ట్విటర్‌ ఎఫెక్ట్‌: టెస్లాకు ₹9 లక్షల కోట్ల నష్టం

Tesla Loses More than Rs 9 lakh crore Amid Twitter Deal
x

ట్విటర్‌ ఎఫెక్ట్‌: టెస్లాకు ₹9 లక్షల కోట్ల నష్టం

Highlights

Tesla Stock Drop: అనుకున్నదొకటి.. అయినది ఒకటి... బోల్తా కొట్టిందిరో బుల్‌ బుల్‌ పిట్ట.. ఈ పాట ఇప్పుడు అచ్చంగా అతికినట్టు సరిపోతుందేమో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ పరిస్థితి.

Tesla Stock Drop: అనుకున్నదొకటి.. అయినది ఒకటి... బోల్తా కొట్టిందిరో బుల్‌ బుల్‌ పిట్ట.. ఈ పాట ఇప్పుడు అచ్చంగా అతికినట్టు సరిపోతుందేమో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ పరిస్థితి. 44 బిలియన్‌ డాలర్లకు మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విట్టర్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకున్నందుకు ఆనందపడాలో తన సంస్థ టెస్లా 126 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్క రోజులోనే టెస్లా సంస్థ 126 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. ట్విట్టర్‌లో పెట్టుబడులకు టెస్లా షేర్లను అమ్ముతారేమోనని మదుపర్ల ఆందోళనతో టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ట్విట్టర్‌ కొనుగోలుకు వెచ్చించన ధనం కంటే అదనంగా మరో రెండు రెట్ల ధనం ఎలాన్‌ మస్క్‌ కోల్పోయారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది అంటే.. ఇదేనేమో.. 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్ కొనుగోలు చేయడంతో ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లాకు కష్టమొచ్చింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను టెస్లా షేర్లను విక్రయిస్తారేమోనని మదుపర్లలో ఆందోళన వ్యక్తమయింది. దీంతో టెస్లా ఏకంగా 126 బిలియన్‌ డాలర్ల సంపదన కోల్పోయింది. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే.. 9 లక్షల 66వేల కోట్ల రూపాయలను టెస్లా ఒక్క రోజులోనే నష్టపోయింది. టెస్లా షేర్లలో 12.2 శాతం తగ్గింది. టెస్లా షేర్ల పతనంతో మస్క్‌కు 21 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 21 బిలియన్‌ డాలర్ల నగదునే ఇచ్చేందుకు ట్విట్టర్‌ యాజమాన్యంతో మస్క్‌ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. టెస్లా షేర్లను మస్క్‌ అమ్ముతారేమోనని మదుపర్లలో నెలకొన్న భయమే షేర్లు పడిపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి టెస్లా షేర్లకు, ట్విట్టర్‌ కొనుగోలుకు సంబంధం లేదు. అయినా మదుపర్లు భయపడిపోయారు. టెస్లా షేర్ల పతనంపై మాత్రం ఎలాన్ మస్క్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

టెస్లా షేర్ల పతనానికి మదుపర్ల భయంతో పాటు అంతర్జాతీయ ఒడిదుడుకులు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచడంతో పెట్టబుడిదారుల్లో ఆందోళన మొదలయ్యింది. అంతేకాకుండా అమెరికా స్టాక్‌ మార్కెట్లు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ట్విట్టర్‌ షేర్లు కూడా పతనమయ్యాయి. 3.9 శాతానికి పడిపోయి.. 49.68 డాలర్ల వద్ద ముగిసింది. అంతకుముందు ఒక్కో షేర్‌కు 54.20 డాలర్ల చొప్పున నగదు రూపంలో కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ అంగీకరించారు. ఎలాన్‌ మస్క్‌ మొత్తం సంపద 239 బిలియన్‌ డాలర్లలో టెస్లాలోనే అధిక భాగం పెట్టుబడులు పెట్టారు. టెస్లా షేర్ల పతనంతో ప్రపంచ టాప్‌ ధనవంతుడిగా ఆయన స్థానం గల్లంతయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా టెస్లా షేర్ల పతనం కొనసాగితే.. మస్క్‌ రుణాలు పొందడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతన్నారు. ఇప్పటికే టెస్లాలోని తన షేర్లలో సగానికి పైగా మస్క్‌ రుణాలను తీసుకున్నాడు. ఇదే పెట్టుబడుదారుల్లో ఆందోళనకు కారణమై ఉండొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌పై కన్నేసిన ఎలాన్‌ మస్క్‌ అనుకున్నది సాధించారు. అందుకు ఈ ఏడాది ఆరంభం నుంచే ట్విట్టర్‌లో వాటాలను మస్క్‌ కొనుగోలు చేయడం ప్రారంభించారు. జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య 264 కోట్ల డాలర్ల వెచ్చించి 10శాతం మేర షేర్లను కొనుగోలు చేశారు. అయితే ఈ విషయాన్ని ఆయన ఏప్రిల్‌ 4 వరకు అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంచ్‌ కమిషన్‌-ఎస్‌ఈసీకి తెలియజేయలేదు. 11 రోజులు ఆలస్యం చేశారు. ఫలితంగా 156 మిలియన్‌ డాలర్లు లబ్ధి పొందినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నిబంధన ప్రకారం మదుపర్ల వాటా ఐదు శాతం మించితే.. ఈ విషయాన్ని 10 రోజుల్లోగా ఎస్‌ఈసీకి సమాచారం అందించాల్సి ఉంటుంది. మార్చి 14 నాటికే ట్విట్టర్లో తన వాటా 5 శాతం తాటినట్టు ఎక్స్చేంజీలకిచ్చిన సమాచారంలో మస్క్‌ వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఏప్రిల్‌ 4 వరకు దాచి ఉంచారు. ఈ మధ్య కాలంలో ఆయన ఒక్కో షేరుకు 39 డాలర్లు చెల్లించి మరిన్ని వాటాలు కొన్నారు. ఫలితంగా మొత్తం ఆయన వాటా 9.2 శాతానికి పెరిగి.. 50 డాలర్లు దాటింది. ఒకవేళ 5 శాతం వాటా పరిమితికి చేరుకోగానే వెల్లడించి ఉంటే మిగిలిన 4.1 శాతం షేర్ల కోసం ఆయన అదనంగా 156 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉండేది. ఎస్‌ఈసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మస్క్‌ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ట్విట్టర్‌ కొనుగోలుకు ఎలాన్ మస్క్‌ ఆఫర్‌ చేసిన మొత్తం సాంకేతిక రంగంలో సంచలనమే సృష్టించింది. 44 బిలియన్‌ డాలర్లతో కుదుర్చుకున్న ఒప్పందం.. అంతర్జాతీయ సాంకేతిక రంగంలోనే మూడో అతి పెద్ద కొనుగోలు లావాదేవీగా నిలవనున్నది. అంతకుముందు గేమింగ్ సంస్థ యాక్టివిజన్‌ బిజార్డ్‌ను 68.7 బిలియన్‌ డాలర్లకు మైక్రోసాప్ట్‌ కొనుగోలు చేసింది. సాంకేతిక రంగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద కొనుగోలు లావాదేవీగా నమోదయ్యింది. 2015లో నెట్‌వర్క్‌ స్టోరేజీ దిగ్గజం ఈఎంసీ కార్ప్‌ను 67 బిలియన్‌ డాలర్లకు డెల్‌ కొనుగోలు చేసింది. ఇది రెండో అతి పెద్ద లావాదీవీ.. అమెరికాలోని చిప్‌ తయారీ సంస్థ బ్రాడ్‌ కామ్‌ను పోటీ సంస్థ అవాగో టెక్నాలజీస్‌ 37 బిలియన్‌ డాలర్లకు 2015లో కొనుగోలు చేసింది. వీటన్నింటిని మించి.. ట్విట్టర్‌ 44 బిలియన్ డాలర్లకు మస్క్‌ కొనుగోలు చేశారు. సాంకేతిక రంగంలో ఇతే టాప్‌ లావాదేవీ కావడం విశేషం.

మొత్తానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఆనందం టెస్లా రూపంలో ఆవిరయ్యింది. ట్విట్టర్‌కు వెచ్చించిన ధనం కంటే రెండు రెట్లు నష్టాన్ని టెస్లా మూటగట్టుకుంది. ట్విట్టర్‌ కొనుగోలు టెస్లాకు భారీ నష్టాన్ని చేకూర్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories