Top
logo

ప్రపంచ తెలుగు మహాసభల్లో అరుదైన దృశ్యం

ప్రపంచ తెలుగు మహాసభల్లో అరుదైన దృశ్యం
X
Highlights

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక...

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు ఏనాడూ లేని విధంగా తెలుగులో మాట్లాడిన ఓవైసీ.. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని గుర్తుచేశారు.

సభకు విచ్చేసిన ప్రముఖులకు .నా హృదయపూర్వక నమస్కారములు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు అంటూ ఆద్యంతం తెలుగులోనే మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషదాయకమని, తెలుగు భాషాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని ఓవైసీ ప్రశంసించారు. కుతుబ్‌షాహీ కాలంనుంచి హిందూముస్లింలు ఐకమత్యంతో జీవిస్తున్నారని, పాలు నీళ్లలా కలిసిపోయారని చెప్పిన ఓవైసీ.. సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు.

దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని, ఇండస్ట్రియల్, ఐటీ, ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. పాతనగరంలో నివాసం ఉంటున్న షరీఫ్ ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడని, గఫూర్ అనే రచయిత తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించి తెలుగు భాష సేవచేశాడని ఓవైసీ తెలిపారు. దేశంలో నేను దక్షిణ భారతీయుడిని, తెలంగాణలో తెలంగాణ వాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే ఉర్దూవాదిని ఈ ప్రపంచంమొత్తంలో మనదేశం వంటి దేశంలేదు. దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు వేరయినా వాటిని పరిరక్షించుకునేందుకు మనం కృషి చేయాలి అని పేర్కొన్నారు. చివరగా తన రాజకీయజీవితంలో తొలిసారి తెలుగులో ప్రసంగించానని, తప్పులుంటే క్షమించాలి అని ఉర్దూలో కోరుతూ తన ప్రసంగాన్ని ముగించారు.

Next Story