Oil prices: మొద‌లైన యుద్ధ ప్ర‌భావం.. భారీగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు

Oil prices: మొద‌లైన యుద్ధ ప్ర‌భావం.. భారీగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు
x
Highlights

Oil prices: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా సైనికంగా జోక్యం చేసుకోవడంతో పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఉద్విగ్నంగా మారాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చమురు సరఫరాపై భయాలు కలిగిస్తున్నాయి.

Oil prices: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా సైనికంగా జోక్యం చేసుకోవడంతో పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఉద్విగ్నంగా మారాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చమురు సరఫరాపై భయాలు కలిగిస్తున్నాయి. ఫలితంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత ఐదు నెలల్లో ఎప్పుడూ లేని స్థాయిలో చమురు ధరలు పెరిగి కొత్త గరిష్ఠాలను తాకాయి. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.

మంగళవారం ట్రేడింగ్‌లో ముడిచమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ఒక్కరోజులోనే 2.7% పెరిగి 79.12 డాలర్లకు చేరగా, యూఎస్ క్రూడ్ బ్యారెల్‌ ధర 2.8% ఎగబాకి 75.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల అనేక దేశాలకు ఆర్థిక ఒత్తిడిని తెస్తోంది. ముఖ్యంగా చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్‌ వంటి దేశాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

చమురు ధరల పెరుగుదలతో పాటు యుద్ధ పరిణామాల భయంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్ నిక్కీ సూచీ 0.6 శాతం, దక్షిణ కొరియా కోస్పి 1.4 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.7 శాతం తగ్గాయి. అంతేకాకుండా, అమెరికా ఎస్‌అండ్‌పీ 500 ఫ్యూచర్స్‌ 0.5 శాతం, నాస్‌డాక్‌ ఫ్యూచర్స్‌ 0.6 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా, పెట్టుబడిదారుల భయం తొలగలేదనే విశ్లేషణలున్నాయి.

అణు కేంద్రాలపై అమెరికా మిస్సైల్ దాడులు జరిపిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి తన వ్యూహాన్ని మారుస్తోంది. గల్ఫ్‌ ప్రాంతంలో అత్యంత కీలకమైన హర్మూజ్‌ జల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. దీని ద్వారా చమురు సరఫరా సగానికి తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వరకు ఈ మార్గం ద్వారా వస్తుంది. అందుకే ఇరాన్ చర్యలపై అంతర్జాతీయంగా భయాందోళనలు పెరుగుతున్నాయి.

పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతలు భారత్‌ కోసం ఆర్థికంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చమురు ధరల పెరుగుదలతో పాటు వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు ఏర్పడితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలతో జరిగే దిగుమతి, ఎగుమతి వ్యవహారాలు మందగించాయి. ఇక యుద్ధం మరింత వేగం పుంజుకుంటే.. ఇరాక్, జోర్డాన్‌, లెబనాన్‌, సిరియా, యెమెన్‌ వంటి దేశాలతో మన వాణిజ్య బంధాలు బలహీనపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories