దిగొచ్చిన కేంద్రం.. లోటు భర్తీకి సుముఖత..!

దిగొచ్చిన కేంద్రం.. లోటు భర్తీకి సుముఖత..!
x
Highlights

ఏపీ ఎంపీల ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఏపీ అంశాలపై పరిష్కారానికి.. సుజనా చౌదరి, కేంద్ర...

ఏపీ ఎంపీల ఆందోళన ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఏపీ అంశాలపై పరిష్కారానికి.. సుజనా చౌదరి, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, రైల్వేజోన్ తో పాటు పలు కీలక అంశాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

హస్తినలో ఏపీ ఎంపీల నిరసనలకు కేంద్రం దిగొచ్చింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పియూష్ గోయ‌ల్‌, బీజీపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తో భేటీ అయిన సుజనా చౌదరి.. సుమారు రెండున్నర గంటలపాటు ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, కేటాయించాల్సిన సంస్థలు, రైల్వేజోన్ లాంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీ రెవెన్యూ లోటు పూర్తి చేయ‌డానికి ఒప్పుకున్న కేంద్రం.. 14వ ఆర్ధిక సంఘం నివేదిక ప్ర‌కారం, 2014-15 ఏడాదిలో 10నెల‌ల పాటు రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించినట్లు తెలుస్తోంది.
గ‌త మూడేళ్ళ నుంచి రావాల్సిన మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేసేందుకు.. మిగిలిన మొత్తాన్ని ప్ర‌తి ఏటా విడుద‌ల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. ప్ర‌త్యేక హోదాతో రాష్ట్రానికి వ‌చ్చే నిధుల మొత్తాన్ని.. ఒకేసారి ఇచ్చేందుకు కూడా సంసిధ్ద‌త వ్య‌క్తం చేసిందట.

ప్ర‌త్యేక ప్యాకేజి ప్ర‌కారం, ఈఏపీ నిధుల‌ను కూడా వెంట‌నే విడుద‌ల చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలుస్తోంది. దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు నిర్మాణానికి ఇస్రో అభ్యంత‌రం తెలిపింద‌ని.. అక్క‌డ కాకుండా, రాష్ట్ర ప్ర‌భుత్వం ఎక్క‌డ సూచిస్తే అక్క‌డ.. పోర్టు నిర్మాణాకి సిద్దంగా ఉన్నట్లు కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చిందట.
పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 12శాతం నుంచి ఎంత ఎక్కువ సాధ్యం అయితే అంత వ‌ర‌కు ఐఆర్ త‌గ్గించుకోవాల‌ని చ‌మురు సంస్థ‌ల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు పంపామని జెట్లీ చెప్పినట్టు తెలుస్తోంది. క‌డ‌ప ఉక్కు క‌ర్మగారం ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో నిర్మించాల‌ని.. దీని నిర్మాణానికి కావ‌ల‌సిన నివేదికను మెకాన్ సంస్థ ఈ నెల 12కి అందించ‌నున్న‌ట్లు సమాచారం.


రైల్వే జోన్ ఏర్పాటు ప్ర‌క‌ట‌నను కూడా త్వ‌ర‌లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. విశాఖ - ఛెన్నై, క‌డ‌ప - ఛెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వ‌స్తున్న అడ్డంకులు అన్ని తొలగించి.. అందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించారట. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చు వివ‌రాలు పంపితే.. ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు విడుద‌లకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందని సమాచారం. పోల‌వ‌రం ప్రాజ‌క్టుకు ఇప్ప‌టికే ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైంద‌ని.. దాని ప్ర‌కారం నిదుల‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామ‌ని ఈ భేటీలో హామీ లభించినట్టు తెలుస్తోంది.

పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఈ ప్రకటనలేవీ సభలో ప్రస్తావించలేదని జైట్లీ చెప్పినట్లు తెలుస్తోంది. మార్చిలో జరగనున్న రెండో ద‌శ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం లోపు అన్ని ప్ర‌క‌ట‌న‌లూ పూర్తి చేసి, కార్యాచ‌ర‌ణ‌కు వెళ్లాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రం తను ఇచ్చి హామీని సకాలంలో నిలబెట్టుకోకపోతే.. తమ ఆందోళనను ఉధృతం చేస్తామని టీడీపీ అంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories