బాబు దీక్షతో...హోదా హోరెత్తుతుందా?

x
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కేంద్రం వైఖరికి నిరసనగా 68 ఏళ్ల వయసులో...

ఏపీకి ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు. తాజాగా కేంద్రం వైఖరికి నిరసనగా 68 ఏళ్ల వయసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేయబోతున్నారు. ఈ నెల 20న అంటే ఆయన పుట్టిన రోజున నిరాహార దీక్ష చేస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలన్న డిమాండ్లతో దీక్షకు కూర్చుంటున్న బాబు నిర్ణయానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తన పుట్టినరోజు నాడే నిరశన దీక్షకు కూర్చుంటున్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రజల మధ్యే దీక్ష చేస్తే ఫలితం ఉంటుందని ఆయన భావించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని బాబు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకే దీక్ష చేపట్టినట్లు ఆయన చెబుతున్నారు.

ఉదయం 7 గంటలకు దీక్ష మొదలై సాయంత్రం 7 గంటల వరకు 12 గంటలపాటు సాగుతుంది. ఈ దీక్షకు 'ధర్మపోరాట దీక్ష' అనే పేరు పెట్టారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ధర్మ పోరాట దీక్ష లక్ష్యంగా చెబుతున్నారు. 'నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా వినిపించనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సుమారు 150 మంది కూడా ఈ నిరశన దీక్షలో పాల్గొంటారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ దీక్ష సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు ఎలాగైతే నిరాహార దీక్షలు చేశారో అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరశన దీక్షకు కూర్చోనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు బాబు దీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

68 ఏళ్లలో వయస్సులో చేపడుతున్న సాహస దీక్ష 'ధర్మ పోరాట దీక్ష' అని మంత్రి కళా వెంకట్రావ్ అన్నారు. ఈ దీక్షకి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ధర్మపోరాట దీక్షకు సంబంధించిన ప్రచారంపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీక్ష జరిగే స్టేడియంతో పాటు, స్టేడియం బయట కూడా టెంట్లు వేయిస్తున్నారు. స్టేడియం బయటా, లోపల LED స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీక్ష ముగిశాక అక్కడే టీడీపీ-దళితతేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు. అదే వేదిక నుంచి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధనకు ప్రభుత్వం అనుసరించబోయే కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు.

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించాయి. భారీగా జన సమీకరణ చేపట్టారు తెలుగు తమ్ముళ్లు. జెండాలను పక్కనపెట్టి హోదా కోసం పోరాడుతున్న అన్ని ప్రజాసంఘాలు, పార్టీ నేతలందరి మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు టీడీపీ సీనియర్ నేతలు. ఇందులో భాగంగా ఇటీవల అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలకు ఆహ్వానాలు పంపించింది.

బాబుకు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లనున్నారు. పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారని, ఈ దీక్షను అందరూ విజయవంతం చేయాలని టీడీపీ కోరుతోంది. ఇందులో భాగంగా ఇటీవల అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలకు ఆహ్వానాలు కూడా పంపించింది.

విశాఖ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాలకు కూడా ఆహ్వానం పంపించారు. అంతేకాదు, మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఆయనకు స్వయంగా ఫోన్ చేసి తప్పకుండా దీక్షకు హాజరు కావాలని ఆహ్వానించినట్టు తెలిసింది. ఏ పార్టీలో లేని కొణతాల.. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడుతున్నారు. ఆయన విజయవాడలో బాబుతో పాటు దీక్షలో కూర్చుంటారనే సమాచారం తెలుస్తోంది.

ధర్మ పోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలను, అఖిలపక్ష నేతలను ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులంతా దీక్షకు మద్దతిస్తూ హాజరవుతారని భావిస్తున్నారు. వామపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు. వారితో పాటు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా, వాణిజ్య, ఉపాధ్యాయ సంఘాలు, బార్‌ అసోసియేషన్‌, ట్రేడ్‌ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు వైద్యులు, ఇతర వృత్తుల వారంతా దీక్షలో పాల్గొనాలని కోరారు.

చంద్రబాబు చేస్తున్న పోరాటానికి కర్నాటక తెలుగు వారు పూర్తి మద్దతు తెలిపారు. ఆయన దీక్షకు మద్దతుగా బెంగళూరులోని జిగిణీ పురసభలో ఉంటున్న తెలుగు ప్రజలు అమరావతికి వచ్చి బాబును కలిసి సంఘీభావం తెలిపారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారన్నారని ఈ పోరాటం ఎంతో ఉత్తమమైనది అన్నారు కర్ణాటక రాష్ట్ర పొట్టి శ్రీరాములు తెలుగు సంఘం నాయకులు.

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే టీడీపీ శ్రేణులు రకరకాల మార్గాల్లో తన నిరసన తెలుపుతున్నాయి. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగన్నాధపురం జెట్టీ నుంచి సముద్రంలోకి 200 పడవలతో గంటన్నర పాటు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన నీరు, మట్టిని సముద్రంలో కలిపి నిరసన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories