Bitcoin: బిట్ కాయిన్.. ఢమాల్

Massive Drop in Bitcoin
x

Bitcoin: బిట్ కాయిన్.. ఢమాల్

Highlights

Bitcoin: అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ కరెన్సీ, బిట్‌కాయిన్ ఢమాల్ అంటోది. ఏప్రిల్‌ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్‌ విలువ నేడు 40 వేల డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Bitcoin: అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ కరెన్సీ, బిట్‌కాయిన్ ఢమాల్ అంటోది. ఏప్రిల్‌ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్‌ విలువ నేడు 40 వేల డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంటే దాదాపు నెలరోజుల్లో 30శాతం విలువ కోల్పోయింది. చైనాతో పాటు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలెన్‌ మస్క్‌ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా పతనపుటంచులకు చేరిపోయింది. మే 19 న క్రిప్టోకరెన్సీ రంగ మార్కెట్ క్యాపిటలైజేషన్ 177 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. ఆవిధంగా గతేడాది మార్చి తర్వాత బిట్‌కాయిన్‌కు రోజులో అతి పెద్ద నష్టం నమోదయింది. డిజిటల్ కరెన్సీలో ఎంత వేగంగా దూసుకెళ్లిందో అంతే వేగంగా విలువను కోల్పోయిన బిట్‌కాయిన్‌ పతనం దిశగా పరుగులు తీస్తోంది.

బిట్ కాయిన్ పతనానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తాయి. ఒకటి డ్రాగన్ దేశం చైనా కాగా రెండోది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలెన్‌ మస్క్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఇప్పటి వరకు బిట్ కాయిన్ దాదాపు 30శాతానికి పైగా విలువ కోల్పోవడాన్ని గమనిస్తే దాని భవిష్యత్తు ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి చైనా 2019లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ను నిషేధించినప్పటికీ ప్రజలు ఆన్‌లైన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లపై బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ కొనసాగిస్తున్నారు. ఆయా పరిణామాలతో ఆందోళన చెందిన డ్రాగన్ దేశం వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. చైనాకు చెందిన నేషనల్‌ ఇంటర్నెట్‌ ఫైనాన్స్‌ అసోసియేషన్‌ , చైనా బ్యాంకింగ్‌ అసోసియేషన్‌, పేమెంట్‌ అండ్‌ క్లియరింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చైనా తదితర ప్రభుత్వ రంగ సంస్థలు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాయి. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినా, వాటి లావాదేవీల్లో పాల్గొన్నా.. ఆర్దికపరమైన నష్టాలకు ఎటువంటి రక్షణ ఉండబోదని తేల్చి చెప్పాయి. ఆ విధంగా అన్ని మార్గాల ద్వారా చైనా బలంగా క్రిప్టో కరెన్సీలను అడ్డుకోవడంతో మిగిలిన దేశాలు కూడా అదే బాటన ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ప్రపంచంలోని బిట్‌కాయిన్లలో 75 శాతం మైనింగ్‌ చైనాలోనే జరుగుతుంది. బిట్‌కాయిన్ వినియోగంపై ఎలాంటి నిషేధ ఆజ్ఞలు ఉన్నా గాని మైనింగ్ యదేఛ్చగా జరిగిపోతూ వుంటుంది. బిట్‌కాయిన్లను సృష్టించడానికి భారీగా విద్యుత్తు అవసరమవుతుంది. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఏప్రిల్‌ మూడోవారంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో సమస్యలు రావడంతో సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ 14శాతం మేర పడిపోయింది. దీనిని బట్టే బిట్‌కాయిన్లపై చైనాకు వున్న పట్టు ఏమిటో అర్థమవుతుంది. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్‌ మస్క్‌ బిట్‌కాయిన్‌పై మాటమార్చడం కూడా దీని విలువ పడిపోవడానికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బిట్‌కాయిన్ల చెల్లింపులను తమ సంస్థ ఆమోదిస్తుందంటూ మార్చిలో ఎలెన్‌ మస్క్‌ ప్రకటించడంతో బిట్‌కాయిన్‌ విలువ ఒక్కసారిగా పెరిగి అమాంతం 62 వేల డాలర్లను దాటేసింది. అయితే ఏప్రిల్‌ రెండో వారం వచ్చేసరికి మనసు మార్చుకొన్న మస్క్ మహాశయుడు తాము ఉత్పత్తి చేసే టెస్లా కార్ల కొనుగోలుకు బిట్‌కాయిన్లను అనుమతించేది లేదంటూ ప్రకటించారు. బిట్‌ కాయిన్‌ కోసం భారీ విద్యుత్తు ఉపయోగిస్తుండటంతో పర్యావరణం దెబ్బతింటోందంటూ మస్క్ చేసిన ప్రకటనతో బిట్‌కాయిన్‌ విలువ 15 శాతం మేర దిగజారింది. ఏప్రిల్‌ రెండో వారంలో 63 వేల డాలర్లు ఉన్న బిట్‌కాయిన్‌ విలువ ప్రస్తుతం 40 వేల డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరో క్రిప్టో కరెన్సీ ఇథీరియం కూడా దాదాపు 40శాతం విలువ కోల్పోయింది. ఇక ఇటీవలే విలువ బాగా పెరుగుతూ వచ్చిన డాగీకాయిన్‌ కూడా 45 శాతం విలువ కోల్పోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బిట్ కాయిన్ పతనంలో మరో కోణం ఏమిటంటే చైనా సొంత డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి రావడం ఎలక్ట్రానిక్‌ కరెన్సీ వినియోగాన్ని 2020 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చైనా కొన్ని నెలల క్రితం వినియోగంలోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్‌ చైనీస్‌ యువాన్‌ లేదా ఈసీఎన్‌వైగా వ్యవహరిస్తున్న దీనిని భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా వినియోగించడం లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు మోస్ట్ ఫేమస్ డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్ పతనానికి అనేకానేక కారణాలు కన్పిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories