జగన్‌పై దాడి కేసు దర్యాప్తు వేగవంతం...నిందితుడు శ్రీనివాసరావు దగ్గర 11 పేజీల లేఖ స్వాధీనం

x
Highlights

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుకోసం సిట్ ఏర్పాటు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 11 పేజీల లేఖ స్వాధీనం...

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసు దర్యాప్తుకోసం సిట్ ఏర్పాటు చేశారు. నిందితుడి దగ్గర నుంచి 11 పేజీల లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇవాళ హైదరాబాద్ వస్తోంది.

జగన్ పై కత్తి దాడి కేసు విచారణ కోసం డీజీపీ సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న నాగేశ్వరరావుతో పాటు సీఐలు ఈ కేసు పూర్వాపరాలను లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందిన జానిపల్లి శ్రీనివాసరావుగా గుర్తించారు. జగన్‌పై దాడి జరిగిన తరువాత విశాఖ ఎయిర్‌పోర్టులో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డ్‌ చేశారు. నిందితుడి దగ్గర 11 పేజీల లేఖను స్వాధీనం చేసుకుని..అతన్ని ప్రాధమికంగా ఏడు గంటల పాటు విచారించారు. వైసీపీ అంటే తనతో సహా తమ కుటుంబం మొత్తానికి అభిమానమని శ్రీనివాసరావు చెప్పాడు. 11 పేజీల లేఖలో జగన్ సీఎం అయితే ఏం చేయాలి అనే విషయాలు రాశాడని విశాఖ అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు తెలిపారు. జగన్ గతంలోనే ఏపీ సీఎం కావలసి ఉండగా అలా జరగలేదని, ఈ సారైనా జగన్‌ సీఎం కావాలని తన కోరిక అని విచారణలో తెలిపిన శ్రీనివాసరావు సానుభూతి వస్తుందనే ఉద్దేశంతోనే దాడి చేశానన్నాడు.

అటు నిందితుడు విశాఖలో ఉంటున్న గదితో పాటు ఠానేలంకలోని నిందితుడి ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. వైఎస్ జగన్‌పై దాడి చేసిన శ్రీనివాసరావు ఏడాదిలో 9 సెల్ ఫోన్లు మార్చారని ఏడీసీపీ మహేంద్ర పాత్రుడు తెలిపారు. ఇప్పుడు వాడుతున్న ఫోను కూడా 2 రోజుల క్రితమే మార్చాడనీ చెప్పారు. నిందితుడు ఏడాదిలో 10 వేల కాల్స్ మాట్లాడినట్లు వివరించారు. నిందితుడి సోదరుడి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లో జగన్‌ ఫ్లెక్సీ ఉందని, ఆ ఫొటోను కొందరు మార్ఫింగ్‌ చేసి సీఎం, లోకేశ్‌ ఫొటోలు పెడుతున్నారన్నారని . మహేంద్ర పాత్రుడు చెప్పారు. ఇలా మార్ఫింగ్‌ చేసి ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడం చట్టవిరుద్ధమని, గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు జగన్‌పై దాడి జరిగిన విశాఖ ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరా లేనట్లు సమాచారం. నిందితుడు కత్తి ఎలా తీసుకెళ్లాడనేది వీడియో పుటేజులు పరిశీలించాల్సి ఉందని అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు చెప్పాడు. జగన్‌పై దాడి నేపథ్యంలో కొందరు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ఏడీసీపీ మహేంద్ర పాత్రుడు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories