Budget 2026 : నిర్మలమ్మ బడ్జెట్ మ్యాజిక్..ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గనున్నాయా?

Budget 2026 : నిర్మలమ్మ బడ్జెట్ మ్యాజిక్..ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గనున్నాయా?
x
Highlights

నిర్మలమ్మ బడ్జెట్ మ్యాజిక్..ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గనున్నాయా?

Budget 2026 : ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2026పై సామాన్యుడిలో భారీ ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునే వారికి ఈ బడ్జెట్ తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపులు, సబ్సిడీలు, సులభతరమైన ఫైనాన్స్ సౌకర్యాలను ప్రకటించే ఛాన్స్ ఉంది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నా, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఎంట్రీ-లెవల్ కార్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ 2026లో ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో చౌకైన ఈవీలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు ఇస్తే, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశంలో కాలుష్యం తగ్గడమే కాకుండా, పెట్రోల్ దిగుమతుల భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇప్పటికే కేంద్రానికి ఈ విషయంలో కీలక విజ్ఞప్తి చేసింది. ఎంట్రీ-లెవల్ ఈవీలకు, రవాణా రంగంలో వాడే విద్యుత్ వాహనాలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కోరింది. టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు ఆటో రంగానికి మేలు చేసినప్పటికీ, తక్కువ ధర కలిగిన ఈవీలు ఇంకా మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. వీటిపై సబ్సిడీలు పెంచితే అమ్మకాలు ఊపందుకుంటాయని ఆయన ఆశిస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా సుమారు రూ.10,000 కోట్ల బడ్జెట్‌తో కమర్షియల్ ఈవీలకు సబ్సిడీలు ఇస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలు కొనే సాధారణ ప్యాసింజర్ కార్లకు ఇందులో నేరుగా లబ్ధి చేకూరడం లేదు. రాబోయే బడ్జెట్‌లో ఈ పథక పరిధిని పెంచడమో లేక కొత్త ప్యాకేజీని ప్రకటించడమో చేస్తే, దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకోవడం సులభతరం అవుతుంది.

ఒకవేళ ఈ బడ్జెట్‌లో ఆశించిన విధంగా పన్ను మినహాయింపులు, ఇన్సెంటివ్‌లు వస్తే, ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. ఇది కేవలం పర్యావరణానికి మాత్రమే కాకుండా, దేశంలో కొత్త టెక్నాలజీ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడుతుంది. సరైన పన్ను రాయితీలు అందితే, రాబోయే ఏడాదిలో ఎలక్ట్రిక్ కార్లు సామాన్యుడికి భారంగా కాకుండా ఒక వరంగా మారతాయి. గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ వేస్తున్న అడుగుల్లో ఈ బడ్జెట్ ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories