రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా?.. రైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్..

35 Paise Train Travel Insurance know Process to Claim
x

రైలు ప్రమాదాల్లో చనిపోయినా, గాయపడినా ఇన్సూరెన్స్ పొందడం ఎలా?.. రైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్..

Highlights

Railway Travel Insurance: మనిషికి మరో మనిషి ఆసరా కానప్పుడు, లేనప్పుడు.. ఆదుకునేది ఆర్థికపరమైన భరోసానే.

Railway Travel Insurance: మనిషికి మరో మనిషి ఆసరా కానప్పుడు, లేనప్పుడు.. ఆదుకునేది ఆర్థికపరమైన భరోసానే. గతించినవారు.. తమ గమ్యాన్ని చూసుకున్నా.. వారి ముందుచూపే.. మిగిలి ఉన్నవారికి ఆసరా అవుతుంది. కుటుంబానికి అలాంటి ఆసరా అందించేందుకే ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకొస్తుంటాయి. పని గట్టుకొని ప్రజల చేత పాలసీలు చేయిస్తుంటాయి. తాజా దుర్ఘటనలో చనిపోయినవారికి అలాంటి ఆసరా ఏమైనా దక్కుతుందా?

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన కొన్ని వాస్తవమైన అంశాలను ప్రజల ముందుకు తెస్తోంది. ప్రమాదానికి కారణాలూ, ఎక్కడ తప్పిదం జరిగిందీ, ఎవరు శిక్షార్హులూ అనేవి ఒక కోణమైతే.. ప్రమాదం అనంతర పరిణామాలు మరో అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో దాదాపు 275 మంది చనిపోయారు. దాదాపు 900 మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. వారిలో తీవ్రంగా గాయపడ్డవారు ఎంతమంది? స్వల్పంగా గాయపడినవారు ఎందరు? వారిలో శాశ్వతమైన వైకల్యానికి గురై.. జీవితాంతం ఇతరుల మీద ఆధారపడుతున్నవారు ఎందరు? తాత్కాలిక వైకల్యానికి గురై కొద్ది నెలల్లో కోలుకునేవారు ఎందరు? వారి కుటుంబాల ఆర్థిక స్వావలంబన తాలూకు సమాచారమేంటి? ఇలాంటి అంశాలే ప్రధానంగా మారుతుంటాయి.

భారతీయుడి తత్వ చింతన ఎంత సెంటిమెంటల్ గా ఉంటుందో అంత ప్రాక్టికల్ గా కూడా ఉంటుందంటారు పెద్దలు. బాలాసోర్ లో జరిగిన రైలు దుర్ఘటనలో వందలాది మంది ప్రాణాలు పోయాక.. బతికున్నవారి బతుకు చిత్రమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోయినవారు తమ దారిలో తాము వెళ్లిపోగా.. ఉన్నవారి పోరాటానికి ఆసరా అయ్యేదెవరు? ఎవరు ఆసరా అయినా.. ఎంతదూరం వారికి అండగా నిలుస్తారు? వారి కుటుంబాల పోషణ, పిల్లల చదువులు, పెద్దల రక్షణ, ఇతర అనేక అవసరాలు.. ఇలా చాలా ఉంటాయి. అదే ఇప్పుడు తీవ్రమైన చర్చాంశంగా మరోసారి ముందుకొస్తోంది. బతికున్న బాధితులు ఎందరున్నా, ఎలాంటి వర్గానికి చెందినవారైనా.. వారికి ఆసరా ఇచ్చేది తక్షణ ఆర్థిక సాయమే. మరి అలాంటి తక్షణ ఆర్థిక సాయం చేసే పరికరం ఏముంది? అదే ఇన్సూరెన్స్.

ఇన్సూరెన్స్ అనగానే.. మనందరికీ చాలా చులకన భావం. ఇప్పుడే చెప్పుకున్నాం.. భారతీయుడు ఎంత సెంటిమెంట్ గా ఆలోచిస్తాడో.. అంతే ప్రాక్టికల్ గా ఉంటాడని. ఎందుకంటే బతికున్నవారి బాగోగుల గురించి బాగా ఆలోచించే హృదయ ఔన్నత్యం ఉన్నవాడు భారతీయుడే అంటారు చాలా మంది. అది నిజం కూడా. అయితే మరో కోణంలో అందుకు పూర్తి విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తుంటారన్న పేరుంది. ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చే ఏజెంట్లను సగటు భారతీయులు ఎంత లైట్ తీసుకుంటారో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ అనేక సినిమాల్లో అనేక రకాల కామెడీ స్కిట్స్ కూడా వచ్చాయి.

మనవాళ్లు ఇన్సూరెన్స్ ఏజెంట్ ని ఎంత చులకనగా చూస్తారో ఆ దృశ్యమే ఓ నిదర్శనం. ఇప్పుడు మళ్లీ బాలాసోర్ దుర్ఘటన దగ్గరికి వద్దాం. దాదాపు 275 మంది మృతుల్లో ఎంతమంది రైల్వే ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలీదు. మామూలుగా టికెట్ బుక్ చేసుకునేప్పుడే ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా పెద్దదేం కాదు. జస్ట్ 35 పైసలు మాత్రమే. కానీ ఆ 35 పైసల ఆప్షన్ ను మాత్రం చాలా మంది పనిగట్టుకొని అన్-టిక్ చేసి మరీ ప్రొసీడ్ అవుతారు. ఆ.. నాకేం కాదులే. నేనే చేసే ట్రెయిన్ జర్నీ చాలా సేఫ్ గా ఉంటుంది లే. ఇప్పుడు ట్రెయిన్ ఎక్కి.. మరికొద్ది గంటల్లో నా డెస్టినేషన్ చేరుకుంటాను కదా... అనవసరంగా, అపశకునంగా ఈ జర్నీ పాలసీ మాత్రం ఎందుకు.. అన్న ఆలోచన బుర్రలో తడుతుంది. దీంతో టిక్ మార్క్ తీసేసి ప్రయాణికులు ముందుకెళ్తుంటారు.

కానీ బాలాసోర్ లో ఏం జరిగింది? ఎవరైనా ఊహించారా? 275 మంది చనిపోతారని ఎవరైనా ఊహించారా? వందలాది మంది క్షతగాత్రులవుతారని ఎవరైనా కల గన్నారా? అయితే ముందుచూపుతో రైల్వే ఇన్సూరెన్స్ చేసుకున్నవారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చంటున్నారు రెగ్యులర్ ప్రయాణికులు. ఒకవేళ వారే గనక రైల్వే ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటే.. ఇప్పుడు అందే మొత్తానికి మరో 10 లక్షలు జమ అయ్యేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

బాలాసోర్ దుర్ఘటన జరిగిన తీరు.. అత్యంత అరుదైందిగా చెబుతున్నారు. ఒకేసారి కొద్ది సెకన్ల తేడాలో 3 రైళ్లు ఢీకొనడం చాలా అరుదైందిగా చెబుతున్నారు. అందుకే ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని, మృతుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదైందని అధికారులు అంటున్నారు. ప్రధాని మోడీ ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు 40 నిమిషాలు అక్కడే ఉన్నారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. మానవ తప్పిదాలు, సాంకేతిక అంశాలపై ఆరా తీశారు.

మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంగా కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అటు రైల్వే అధికారులు మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇవి కామన్ గా అందరు బాధితుల కటుంబాలకూ అందుతాయి. అంటే దాదాపు 275 మంది మృతుల కుటుంబాలకు ఆ 12 లక్షలూ అందుతాయన్నమాట. అవి కాకుండా ఒడిశా మృతులకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తన వంతుగా 5 లక్షల ఆర్థిక సాయం, తమిళనాడు సర్కారు ఆ రాష్ట్ర మృతులకు 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక ఏపీ సర్కారు కూడా ఏపీకి చెందిన మృతులకు 10 లక్షల ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడ్డవారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అనౌన్స్ చేసింది. ఇవన్నీ చెప్పుకోదగిన స్థాయి ఆర్థిక సాయాలే. అయినప్పటికీ ట్రెయిన్ జర్నీకి టికెట్ బుకింగ్ సమయంలో ఆ 45 పైసలకు టిక్ చేసుకొని ఉన్నవారికి అదనంగా మరో లక్ష రూపాయల ఆర్థిక సాయం అంది ఉండేదంటున్నారు రైల్వే అధికారులు. రైల్వే ఇన్సూరెన్స్ కంపెనీ.. ఆ పది లక్షల అమౌంట్ ని బాధితుల ఇంటికి చేరుస్తుంది. అయితే ఎంతమంది ఆ 35 పైసలకు టిక్ చేసుకొని ఉంటారన్న దానిమీదనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ఇక ట్రెయిన్ జర్నీ మాత్రమే కాదు.. ఎయిర్ జర్నీ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ట్రెయిన్ జర్నీలో ఆప్షన్ గా ఉన్న ఇన్సూరెన్స్ కాస్తా.. ఎయిర్ జర్నీకి వచ్చేటప్పటికీ కంపల్షన్ గా మారింది. ఎయిర్ బక్ ఫెయిర్ తో పాటు.. ఇన్సూరెన్స్ మొత్తం కూడా కలిపి ఫెయిర్ పడుతుంది. అలాంటివాటితో ఇబ్బందేమీ లేదు. ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే.. ఆటోమేటిగ్గా ఫ్యామిలీకి ఓ ఆసరా మిగులుతుందంటున్నారు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ నిపుణులు. అయితే ప్రయాణాలు చేసినప్పుడో, అడ్వంచరస్ గేమ్స్ ఆడినప్పుడో ఫామ్ నింపే సందర్భంలో ఇన్సూరెన్స్ చేయించుకోవడం వేరు. సంప్రదాయ పద్ధతిలో కిస్తీలు కట్టుకుంటూ కుటుంబ భవిష్యత్ కోసం చేసే ఇన్సూరెన్స్ లు వేరు. అయితే ఇలాంటి అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్ని ఇన్సూరెన్స్ లు చేయించుకుంటే అంతమంచిది అంటున్నారు ఇన్సూరెన్స్ నిపుణులు. మనిషి పోతే.. అన్ని కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ మొత్తాన్ని సంబంధిత కుటుంబానికి చెల్లిస్తాయి. అంటే కుటుంబ యజమాని బతికున్నప్పుడు ఆయన ఆసరాతో కుటుంబమంతా ఎంత ఆత్మగౌరవంతో బతికిందో.. ఆయన పోయాక కూడా అంతే ఆత్మగౌరవంతో బతగ్గలుగుతుందన్నమాట. అందుకే ఇన్సూరెన్స్ ఏజెంట్ ను లైట్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఏజెంట్ కు కమిషన్ వస్తే వస్తుందేమో గానీ.. అంతకన్నా ఆ కుటుంబానికే ఎక్కువ మేలు జరుగుతుందనేది గుర్తించాలంటున్నారు.

ఆన్‎లైన్లో రైల్ టికెట్లను టపాటపా బుక్ చేసుకునే పాసింజర్లలో చాలామంది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఎంచుకోవడం లేదు. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే, అసలు అలాంటి ఆప్షన్ ఒకటి ఉందని కూడా కొందరికి తెలియకపోవడం మరొక ప్రధాన కారణం. బీమా కోసం చెల్లించాల్సిన మొత్తం ఒక్క రూపాయి కన్నా తక్కువే కాబట్టి, పోతేపోనీ ఒక్క రూపాయి అనుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. పొద్దున లేస్తే ఎంతో పెద్ద మొత్తాలను అలవోకగా ఖర్చు చేస్తున్న మనం.. ట్రెయిన్ జర్నీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. అర్ధరూపాయి విలువ చేయని ఇన్సూరెన్స్ బటన్ నొక్కడం లేదు. దురదృష్టవశాత్తూ ఒడిశా లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల దాకా కవరేజ్ అందుతుందన్న విషయం ఇకనైనా గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. గాయపడినవారికి కూడా బీమా కవరేజ్ ఉండడం విశేషం.

మరో విషయం. నామినీ పేరును కూడా చేర్చాలి. ఆన్ లైన్లో రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నప్పుడు.. ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి ఓ లింక్ వస్తుంది. ఆ లింకును సంబంధిత బీమా సంస్థ పంపుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభతరం అవుతుంది. లేకపోతే చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక్కోసారి చెల్లింపు జరక్కపోవచ్చు కూడా. నామినీగా స్పోజ్ పేరును లేదా తల్లి, తండ్రి పేరును, సంతానం పేర్లను చెప్పాల్సి ఉంటుంది. అది లేకపోతే ఆ డబ్బు ఎవరికి చెల్లించాలన్న ప్రశ్న ఉత్పన్నమై బీమా చెల్లింపు ముందుకు పడదంటున్నారు నిపుణులు.

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్న సందర్భంలో జరిగిన నష్టాన్ని బట్టి.. బీమా మొత్తం అందుతుంది. పాలసీ చేసిన ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి 10 లక్షలు అందుతుంది. పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా కూడా బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలు పరిహారంగా అందజేస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి ఏడున్నర లక్షలు, గాయాలు అయితే 2 లక్షలు ఆసుపత్రి ఖర్చుల కింద చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల దాకా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు. అయితే భారతీయ రైల్వే అందిస్తున్న ఈ ఫెసిలిటీని మీరు గతంలో పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇకపై మాత్రం మరచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీరు చూపే చిన్నపాటి శ్రద్ధ, మీ కుటుంబం మొత్తానికి ఆర్థిక రక్ష అని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories