అసలు ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి?

అసలు ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి?
x
Highlights

అతివలకు బంగారం ఓ సింగారం. ఆచారం.. అవసరం.. ఫ్యాషన్.. పేరు ఏదైతేనేం బంగారానికి ఆడవాళ్ల మదిలో ఒక ప్రత్యేక స్థానం వుంది. వివాహాలు, శుభకార్యాల పనులను...

అతివలకు బంగారం ఓ సింగారం. ఆచారం.. అవసరం.. ఫ్యాషన్.. పేరు ఏదైతేనేం బంగారానికి ఆడవాళ్ల మదిలో ఒక ప్రత్యేక స్థానం వుంది. వివాహాలు, శుభకార్యాల పనులను బంగారం కొని ప్రారంభించడం చాలామందికి అలవాటు. అంతెందుకు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే జీవితకాలం సిరిసంపదలతో తులతూగుతారన్నది ఓ నమ్మకం. కానీ ఇప్పుడవన్నీ ఏం కానున్నాయ్‌. ఆ విశ్వాసాలన్నీ ఎక్కడిపోనున్నాయ్‌? పసిడి ధర కొండెక్కడంతో సెంటిమెంట్‌కు ఆయింట్‌మెంట్‌ పూసే ఆయుధం ఏది కానుంది.? జీవితకాల గరిష్టానికి చేరుకున్న బంగారం రేపటి భవిష్యత్‌ను ఎలా శాసించబోతుంది?

పసిడి ధర కొండెక్కింది.. దివినుంచి భువికి దిగిరాను అంటోంది. బంగారం ఇపుడు షోకేసులకే పరిమితమయిపోతున్న ఓ అపురూప సంపద.... అయినా బంగారంపై ఆడవారికున్న మోజు ఇంతా అంతా కాదు.. పండుగ, పబ్బం, పెళ్లి, పేరంటం ఇలా తెలుగు లోగిళ్లకు బంగారంతో అనుబంధం చాలానే ఉంది. ఏ శుభకార్యానికైనా బంగారం కొనడం మన ఆచారాలలో భాగమై పోయింది.

రూ.40వేలకు చేరువలో పసిడి ధర

జీవన కాల గరిష్ఠానికి బంగారం

దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలకి రెక్కలు

పది గ్రాముల బంగారం ధర రూ.40 వేలు

ఈనెల 20 నుంచి పెరుగుతూ వస్తున్న పుత్తడి ధర

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి క్షీణత, బలమైన అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా ఐదో రోజు ఈ లోహాల ధరలు పెరిగాయి. సోమవారం ఒక్కరోజే 675 రూపాయలు పెరిగి పసిడి ధర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 40వేల చేరింది. ఈనెల 20 నుంచి ప్రతిరోజూ పుత్తడి ధర పెరుగుతూనే ఉంది.

అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడంతో మార్కెట్లో వెండి ధర రూ. 1,450 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ. 46,550 పలికింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణత, ఆర్థిక మాంద్యం ఆందోళనలతో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే బెటరని మదుపర్లు భావిస్తున్నారు. దీనికి తోడు దేశీయంగా కూడా కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయ్‌.

బంగారం. వెలకట్టలేని, అమూల్యమైన అత్యంత విలువైన సంపద.. ఏదైనా విశిష్టతకి కొలమానంగా బంగారం అనే పదం వాడుతుంటాం.. బంగారంలాంటి మాట చెప్పావ్ అని.. బంగారం లాంటి వ్యక్తి అనో.. ఇలా మంచితనాన్నో, మనిషిలోని విశిష్ట గుణాలను తెలియచెప్పడానికో బంగారం అనే పదం ప్రామాణికంగా కూడా వినిపిస్తుంటుంది. బంగారం అంటే ఇష్టముండని వారుండరు.. ప్రత్యేకించి ఆడవారికి బంగారంపై ఉండే ఆసక్తిపై ఎన్నో జోకులు, కార్టూన్లు కూడా వినిపిస్తాయి, కనిపిస్తాయి. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఏం జరుపుకున్నా.. ముందు బంగారం కొని పనులకు శ్రీకారం చుడతారు.. ప్రస్తుతం బంగారం వెలకట్టలేని వస్తువుగా మారిపోయింది. ఆర్ధిక మాంద్యం బంగారం రేటు చుక్కల్లోకి దూసుకుపోయేలా చేస్తోంది.. ఇపుడు బంగారం కొనడమంటే గగనమే.. పది గ్రాముల స్టాండర్ట్ బంగారం 40 వేల రూపాయలు పలుకుతోంది.

నిన్నా మొన్నటివరకూ బంగారం ఒక ఆభరణం. అలంకార ప్రాయం.. మనిషి హోదాను తెలియ చెప్పే చిహ్నం.. కానీ ఇపుడు బంగారమంటే పెట్టుబడి.. స్టాక్ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి ఓ లాభదాయకమైన వ్యాపారం. అసలు ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి? ఎందుకింత అందనంత ఎత్తుకు పుత్తడి పరుగులు తీస్తోంది.? ఇప్పుడు కొనొచ్చా అన్న అనుమానం వెంటాడుతోంది.?

