Venezuela: ప్రపంచ ఇంధన రంగంపై వెనెజువెలా ప్రభావం.. డీజిల్ ధరలు తగ్గడం ఖాయమా?

Venezuela: వెనెజ్వెలాలో పరిణామాలు ప్రపంచ రాజకీయాతో పాటు, అంతర్జాతీయ ఇంధన రంగంలో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
Venezuela: వెనెజ్వెలాలో పరిణామాలు ప్రపంచ రాజకీయాతో పాటు, అంతర్జాతీయ ఇంధన రంగంలో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అమెరికా మదురోను అరెస్టు చేయడం వెనుక మాదకద్రవ్యాల పేరు చెబుతున్నా ఇదంతా అక్కడి చమురు నిల్వల కోసమే అనేది సుస్పష్టం. వెనెజువెలాలో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. మొత్తం ప్రపంచ నిల్వల్లో దాదాపు 17 శాతానికి ఇది సమానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. రష్యా ఆయిల్ మార్కెట్‌ను దెబ్బ తీసేందుకు వెనెజువెలా చమురు మార్కె్ట్‌ను అగ్రరాజ్యం తన అదుపులోకి తీసుకుందనేది సుస్పష్టం.
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే.. భారీ చమురు నిల్వలు కలిగిన దేశాలు తరచూ అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కేంద్రంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఈ ముడి చమురుపై నియంత్రణ కోసం ప్రపంచ దేశాల యుద్ధాలే కాదు, ఈ దేశాల మధ్య వ్యూహాత్మక పోటీ కొనసాగుతోంది. ఈ కోవలో వెనిజులా కూడా చేరింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. పెట్రోలియం ఎగుమతిదారుల సంస్థ ఒపెక్ ప్రకారం, దక్షిణ అమెరికాలో ఉన్న వెనెజువెలా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలతో ఉన్న దేశంగా ముందుంది. ఈ దేశం వద్ద సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో 17.3 శాతం ఉంటుంది. రెండో స్థానంలో సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెల్స్ నిల్వలు ఉన్నాయి.. ఆ తర్వాత వరుస క్రమంలో ఇరాన్, కెనడా, ఇరాక్, యూఏఈ, కువైట్, రష్యా, అమెరికా, లిబియాలు నిలుస్తాయి.
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, అతితక్కువ నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. దీంతో అగ్రరాజ్యం అంతర్జాతీయ మార్కెట్ లో దిగుమతులపై ఆధారపడకుండా తన స్వయం సమృద్ధిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. వెనెజువెలా చమురు ప్రపంచ ధరలపై ఎంతవరకు ప్రభావం చూపగలదు అనే ప్రశ్న కూడా కీలకమే. ప్రపంచ చమురు నిల్వల్లో వెనిజులా వాటా అత్యధికంగా 17.3 శాతం ఉన్నప్పటికీ, ఆ దేశం వెలికితీస్తున్నది రోజుకు 11 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే. అంటే సుమారు 1 శాతమే. గల్ఫ్ దేశాల్లో లభించే తేలికపాటి చమురుతో పోలిస్తే, ఈ భారీ చమురును శుద్ధి చేయడానికి అధునాతన రిఫైనరీలు అవసరం. వెనెజువెలాలో చమురు రంగం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవడం, అవినీతి, అంతర్జాతీయంగా ఆ దేశంపై ఉన్న ఆంక్షలు ఇందుకు కారణం. ఈ క్రమంలో అమెరికా దృష్టి ఎప్పటి నుంచో వెనెజువెలా మీద అమెరికా కన్నేసింది.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 'మేం చమురు వ్యాపారంలో ఉన్నాం. దానిని ఇతర దేశాలకు విక్రయిస్తాం. వెనెజువెలా సరైన ఉత్పత్తి చేయలేకపోయింది. ఎందుకంటే అక్కడ మౌలిక వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందుకే మేం చాలా పెద్ద పరిమాణాల్లో చమురును ఇతర దేశాలకు విక్రయించబోతున్నాం. ప్రస్తుతం కొన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో మరెన్నో దేశాలు ముందుకు వస్తాయి. వెనెజువెలాలో చమురు రంగం చాలా కాలంగా పూర్తిగా విఫలమైంది. వారు చేయగలిగిన స్థాయితో పోలిస్తే చాలా తక్కువగా చమురును పంప్ చేస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలోకి తీసుకెళ్లి, బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తాం. పూర్తిగా ధ్వంసమైన ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సరిచేస్తాయి. దాంతో వెనెజువెలా దేశానికి ఆదాయం రావడం మొదలవుతుంది' అని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ చెబుతున్నట్లు ఈ స్థితి నుంచి వెనెజువెలా చమురు రంగం పునరుత్తేజం పొందాలంటే.. కొన్నేళ్ల సమయం పడుతుంది. భారీస్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయి. వెనెజువెలాలో రాజకీయ స్థిరత్వం లేకపోతే ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలుగానీ, ఇతర విదేశీ చమురు కంపెనీలుగానీ సుముఖత చూపవు. ప్రస్తుతానికి ఆ దేశంలో సుస్థిర సర్కారు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు ఎక్సాన్ మొబిల్, చెవ్రాన్ వంటి పెద్ద చమురు కంపెనీలు వెనెజువెలాలో పరిణామాలపై ఇంకా స్పందించలేదు. 2007లో అప్పటి వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ చాలావరకు చమురు ఉత్పత్తిని జాతీయీకరణం చేయడంతో.. ఎక్సాన్ మొబిల్, కొనొకోఫిలిప్స్ వంటి కంపెనీలు ఆ దేశాన్ని వీడాల్సి వచ్చింది. కాబట్టి దేశీయంగా రాజకీయ వాతావరణం మెరుగుపడి, సుస్థిర సర్కారు ఏర్పాటై, తమ వ్యాపారాలకు భరోసా ఇచ్చేదాకా పెద్ద కంపెనీలేవీ వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు.
వెనెజువెలాలో భార ముడి చమురు వెలికితీతను అమెరికా పెంచగలిగితే.. ఐరోపా, ఇతర దేశాలు రష్యా నుంచి దాన్ని కొనుగోలు చేయడం నిలిపివేయొచ్చు. వెనెజువెలాలో ముడి చమురు వెలికితీతను భారీస్థాయిలో హెచ్చించడం.. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు దోహదపడుతుందని కూడా అమెరికా భావిస్తోంది. ఎందుకంటే- వెనెజువెలాలో కీలకమైన భార ముడి చమురు ఎక్కువగా లభిస్తుంది. డీజిల్, అస్ఫాల్ట్‌లను.. భారీ సాధనాల్లో వాడే ఇతర ఇంధనాలను ఉత్పత్తి చేసేందుకు ఈ భార ముడి చమురు అవసరం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఉంది. అమెరికాలో లభించే తేలికైన ముడిచమురుతో డీజిల్‌ను ఉత్పత్తి చేయడం సులువు కాకపోవడమే అందుకు ఓ కారణం. . వెనెజువెలాలో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడి, అక్కడ ఉత్పత్తి భారీగా పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతాయి. అప్పటివరకు మాత్రం విపణిపై తాజా పరిణామాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చన్నది విశ్లేషకుల మాట.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



