ఏపీ సీఎం చంద్రబాబు తెగించేశారు

ఏపీ సీఎం చంద్రబాబు తెగించేశారు
x
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగించినట్టే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన తప్పని పరిస్థితుల్లో.. ఎన్నికలకు సమయం...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెగించినట్టే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేంద్రంతో కొట్లాడాల్సిన తప్పని పరిస్థితుల్లో.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. ఏకంగా ప్రధాని మోడీపైనే వాగ్బాణాలు సంధిస్తున్నారు. చుట్టూ ఏ1, ఏ2 లను పెట్టుకుని దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ప్రధాని మోడీనే చంద్రబాబు నిలదీస్తున్నారు. హోదా ఇవ్వొద్దన్న మాటను ఆర్థిక సంఘం చెప్పందని మొదట్లో చెప్పారు.. ఇప్పుడు ఆ మాట అనలేదని ఆర్థిక సంఘం చెబుతోంది.. దీనికేమంటారు.. అని ప్రశ్నిస్తున్నారు.

అంతా బానే ఉంది కానీ.. ఇన్నాళ్లూ చంద్రబాబుకు మోడీ చుట్టూ కనిపించని ఏ1, ఏ2లు.. ఇప్పుడే ఎందుకు కనిపించారు? ఉన్నట్టుండి వారిపై బాబుగారికి ఎందుకు కోపమొచ్చింది? ఎలాగూ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదన్న వాస్తవం అర్థమైపోయింది. జనానికి కూడా ఆ విషయం మనసుల్లో జీర్ణమైపోయింది. అయినా.. ఇప్పటికిప్పుడు ఆర్థిక సంఘం విషయాన్ని ఎందుకింత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు?

ఈ విషయాలకు అయితే చంద్రబాబో లేదంటే.. ఆయన వెంట ఉంటే.. టీడీపీ నాయకులో సమాధానం చెప్పాలి. కానీ.. ఇప్పుడు రాజకీయ అవసరాల నేపథ్యంలో అది అంత సులువుగా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కానీ.. ప్రజలు.. ఇప్పుడిదే విషయంపై బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లూ మనకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశతో కేంద్రానికి అండగా ఉన్నామని టీడీపీ నేతలు చెబుతున్న మాటలను స్వాగతించేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. హోదా కన్న ప్యాకేజీనే మిన్న అన్న మాటను చంద్రబాబు కూడా వాడిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

అయితే.. ఎన్నికల అవసరం అన్న మాటను కాసేపు పక్కన పెడితే.. చంద్రబాబు కూడా.. హోదా కోసమో ప్యాకేజీ కోసమో తీవ్రంగానే శ్రమిస్తున్నారు. కేంద్రం నుంచి వీలైనంతవరకూ సహాయాన్ని రాబట్టాలనే ఆయన ఆరాటపడ్డారు. కానీ.. మిత్రులుగా ఉన్నపుడు కనపడని ఏ1, ఏ2లు.. ఆర్థిక సంఘం వ్యవహారాలు.. ఇప్పుడు బీజేపీ నేతలు శత్రువులయ్యాక కనిపించడమే.. మింగుడుపడకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఈ వ్యూహంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉంటే.. ఆయనకు, ఆయన పార్టీకి మంచిదన్న మాట వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories