తెలంగాణ రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక

తెలంగాణ రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుక
x
Highlights

కొత్త సంవత్సరం మొదలయ్యే వేళ దేశ చరిత్రలోనే గొప్ప అడుగు పడబోతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల ఉచిత...

కొత్త సంవత్సరం మొదలయ్యే వేళ దేశ చరిత్రలోనే గొప్ప అడుగు పడబోతోంది. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందించబోతోంది. నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి రానుంది. తెలంగాణ రైతాంగానికి ఇక మంచిరోజులు వచ్చేసినట్టే. రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు విద్యుత్ సంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచే 24 గంటల కరెంటు సరఫరా ప్రారంభించి నూతన సంవత్సర కానుక అందించబోతున్నారు అధికారులు.

వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే గడువు సమీపించడంతో జెన్ కో-ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. నిరంతరాయ కరెంటు సరఫరా వల్ల ఎక్కువ లోడ్‌లు వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జనవరి 1 నుంచి క్రమంగా లోడ్‌లు పెరుగుతాయని వచ్చే మార్చి నాటికి 11 వేల మెగావాట్లకు పైగా డిమాండ్ వస్తుందని అంచనా వేశారు. అందుకు తగినట్లు విద్యుత్ సమకూర్చడానికి ఏర్పాట్లు చేశామని ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు ప్రభాకర్ రావు.

12 వేల 610 కోట్ల వ్యయంతో 24 గంటల విద్యుత్ అందించేందుకు ట్రాన్స్ కో, NPDCL, SPDCL సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. దీంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు అందించేందుకు ఉన్న సాంకేతిక అవకాశాలను, ఇబ్బందులను పరిశీలించారు. గ్రిడ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ అదనపు ఏర్పాట్లు చేశారు.
24 గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు రైతులు స్వచ్ఛంధంగా ఆటో స్టార్టర్లు తొలగించాలని విద్యుత్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో భూగ‌ర్భ‌జ‌లాలు కాపాడుకోవ‌డంతో పాటు కరెంటు వృథాను అరికట్టడానికి రైతులు సహకరించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories