రూపాయి రికార్డు పతనంతో జరిగేదేంటి.. అసలైన కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా?

Historic low for Indian Rupee
x

రూపాయి రికార్డు పతనంతో జరిగేదేంటి.. అసలైన కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయా?

Highlights

Indian Rupee: శ్రీలంక సంక్షోభం కళ్లముందే మెదులుతోంది.. పడిపోతున్న పాకిస్తాన్‌ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి.

Indian Rupee: శ్రీలంక సంక్షోభం కళ్లముందే మెదులుతోంది.. పడిపోతున్న పాకిస్తాన్‌ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడీ రెండు దేశాల జాబితాలోకి భారత్ చేరబోతోందా..? ఈ ఒకే ఒక్క ప్రశ్న కోట్లాది మంది భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రూపాయి రికార్డు పతనమే..! దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పడిపోయిన ఇండియన్ రూపీ అసలైన సవాళ్లు ముందే ఉన్నాయన్న సంకేతాలనిస్తోంది. ఇంతకూ, రూపాయి పతనంతో భారత్‌లో ఏం జరగబోతోంది..? శ్రీలంక, పాకిస్తాన్ పరిస్థితులు మన దగ్గర కూడా రిపీట్ కాబోతున్నాయా..? మోడీ సర్కార్‌కు రూపాయి విసురుతున్న సవాళ్లేంటి..?

దిగుమతులపైనే ఆధారపడే దేశాల కరెన్సీ పతనమైతే ఏం జరుగుతుంది..? శ్రీలంక, పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులే ఈ ప్రశ్నకు సమాధానం. ఇంధన ధరలు కొండెక్కడం, నిత్యావసరాలు షాకివ్వడం, మందులు, ఆహారం, విద్య, వైద్యం అంతెందుకు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు కూడా అందని పరిస్థితులే ఏర్పడతాయి. ఈ స్థాయికి ఓ దేశంలో ఆర్ధిక పతనం జరిగితే పాలన కూడా అస్తవ్యస్తమే ఇందుకు ద్వీప దేశం శ్రీలంక చెరిగిపోని, చెరగలేని సాక్ష్యం. ఇటు, పాక్‌లోను దాదాపు అలాంటి పరిస్థితులే. ఈ రెండు దేశాల ఆర్ధిక కల్లోలానికి కారణం అక్కడి కరెన్సీ పతనమే. ఇప్పుడిదే సమస్య భారత్‌ను టెన్షన్ పెడుతోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పతనమైన రూపాయి 130కోట్ల భారతీయులను గజగజా వణికించేస్తోంది. అయితే, రూపాయి పతనంతో నిజంగానే మనకు కూడా అలాంటి కష్టాలు ఎదురవుతాయా..? తాజా సవాళ్లను ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ దగ్గరున్న వ్యూహాలేంటి..? రూపాయి రికార్డు పతనంతో అసలు ఏం జరగబోతోంది..?

80 రూపాయలు డాలర్‌తో పోల్చితే అక్షరాలా 80 రూపాయలకు ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోయింది. నిజానికి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 4.16గా మాత్రమే ఉండేది. అంటే, అప్పుడు ఒక డాలరు మన కరెన్సీతో పోలిస్తే 4రూపాయల 16 పైసలతో సమానం. అయితే, ఆ తర్వాతి కాలంలో రూపాయి బలహీనపడుతూ, డాలర్ బలపడుతూ వచ్చింది. చరిత్రలో తొలిసారి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80 దాటింది. విదేశీ మార్కెట్లలో అమెరికన్ డాలర్ స్థిరంగా ఉండటం, క్యాపిటల్ ఔట్‌ఫ్లోస్ పెరగడం లాంటి కారణాలతో రూపాయి క్షీణించి కనీవినీ ఎరుగని కనిష్ట స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి నష్టాలను పరిమితం చేసినట్టు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. దీంతో రూపాయి పతనం దేశాన్ని ఎలాంటి పరిస్థితులకు తీసుకెళుతుందో అన్న భయాందోళనలు ఉత్కంఠ రేపుతున్నాయి.

నిజానికి రూపాయి ఎంతగా క్షీణిస్తే అంతగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. లంక, పాకిస్తాన్‌లో జరిగింది, జరుగుతోందీ ఇదే. ఆ రెండు దేశాల మాదిరిగానే అధికంగా దిగుమతుల మీదే ఆధారపడే భారత్‌కు ఇది కోలుకోలేని ఎదురు దెబ్బగా మారుతుంది. ఇందుకు కారణం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లించాల్సి రావడమే. క్రూడాయిల్, వంట నూనెలు సహా భారత్ దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపైనా ఇప్పటి వరకూ చెల్లించిన దానికంటే అదనంగా డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా భారత ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగి చివరికి దేశ అవసరాల కోసం దిగుమతులు చేసుకునేందుకు డాలర్లు లేని పరిస్థితులుఏర్పడతాయి. భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7 శాతానికి పైగా ఉంది. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంఫర్ట్ జోన్ 2 శాతం నుంచి 6 శాతం మాత్రమే.

రూపాయి పతనంతో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ లాంటి రంగాలపై పెను ప్రభావం తప్పదు. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు అమాంతం పెరిగే అవకాశముంది. ఇదే సమయంలో అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇన్వెస్టర్లకు కూడా ఇబ్బందులు తప్పవు. రూపాయి పడిపోవడం, దిగుమతి రంగాలకు ఖర్చులు పెరగడం, వాటి ఆదాయాలకు గండి పడటం లాంటి పరిణామాలు ఉంటాయి. విదేశాల్లో చదువులు, విదేశీ పర్యటనలు ఇలా ప్రతి అంశం కాస్ట్‌లీగా మారిపోతాయి. అయితే, రూపాయి పతనంతో కొన్ని రంగాలు లాభపడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్, స్పెషాలిటీ కెమికల్స్, టెక్స్‌టైల్స్ లాంటి ఎగుమతులు చేసే కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. నష్టాలతో పోల్చితే ఇదేమంత గుడ్‌న్యూస్ కాదనేది ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్న మాట. మరి మోడీ సర్కార్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోబోతోంది..? ఇప్పుడీ ప్రశ్నే ఉత్కంఠ రేపుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి విలువను పెంచడం అంత సులువేం కాదన్న అంచనాల నడుమ ఆర్‌బీఐ ఇప్పటికే కీలక అడుగులు వేస్తోంది. రష్యా సహా పొరుగు దేశాలతో రూపాయల్లో వ్యాపారం జరిపేలా పావులు కదుపుతోంది. ఈ దేశాలు అంగీకరిస్తే ప్రస్తుతం భారత్​ చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకోవచ్చు. తద్వారా డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమైన రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ మొత్తం వాణిజ్యం 77.15 లక్షల కోట్లు. ఇందులో రష్యా, పొరుగుదేశాలతో భారత్‌ వాణిజ్యమైన 12.64 లక్షల కోట్లు ఇది 16.38 శాతానికి సమానం. దీని ప్రకారం ఆర్‌బీఐ ప్రతిపాదించినట్లు రూపాయల్లో లావాదేవీలను పొరుగు దేశాలు, రష్యా అంగీకరిస్తే, భారత్‌ ప్రస్తుతం డాలర్లలో చేస్తున్న వాణిజ్యంలో 16.38 శాతాన్ని రూపాయల్లో చెల్లింపులకు మార్చుకునే వీలుంటుంది.

ఇదే జరిగితే దిగుమతుల కోసం భారత్ విదేశీ మారకపు ద్రవ్యాన్ని ఉపయోగించడం భారీగా తగ్గుతుంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, లక్ష కోట్లకు పైగా విలువైన భారత విదేశీ మారకపు నిల్వలు తగ్గాయి. ఫిబ్రవరిలో భారత విదేశీ మారకపు నిల్వలు 47.52 లక్షల కోట్ల మేర ఉండగా, ప్రస్తుతం అవి 46.43 లక్షల కోట్ల స్థాయికి దిగివచ్చాయి. రూపాయి పతనం ఇలాగే కంటిన్యూ అయితే వాటి నిల్వలు మరింత తరిగిపోవడం ఖాయం. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయంగా డాలర్ వాల్యూ తగ్గే అవకాశం కనిపించడం లేదు. దీంతో భారత్ దగ్గరున్న విదేశీ మారక నిల్వలను అలాగే అట్టిపెట్టుకుని, వీలైనంతగా రూపాయల్లో లావాదేవీలు జరిపితే ఆశించిన ఫలితం దక్కుతుందన్నది ఆర్‌బీఐ ఆలోచన. అయితే, భారత్ ప్రతిపాదనకు రష్యా సిద్ధమే. కానీ ఇతర పొరుగు దేశాలు ఒప్పుకుంటాయా అనేదే అసలు ప్రశ్నంతా. మొత్తంగా ఆ దిశగా ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అయితే భారత్ దగ్గరున్న విదేశీ మారక నిల్వలకు వచ్చిన ప్రమాదం ఉండకపోవచ్చన్న అంచనాలు ఊరటనిస్తున్నాయి. అయితే, ఆర్‌బీఐ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories