ఏపీలో మారుతున్న బీజేపీ వ్యూహాలు

ఏపీలో మారుతున్న బీజేపీ వ్యూహాలు
x
Highlights

ప్రత్యేకహోదాపై రచ్చ పీక్స్‌కి చేరిన వేళ బీజేపీ.. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలను మారుస్తోంది. ఎంతో...

ప్రత్యేకహోదాపై రచ్చ పీక్స్‌కి చేరిన వేళ బీజేపీ.. వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. మారుతున్న పరిణామాలకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలను మారుస్తోంది. ఎంతో కాలంగా పెండింగ్ లో వున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకాన్ని ఆపార్టీ అధిష్ఠానం ఓ కొలిక్కితెచ్చింది. ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ సోము వీర్రాజునే రాష్ర్ట అధ్యక్షునిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది.

ఏపీలో బిజేపీతో తెలుగుదేశం విడాకులు తీసుకున్నాక ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న తెలుగుదేశాన్ని అసెంబ్లీలోనూ, బయటా బీజేపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షం బీజేపీయే అన్నట్టుగా రాజకీయ పోరు టీడీపీ-బీజేపీల మధ్య నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నియామకంపై కసరత్తు కొలిక్కి వస్తోంది.

బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా నియమితుడైన బీజేపీ జాతీయ వ్యూహకర్త రాంమాదవ్ రెండోవారంలో రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనలోనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. మొదట్నుంచి సోము వీర్రాజే ఈ పదవికి ప్రధాన అభ్యర్ధిగా కనిపిస్తున్నా.. మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబే అడ్డు తగులుతున్నారనే ప్రచారం ఇన్నాళ్లూ జరిగింది. అయితే ప్రస్తుతం అలాంటి అడ్డంకులేమీ లేకపోవడంతో మళ్లీ సోమువీర్రాజు పేరు పరిశీలనలోకి వచ్చింది.

సోము వీర్రాజుతోపాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు కూడా తొలుత అధ్యక్షపదవి రేసులోకి వచ్చారు. అయితే ఇరువురి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, తనను గెలిపించడానికి సోము వీర్రాజు చేసిన కృషిని గుర్తుంచుకున్న మాణిక్యాలరావు.. సోముకే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పేరును కూడా మరో వర్గం ప్రచారంలోకి తెచ్చినప్పటికీ పార్టీలో కొంత వ్యతిరేకత రావడంతో సోమువీర్రాజువైపే మొగ్గు ఎక్కువయింది. కార్యకర్తలతోపాటు ముఖ్యనేతలు కూడా సోము వీర్రాజునే బలపరుస్తుండటంతో బీజేపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ రామ్ మాదవ్ పర్యటనలో సోమువీర్రాజును ఏపీ అధ్యక్షుడిగా నియమించడం ఖాయమన్నట్టు బీజేపీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories