ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

x
Highlights

ఇకపై కేంద్రం ఆటలు ఆంధ్రప్రదేశ్ లో చెల్లవు. సీబీఐ పప్పులు రాష్ట్రంలో ఉడకవు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఏపీలో ప్రవేశం లేదు. దాడులు, దర్యాప్తులు చేసే...

ఇకపై కేంద్రం ఆటలు ఆంధ్రప్రదేశ్ లో చెల్లవు. సీబీఐ పప్పులు రాష్ట్రంలో ఉడకవు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఏపీలో ప్రవేశం లేదు. దాడులు, దర్యాప్తులు చేసే అవకాశం లేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ జనరల్‌ కన్సెంట్‌ తెలపాల్సి ఉంటుంది. గతంలో ఏపీ ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ లోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు.

దిల్లీ స్పెషల్‌ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం-1946 ప్రకారం కేంద్రం సీబీఐని ఏర్పాటు చేసింది. అధికారాలను సీబీఐ దిల్లీ భూభాగం పరిధిలోనే అమలు చేయడానికి అవకాశముంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకు తమ భూభాగంలో పరిధిని కల్పిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేయాలి. అలాగే సాధారణ సమ్మతిని రాష్ట్రాలు వెనక్కి తీసుకునే అధికారం కూడా చట్టంలో నిర్దేశించారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమ్మతిని ఇస్తూ వస్తోంది.

ఇటీవల సీబీఐ పనితీరు మందగించిందని, తన పాత్రను సమర్థంగా నిర్వహించలేకపోతోందని ఓ సీనియర్‌ న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రమిచ్చారు. ఈ వినతిపత్రంపై, ఇటీవల జరిగిన కేంద్రప్రభుత్వ సంస్థల దాడులపైనా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది. రాజకీయ దురుద్దేశాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయని మంత్రి వర్గం గట్టిగా అభిప్రాయపడింది. సీబీఐకి ఇచ్చే సమ్మతి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏసీబీ రెండూ అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతుంటాయి. కొత్త ఉత్తర్వులతో సీబీఐ రాష్ట్ర భూభాగంలో తన అధికారాలను అమలు చేసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో ఏపీలో సీబీఐ పాత్రను ఏసీబీయే పోషించే అవకాశముంది. ఇక రాష్ట్రంలో పనిచేస్తూ అవినీతికి పాల్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయొచ్చు. కేసుల దర్యాప్తు చేపట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories