ఆనం అంతర్మథనం...వైసీపీ నుంచి ఆనం సోదరులకు స్వాగత సంకేతాలు ?

ఆనం అంతర్మథనం...వైసీపీ నుంచి ఆనం సోదరులకు స్వాగత సంకేతాలు ?
x
Highlights

నెల్లూరు రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతోందా? ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? సైకిల్‌పై సవారీ ఇక కష్టమని భావించి ఆనం రామనారాయణ...

నెల్లూరు రాజకీయ ముఖచిత్రం మరోసారి మారబోతోందా? ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? సైకిల్‌పై సవారీ ఇక కష్టమని భావించి ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యాన్ కిందకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారా? అసలు నెల్లూరు రాజకీయాల్లో జరుగుతున్నదేంటి?

కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం సోదరులు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయ పూర్వ వైభవం కోసం పార్టీ మారిన ఆనం సోదరులకు టీడీపీలో ఆది నుంచీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో పార్టీ మారడంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీడీపీలో చేరినప్పటినుంచి నెల్లూరు టీడీపీ నేతలెవ్వరూ ఆనం సోదరులకు పెద్దగా ప్రాముఖ్యతనివ్వకపోవడం, పార్టీ పదవులు కూడా దక్కకపోవడం అసంతృప్తి మొదలయింది. ఆత్మకూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకొన్న రామనారాయణ రెడ్డికి గ్రూపు రాజకీయాలతో అక్కడా పెద్దగా ఉపయోగం లేకపోయింది. టీడీపీలో చేరితే వీఆర్ సంస్థలపై ఆధిపత్యం చెలాయించవచ్చుననుకుంటే అవి కూడా చేజారిపోవడం ఆనం సోదరులకు మింగుడపడలేదు. కార్పొరేటర్‌ ఆనం రంగమయూర్‌కు అధికార పార్టీ నుంచే విమర్శలు రావడంతో ఆనం ఫ్యామిలీలో అంతర్మథనం ప్రారంభమయింది.

ఆనం సోదరుల్లో అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది వైసీపీ. జిల్లాలో మంచి పట్టున్న ఆనం సోదరులను స్వాగతిస్తూ రామ నారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నట్లుగా వైసీపీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో పట్టుతగ్గిన మేకపాటి సోదరులు కూడా ఆనం ఫ్యామిలీకి సాదర స్వాగతం పలుకుతున్నారని సమాచారం. మారిన పరిస్థితులతో వైసీపీలో చేరడంపై ఆనం ఫ్యామిలీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలోనే ఆనం ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అది తేలాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories