కలెక్టర్ దివ్య దేవరాజన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

కలెక్టర్ దివ్య దేవరాజన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం
x
Highlights

ఆదీవాసీల కష్టనష్టాలు తెలుసుకునేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే...

ఆదీవాసీల కష్టనష్టాలు తెలుసుకునేందుకు చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. వాళ్లకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మాత్రం వాళ్ల సమస్యల పరిష్కారం కోసం వాళ్లలో ఒకరిగా మారిపోయారు. ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య దేవరాజన్ చేస్తున్న కృషిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏం చేస్తున్నారు.

పిల్లలకు దగ్గరవ్వాలంటే మనం పిల్లల్లా ప్రవర్తించాలంటారు మానసిక నిపుణులు. పిల్లల్లాంటి స్వచ్చమైన మనసు, అమాయకత్వం కలిగిన ఆదివాసీలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. పరాయి భాష మాట్లాడే అధికారులను పరాయి వాళ్లలాగానే చూసే గోండులు అదే అధికారుల నుంచి గోండు పలుకులు వినిపిస్తే మురిసిపోతారు. తమ కష్టాలన్నీ చెప్పుకోడానికి ముందుకొస్తారు. అందుకే చేసే పనిపై చిత్తశుద్ధి ఉండాలని తపించే దివ్యదేవరాజన్‌ ఎంతో కష్టమైనా పట్టువదలకుండా గోండు భాష నేర్చుకుంటూ ఆదివాసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.

చుట్టూ కొండలు, పచ్చదనం చల్లినట్టుగా ఉండే ఆదిలాబాద్ అడవుల్లో గోండులది భిన్నమైన జీవన శైలి. మైదాన ప్రాంతానికి దూరంగా ఉండే ఇక్కడి జనం సస్యలు కూడా భిన్నంగానే ఉంటే. సరైన సదుపాయాలు లేక, చదువుకు దూరంగా గడిపే గోండులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం కత్తిమీద సామే. ఓవైపు బతుకు పోరాటం మరోవైపు లంబాడాలతో వైరం ఈ సమయంలో ప్రభుత్వ అధికారులకు ఏదైనా నోరు విడిచి చెప్పాలంటే వారికి భాషే ప్రధాన అడ్డంకి. అందుకే అన్ని రకాల బాధలనూ భరించడం అలవాటు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన దివ్య దేవరాజన్.. లంబాడాలతో గోండుల వైరం, వారి కష్టాలు పరిష్కరించడానికి గోండు భాష నేర్చుకోవడం చాలా ముఖ్యమని భావించారు.

అనుకున్నదే తడవుగా గోండుల భాష నేర్చుకొని వాళ్లతో కలిసిపోయే ప్రయత్నం మొదలుపెట్టారు. సభలు, సమావేశాల్లో గోండి భాషలోనే మాట్లాడుతూ వారికి దగ్గరవుతున్నారు. వాళ్లు ఏ సమస్యలు చెప్పినా అనువాదకుడిని పక్కనే పెట్టుకొని ప్రతీ పదానికి అర్థం తెలుసుకొని అక్కడికక్కడే వాళ్లతో పరిష్కారాన్ని వాళ్ల భాషలోనే సంభాషిస్తున్నారు. అది చూసి మురిసిపోతున్న గోండులు దివ్యను గుండెలకు హత్తుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ చర్యల ఫలితంగా ఉట్నూరులో నిర్వహించిన ప్రజావాణికి గోండుల నుంచి వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. నార్నూర్ మండలం జమ్డా గ్రామంలో పెట్టిన సమావేశంలో కూడా ఇదే పరిస్థితి. ఇన్నాళ్లూ అధికారులు ఇలా మాట్లాడుంటే ఎప్పుడో తమ సమస్యలు తీరిపోయేవని గోండు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories