logo
జాతీయం

అంత‌రించి పోనున్న 42భాష‌లు

అంత‌రించి పోనున్న 42భాష‌లు
X
Highlights

దేశంలో 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనం ఇచ్చిన తాజా నివేదిక మాతృభాషా దినోత్సవాన...

దేశంలో 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనం ఇచ్చిన తాజా నివేదిక మాతృభాషా దినోత్సవాన కలవరపరిచే అంశం. ప్రపంచ భాషల్లో 43 శాతం చరమ దశలో ఉండగా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని భాషలు అదే స్థితిలో ఉన్నాయి. మాతృభాషను కాపాడుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, ప్రయత్నాలు, వేల కోట్ల రూపాయల ఖర్చు జరుగుతుండగా.. అదే సమయంలో మాతృభాషను ఎందుకు కాపాడుకోవాలి? అనే ప్రశ్నలూ ఉదయిస్తున్నాయి.

ప్రపంచం మొత్తమ్మీద 6 వేల భాషలుండగా అందులో 2572 భాషలు అగమ్యగోచర స్థితిలో, 576 భాషలు అంతరించే దశలో ఉన్నాయి. వాటిలో 42 భాషలు మనదేశంలో ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని భాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయి. ఒరిశాలో మాండా, గదబ, పెంగో, పర్జీ, తెలుగుక రాష్ట్రాల్లో నాయకీ, కొండ, ఆంధ్రప్రదేశ్ లో కురుబ, కుర్రు, గోండు, గుబోట్, సొర, కుయి భాషలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మరికొన్ని ద్రవిడ భాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రభావం పడి గిరిజన భాషలు అంతరించే స్థితికి చేరుకోవడం దురదృష్టకరం.

తల్లి గర్భంలో ఉన్న శిశువు చివరి మూడు నెలల్లో తల్లి మాటలు వింటూ తల్లిభాష నేర్చుకుంటాడని, పుట్టగానే ఆ మాతృ భాషలో ఏడుస్తాడని జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పిల్లలకు అర్థం చేసుకునే శక్తిని, సమాచార నైపుణ్యాన్ని, ఆనందాన్ని, ఇతర భాషలు నేర్చుకునే సామర్ధ్యాన్ని మాతృభాష అందిస్తుంది. ఒక భాష అంతరిస్తే ఆ జాతిలో అప్పటివరకు జరిగిన సాంస్కృతిక, వైజ్ణానిక, సాహిత్య అభివృద్ధి కనుమరుగు అవుతుంది.

మాతృభాష ప్రాధాన్యాన్ని గుర్తించిన యురేపియన్ దేశాలు ఆయా భాషలను కాపాడుకునేందుకు పెట్టే ఖర్చు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఫ్రెంచ్ భాష అభివృద్ధి కోసం ఫ్రాన్స్ దేశం ఏడాదికి 19 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా, జర్మన్ వెయ్యి కోట్లు, స్పెయిన్ 78 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఒక భాష అంతరిస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికిగానీ, తిరిగి బతికించుకోడానికి గానీ అనేక సంవత్సరాలు, అంతులేని కృషి, శ్రమ అవసరమవుతాయి. ఒక భాష అంతరిస్తే ఒక జాతి జీవం ఆగినట్టే. అందుకే మాతృభాషను కాపాడుకునే బాధ్యత అందరిదీ.

Next Story