Atal Pension Yojana: కేంద్రం కీలక నిర్ణయం.. 2031 వరకు అటల్ పెన్షన్ యోజన పొడిగింపు.. అసంఘటిత రంగ కార్మికులకు భారీ ఊరట!

Atal Pension Yojana: సామాన్యులు, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం అమలు చేస్తున్న 'అటల్ పెన్షన్ యోజన' (APY) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.

Arun Chilukuri
Published on: 21 Jan 2026 2:38 PM IST
Atal Pension Yojana:  కేంద్రం కీలక నిర్ణయం.. 2031 వరకు అటల్ పెన్షన్ యోజన పొడిగింపు.. అసంఘటిత రంగ కార్మికులకు భారీ ఊరట!
X

Atal Pension Yojana: కేంద్రం కీలక నిర్ణయం.. 2031 వరకు అటల్ పెన్షన్ యోజన పొడిగింపు.. అసంఘటిత రంగ కార్మికులకు భారీ ఊరట!

Atal Pension Yojana: సామాన్యులు, అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత కోసం అమలు చేస్తున్న 'అటల్ పెన్షన్ యోజన' (APY) పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ పచ్చజెండా ఊపారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది.

రికార్డు స్థాయిలో చేరికలు: కేంద్ర గణాంకాల ప్రకారం, జనవరి 19, 2026 నాటికి ఈ పథకంలో 8.66 కోట్ల మంది సభ్యులుగా చేరారు. ఈ పథకానికి మరింత విస్తృత ప్రచారం కల్పించి, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ అందించే లక్ష్యంతో 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

పెన్షన్ మొత్తం: చందాదారులు చెల్లించే మొత్తాన్ని బట్టి నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ అందుతుంది.

అర్హతలు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న భారతీయులందరూ దీనికి అర్హులే.

ముఖ్య గమనిక: ఆదాయ పన్ను చెల్లించేవారు (Income Taxpayers) మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పరిధిలో ఉన్నవారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం లేదు.

ఎలా పెట్టుబడి పెట్టాలి? ఈ పథకంలో చేరాలనుకునే వారు పోస్టాఫీసులో లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతా కలిగి ఉండాలి.

తక్కువ వయస్సులో చేరితే లాభం: 18 ఏళ్లకే చేరిన వారు నెలకు కేవలం రూ. 42 నుంచి రూ. 210 చెల్లిస్తే సరిపోతుంది.

ఆటో డెబిట్ సౌకర్యం: బ్యాంకు ఖాతా నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తం నేరుగా కట్ అయ్యేలా (Auto-Debit) సెట్ చేసుకోవచ్చు. అయితే, ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

వార్ధక్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి ఈ పథకం ఒక గొప్ప వరమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story