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయ్‌. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో పుత్తడి ధరలు 40వేల రూపాయల మార్కును తాకాయి. దీంతో బంగారం మాట మాట్లాడాలంటేనే మధ్యతరగతి కుటుంబం జంకుతోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 40,260 రూపాయలకు చేరుకుంది. అదే ముంబైలో 40వేలు పలుకుతోంది. ఇక పసిడి ధరతో పాటు వెండి ధరలు కూడా ఆకాశానంటాయి. కిలో వెండి ధర 45వేలుకు చేరుకుంది. 44952 రూపాయలుగా ఉన్న కిలో వెండి ధర 0.78 శాతం పెరిగి 45, 342కు చేరుకుంది. బంగారం ధరలు క్రమంగా పెరగడం వెనక కారణం అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధమే అంటున్నారు నిపుణులు.

అమెరికా చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందం ఏర్పడుతోంది. ఈ భయమే పసిడి ధరలపై ప్రభావం చూపిస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా ఆందోళనకర వాతావరణం ఉండటంతో ఆసియా ఇక్విటీ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయ్‌. ఇన్వెస్టర్లు బంగారం ఇతర సావరిన్ బాండ్లపై ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు ఆయా దేశ కరెన్సీ విలువ పెరగడంతో కూడా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. రూపాయి విలువ పతనం దిశగా సాగడంతో ఆ ప్రభావం బంగారంపై కూడా కనిపిస్తోంది. గత ఆరేళ్లలో ఈ స్థాయిలో బంగారం పెరగడం ఇదే తొలిసారి.

ప్రపంచ మార్కెట్లో స్పాట్‌ బంగారం ధర ఒక శాతం పెరిగి ఔన్స్‌కు 1,544.23 డాలర్లకు చేరింది. ఏప్రిల్ 2013 నుంచి ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక అమెరికా ఉత్పత్తులపై చైనా 75 బిలియన్ డాలర్ల మేరా సుంకం విధించడం దీనికి ప్రతీకార చర్యగా అమెరికా అధ్యక్షుడు చైనా వస్తువులపై 550 బిలియన్ డాలర్లు అధిక సుంకం విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్న ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి. వెండి ధరలు కూడా ఇదే జోరుతో పెరుగుతున్నాయి. వెండి ధరల్లో పాజిటివ్‌ ట్రెండ్‌ కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. బంగారం ధరలు పెరుగుతుండటంతో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌కు గిరాకీ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలంలో గోల్డ్‌ ఈటీఎఫ్స్‌ నిర్వహణలోని ఆస్తులు 5,079 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల హోల్డింగ్స్‌ 2,424.9 టన్నులుగా ఉంది.

బంగారం ధర పెరుగుతోందని ఆందోళన చెందవద్దని, అంతర్జాతీయ మార్కెట్లు ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం వల్ల అందరూ సేఫ్ సైడ్‌గా ప్రస్తుతం పసిడివైపు పరుగెడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతోందని అంటున్నారు. వీటికి తోడు దేశీయ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్ పరంగా డిమాండ్, కస్టమ్ సుంకం 12.5 శాతం కలుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పసిడి వైపు నుంచి తమ దృష్టి మరల్చితే డిమాండ్ తగ్గి ధరలు కాస్త అదుపులోకి రావొచ్చునని పలువురు భావిస్తున్నారు.

బంగారం భారీగా పెరిగింది. అందనం ఎత్తుకు చేరుకుంది. ఈ సమయమే పసిడి కొనుగోళ్లకు చాలా క్రూషియల్‌ పిరియడ్‌. పసిడి కొనాలంటే దానిపై కచ్చితమైన అవగాహన వుండాలి. లేకపోతే కాకి బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించి అంటగట్టేస్తారు. ఏ బంగారం కొనాలి? ఏ బంగారం స్వచ్ఛమైనది? మేలిమి బంగారాన్ని ఎలా గుర్తించాలి ఇలా మనకెన్నో డౌట్లు వస్తుంటాయి. అవేంటో చూద్దాం.

బంగారం ఎంత రేటు పెరిగినా, దాన్ని కొనకుండా వుండలేం.. పసిడి అంటే మనకున్న మోజు అలాంటిది.. కేడీఎం బంగారాన్ని మనం అత్యంత నాణ్యమైన బంగారంగా లెక్కిస్తాం.. కేడీఎం ఆభరణాలను కరిగిస్తే 91.6 శాతం బంగారం వస్తుంది. అయితే 12శాతం తరుగు, తయారీ చార్జీలు చెల్లించాలి. దీంతో వినియోగదారుడికి కేవలం 80 శాతం బంగారం మాత్రమే దక్కుతుంది. అంటే పదిగ్రాముల బంగారాన్ని మనం మార్కెట్‌లో కొంటే అందులో మనకు దక్కేది 8 గ్రాములేనన్న మాట. మిగిలిన రెండు గ్రాములు తయారీ, తరుగు ఖర్చుల రూపంలో పోతుంది. రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలు కొనేటపుడు కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కస్టమర్ ఆదమరచి వున్నాడంటే రాళ్ల తూకాన్ని, బంగారం బరువుతో కలసి లెక్కించేస్తారు. రాళ్ల బరువును విడిగా లెక్కించమని తప్పనిసరిగా అడగాలి. ఆభరణంలోని బంగారం బరువు విడిగా, రాళ్ల బరువు విడిగా అడిగి తెలుసుకోవాలి. ఆ విషయాన్ని బిల్లులో కూడా స్పష్టంగా వేయమని కోరాలి.

ఇక బంగారం రేట్లు కూడా అన్ని దుకాణాల్లోనూ ఒకలా వుండవు. హైదరాబాద్, చెన్నై, ముంబై బులియన్ మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. అలాగే ఇక్కడే పుట్టి ఇక్కడే స్థిరపడి వ్యాపారం చేసుకునే వారి దగ్గర ఒక రేటు, పక్క రాష్ట్రాలనుంచి ఇక్కడకొచ్చి స్థిరపడి వ్యాపారం చేసే వారి దగ్గర మరో రకంగానూ బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. బంగారం కొనేముందు దాని స్వచ్ఛతను, నాణ్యతను రెండు, మూడుసార్లు పరీక్షించుకోవాలి. స్టాండర్డ్ బంగారంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ముద్ర వుంటుంది. బంగారం ఆభరణాలపై త్రిభుజా కారంలో గుర్తు వుంటే అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ ముద్ర అని అర్ధం. అలాగే కోడ్ పద్ధతిలో ఆభరణాలపై ఇయర్ ఆఫ్ స్టాంపింగ్ ముద్ర కూడా వుంటుంది. ఇక 24 కారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో అమ్ముతారు. వీటిని కొనుగోలు చేసేటపుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో దానిని తిరిగి అమ్మడం సులభమవుతుంది.

బంగారం ఒకప్పుడు మామూలు వ్యాపారం. కానీ ఇపుడిదో బ్రాండ్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకుంటోంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు బంగారం అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ బ్రాండ్‌తో అమ్ముడయ్యే బంగారం అత్యంత స్వచ్ఛమైనది, నాణ్యమైనది అనే అభిప్రాయం వుంది. ఇదెంత వరకు నిజం?

పుత్తడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గణనీయంగా పెరిగిపోవడంతో మనదేశంలో కూడా వాటి ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేవు. దేశీయంగా ఆభరణాల మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల మార్కు దాటిపోయింది. కొంతకాలం క్రితం వరకూ బంగారం అమ్మకాలు కుటుంబ వ్యాపారంగానే వుండేవి. కానీ ఇపుడిపుడే వీటికి బ్రాండింగ్ కూడా ఏర్పడుతోంది. మనదేశంలో దాదాపు 65 పైగా బ్రాండెడ్ కంపెనీలే బంగారు నగలని అమ్ముతున్నాయి.

బంగారం ధరలు రోజు రోజు కీ పెరిగిపోతుండటంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో వుండటం లేదు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర వొత్తిళ్లకు లోను కావడం, బంగారాన్ని ఎక్కువ మంది పెట్టుబడిగానే భావిస్తుండటం, డాలర్ మారక విలువ ఇలా ఎన్నో అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలకు కారణమవుతున్నాయి. పదిగ్రాముల ధర 40 వేలకు చేరడంతో గతంలో పదిగ్రాములు కొనేవారు ఇపుడు అయిదు గ్రాములే కొంటున్నారు. ఇంకొందరైతే పూర్తిగా కొనడమే మానేస్తున్నారు. మరికొందరైతే... జ్యుయలరీ షాపుల వైపు చూడటమే లేదు. ఆకాశానికి చేరిన బంగారం ధరలు దిగి రాకపోవడం అటు వర్తకులనీ భయపెడుతోంది. అమ్మకాలు సజావుగా సాగడం కోసం అందుకే వారు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు.

ఏమైనా కొండెక్కి కూర్చున్న బంగారం ధర అంతర్జాతీయ బులియన్ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెరుగుతూ కస్టమర్లకి అందని ద్రాక్షలా ఊరిస్తోంది. దీపావళి నాటికి ఈ ధరలు మరింత ఆకాశానికేసి చూస్తాయేమోనన్న అనుమానం ఇటు మదుపర్లని, అటు వినియోగదారులను వెంటాడుతున్నాయ్‌. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోలేని వాళ్లు దీపావళికి కొనుక్కోవచ్చన్న నానుడి... బంగారం విషయం నిజం కాదేమోనన్న సందేహమూ ఉంది. ఏమైనా పసిడి రేట్లు తగ్గి మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయని ఆశిద్దాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories