ఆర్థిక సంక్షోభం దిశగా 37 దేశాలు.. భారీగా పెరిగిన చమురు, ఆహార ధరలు..

37 Countries Head to Financial Recession
x

ఆర్థిక సంక్షోభం దిశగా 37 దేశాలు.. భారీగా పెరిగిన చమురు, ఆహార ధరలు..

Highlights

Financial Crisis: ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రమాదపు అంచున ఉంది.

Financial Crisis: ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రమాదపు అంచున ఉంది. అగ్రదేశాలుగా పేరున్న అమెరికా, కెనడా, బ్రిటన్‌, జపాన్‌, ఐరోపా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఏడాదిలోగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి.. 2008 నాటి మాంద్యం నెలకొననున్నట్టు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే కొన్ని నెలలు ఎంతో క్లిష్టంగా మారననున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ తన నిధులను జాగ్రత్తగా వెచ్చించాల్సిన సమయం ఆసన్నమైనదని హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడమే. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆహార కొరత నెలకొన్నది. 2023లో తీవ్రమైన చమురు సంక్షోభం ముంచుకు రానున్నది. దీంతో స్థానికంగా పరిశ్రమలపై ప్రభావం చూపనున్నది. గగన, సముద్ర మార్గంలో జరిగే సప్లయ్‌ చైన్‌ ఆగిపోనున్నది. ఓ వైపు వస్తువుల డిమాండ్‌ భారీగా పెరుగుతుండగా మరోవైపు సరఫరా పాతాళానికి పడిపోతోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన 44 దేశాల్లో 37కు పైగా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు రెట్టింపు అయ్యింది. ఆయా దేశాల్లో సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్నాయి.

ఆర్థిక సంక్షోభానికి రెండో కారణం స్టాక్‌ మార్కెట్లు కుదేలవడమే ఇప్పటివరకు భారీగా ఉన్న ఆస్తుల విలువలు ఉన్నట్టుండి పడిపోయాయి. పలు కంపెనీల స్టాక్‌ విలువలు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక్క మే నెలలో మాత్రమే మదుపర్లు 11 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోయారు. 11 ఏళ్ల తరువాత ఇంతటి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. 2008 తరువాత గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లో ఇదే అత్యంత దారుణమైన నష్టమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. అందులోనూ భారతీయ మార్కెట్లు నిఫ్టీ, సెన్‌సెక్స్‌ పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని మాత్రం చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన గృహ, ప్రైవేటు, కంపెనీలు, ప్రభుత్వాల అప్పులు మొత్తం 305 లక్షల కోట్ల డాలర్లు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2000 సంవత్సరంలో ప్రపంచ దేశాల అప్పులు 83 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేది. అది 2022 నాటికి 305 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 2000 సంవత్సరం కంటే నాలుగు రెట్లు అదనంగా పెరిగింది. ఇది ప్రపంచ తలసరి ఆదాయంలో 355 శాతంగా ఉంది. ఇది అత్యంత తీవ్రమైన భరించలేని అప్పుగా నిపుణులు చెబుతున్నారు. ఈ రుణాల చెల్లింపులో విఫలమైతే ఆ దేశ వ్యవస్థ కుప్పకూలుతుంది.

ఆర్థిక మాంద్యానికి మూడో కారణం ఊహించని విధంగా ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనలు జరగడమే వ్యూహాన్‌లో పుట్టిన వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది అల్లకల్లోలం సృష్టించింది. వైరస్‌ దెబ్బకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. వైరస్‌ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌‌పై రష్యా దాడి చేసింది. ఈ అంతర్జాతీయ పరిణామాల కారణంగా సప్లయ్‌ చైన్‌ పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యావసర సరుకులు, చమురు, గ్యాస్‌, ఇతర ఉత్పత్తులు ఎగుమతులు నిలిచిపోయాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొనడానికి కారణం కూడా ఇదే. అంతేకాకుండా పలు దేశాల్లో కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. బ్రిటన్‌లో రైల్వే, పోస్టల్‌ ఉద్యోగులు, జర్మనీలో 8వేల మంది డాక్‌యార్డ్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దక్షిణ కొరియాలోనూ ట్రక్‌ కార్మికులు 8 రోజుల పాటు ఆందోళనలు చేశారు. ఈ కార్మికులు వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వాల వద్ద తగినన్ని నిధులు లేకపోవడంతో జీతాలను చెల్లించలేకపోతున్నాయి.

అగ్రదేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్‌, జపాన్‌, ఐరోపా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. చమురు, గ్యాస్‌, నిత్యావసరాలు కొరత తీవ్రమైంది. మండుతున్న ధరలతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఉక్రెయిన్‌పై దాడికి నిరసనగా రష్యా నుంచి గ్యాస్‌ కొనుగోళ్లను ఐరోపా దేశాలు నిలిపేశాయి. దీంతో ఇప్పుడు ఆ దేశాల్లో గ్యాస్‌ కొరత అధికమైంది. ప్రత్యామ్నాయంగా ఐరోపా గల్ఫ్‌ దేశాల్లోని గ్యాస్‌పై దృష్టి సారించాయి. ఇదే అదునుగా గల్ఫ్‌ దేశాలు గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచేశాయి. ఈ పరిణామం భారత్‌, చైనా, జపాన్‌ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఆసియా దేశాల గ్యాస్‌, చమురు దిగుమతులు 22 శాతం పడిపోయాయి. ఆయా దేశాల్లో చమురు, గ్యాస్‌ ధరలను ప్రభుత్వాలు భారీగా పెంచుతున్నాయి.

తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తం అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్న నిధులను అవసరం మేరకే వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేదంటే అగ్రదేశాల్లో మాదిరిగానే పరిస్థితులు విషమించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories