Rs.2000 Note : రూ.2000నోట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన

Rs.2000 Note
x

Rs.2000 Note : రూ.2000నోట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన

Highlights

Rs.2000 Note: ఆర్బీఐ రూ.2000 నోట్లపై ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా రూ.6,017 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Rs.2000 Note: ఆర్బీఐ రూ.2000 నోట్లపై ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుని దాదాపు రెండేళ్లు గడిచినా ఇంకా రూ.6,017 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం. 2023, మే 19న రిజర్వ్ బ్యాంక్ రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సమయానికి మార్కెట్లో దాదాపు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి. కానీ, ప్రజలు, బ్యాంకుల సహకారంతో 2025, జూలై 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి రూ.6,017 కోట్లకు చేరింది. అంటే, మొత్తం నోట్లలో దాదాపు 98.31 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో అవకాశం కల్పించారు.

దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో నేరుగా వెళ్లి మీ రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఈ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఉన్నాయి. ఆర్బీఐ మరో సులువైన మార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా మీ రూ.2000 నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనికైనా పంపవచ్చు. ఈ నోట్లు ఆర్బీఐ కార్యాలయానికి చేరిన తర్వాత, వాటి విలువను మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మీరు మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు. దీనికి సంబంధించి ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులు అక్టోబర్ 9, 2023 నుంచే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కరెన్సీ అవసరాలను త్వరగా తీర్చడం కోసం రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. ఈ నోట్ల ముద్రణను 2018-19లోనే నిలిపివేశారు. ఆర్బీఐ ప్రకారం, ఈ నోట్లు మార్చి 2017కి ముందు ఎక్కువగా ముద్రించబడ్డాయి. వాటి జీవితకాలం దాదాపు 4-5 సంవత్సరాలు మాత్రమే. పైగా ఈ నోట్లు ప్రజల రోజువారీ లావాదేవీల్లో పెద్దగా కనిపించడం లేదు. అందుకే, క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వీటిని ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ నోట్లు ఉపసంహరించినా కూడా, అవి చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories