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ ఆయుర్ ప్లస్‌ గుడ్లలో ఉన్నాయి.

ఇక్కడ ఉత్పత్తి అయ్యే దేశీ కోడి గుడ్లు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ గుడ్లలో ఎలాంటి నీసు వాసన రాదు. కారణం కోడికి ఎలాంటి కెమికల్స్ వినియోగించకపోవడమే. కోడికి అందించే ఆహారం పూర్తి శాఖాహారమే అందులోను అధిక శాతం పోషకాలతో కూడుకున్నది. అందుకే వీటి రుచి కమ్మగా ఉంటుందంటున్నారు ఈ రైతు.

ఆయుర్ కోడి గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉండడం వల్ల ఆల్బమిన్ అనే పదార్ధం స్పష్టంగా కినిపిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచే పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల గుడ్డు సొన కాషాయం రంగులో కనిపిస్తుంది. ఆల్బమిన్ కూడా చాలా తిక్‌గా ఉంటుంది. 20 ఏళ్ల క్రింతం గడ్డు సొన ఇలాగే ఉండేది.


పౌల్ట్రీ రంగంలో రైతులు రాణించాలంటే ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరుచుకోవాలి. అదే చేసి చూపించారు ఈ రైతు. తాను ఉత్పత్తి చేసే కోడి గుడ్డు నుంచి కోడి మాంసం వరకు ప్రతీదాంట్లో ఆరోగ్యం అనే అంశానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అందుకే కోళ్ల దాణాలోనే కాదు పెంపకంలోనే పూర్తి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు. సురక్షితమైన వాతావరణంలో కోళ్లను పెంచుతున్నారు. ప్రజల మంచి ఆదరణను పొందుతున్నారు.

చంద్రారెడ్డి పౌల్ట్రీ ఫాం లో పెరిగే ప్రతీ కోడి పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటుంది. సాధారణ కోళ్ల ఫారంలో అడుగు పెట్టగానే కోళ్ల పెంటతో, వాసనతో అపరిశుభ్రంగా కనిపిస్తుంటుంది. కానీ ఈ పౌల్ట్రీ ఫామ్ అందుకు భిన్నం. ఎక్కడా అలాంటి వాతావరణ కనిపించదు. పూర్తి ఆహ్లాదకరమైన వాతావరణంలో కోళ్లను పెంచుతున్నారు ఈ రైతు.

కోళ్ల ఫారం అంటే అపరిశుభ్రంగానే ఉండాలా. మన ఇంటిలా చూసుకోకూడదా అన్న ఆలోచన వచ్చింది ఈ రైతుకు. అందుకే తన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ఫారాన్ని అంతే శుభ్రంగా మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. కోడి వ్యర్థాలు ఎక్కడా కనపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారు.

ఈ ఫారంలో పెరిగే కోళ్లు ఎంతో స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఓ గదిలో పడేసి పెంచరు. అవి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటకు వచ్చి తిరుగుతుంటాయి. తిరిగి తమ స్థానానికి చేరుకుంటాయి. అందుకోసం గార్డెన్‌‌లోనూ శుభ్రతను మెయిన్‌టేన్ చేస్తుంటారు. ఇక్కడ పెరిగే ప్రతి కోడికి సరైన సమయంలో, సరైన దాణా , నీటి సరఫరా జరుగుతుంది. అంతే కాదు కోడి గుడ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు.

పోషక విలువల్లో భేష్‌ అనిపించుకుంటున్న ఈ కోడిగుడ్డ ధరలోనే భేష్ అనిపించుకుంటోంది. ఒక్కో గుడ్డు అక్షరాల పన్నెండున్నర రూపాయలు పలుకుతోంది. మామూలుగుడ్డు కన్నా ఇది మూడు రెట్లు అధికం అయినా హాట్‌ కేకుల్లా ఈ గుడ్ల అమ్ముడవుతున్నాయి. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి గుడ్లకే కాదు మాంసానికి గిరాకీ పెరిగిందంటున్నారు చంద్రారెడ్డి.

మార్కెట్‌ రేట్లను బట్టే రైతు తన పెట్టుబడి ఖర్చులను నియంత్రించుకుంటాడు. నాణ్యత మీద దృష్టి సారించడు. దీంతో ఉత్పత్తిలో క్వాలిటీ లోపిస్తుంది. కానీ ఈ రైతు అధిక శాతం పోషకవిలువలు కలిగిన దాణాను అందిస్తూ కోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులను లెక్కచేయడం లేదు ఇంత ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగిన ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ కోడి గుడ్లను పన్నెండున్నర రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక చికెన్ విషయానికి వస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే అక్షరాలా కిలో చికెన్‌ 480 రూపాయలు పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు గుడ్లను ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్, బెంగుళూరుకు, తమిళనాడులో ఉన్న అన్ని సూపర్ మార్కెట్‌లలో గుడ్లను అందుబాటులోకి ఉంచారు. తాజాగా వ్యాపారం బెంగళూరుకు విస్తరించింది. ఆయుర్ గుడ్లను కొనుగోలు చేసిన వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. హానికరమైన కెమికల్ మందులు వాడని కారణంగా చికెన్ తో పాటు గుడ్డు ఎంతో రుచిగా ఉంటుందని కితాబు ఇస్తున్నారు.

మిగతా కోళ్ల ఫారాల్లా కాకుండా పూర్తి పరిశ్రభ్రమైన వాతావరణంలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు ఇక్కడ పనిచేసే వర్కర్లు. పౌల్ట్రీ రంగంలో ఆయుర్‌ కోడి గుడ్డి కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేస్తోంది. నాన్‌వెజ్ ప్రియులకు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తోంది. అందుకే రైతు ఈ రంగంలో చంద్రారెడ్డి లాభాలబాటలో పయనిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Next Story